‘తెలంగాణ నుండి పోటీ చేయండి’.. సోనియాగాంధీకి CM రేవంత్‌ కీలక విజ్ఞప్తి

by Satheesh |
‘తెలంగాణ నుండి పోటీ చేయండి’.. సోనియాగాంధీకి CM రేవంత్‌ కీలక విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగా సమిష్టిగా కృషి చేస్తున్నామని, ఇప్పటికే రెండు గ్యారంటీలను అమల్లోకి తెచ్చి త్వరలో మరో రెండింటికి శ్రీకారం చుడుతున్న అంశాన్ని పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీకి, రాహుల్‌గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి వెళ్ళిన సీఎం రేవంత్ నేతృత్వంలోని బృందం.. తొలుత రాంచీలో రాహుల్‌గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు. ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరించారు. ఇప్పటికే అమల్లోకి వచ్చిన రెండు గ్యారంటీలతో పాటు త్వరలో ప్రారంభించనున్న మరో రెండింటిపై వివరించారు.

రాంచీ నుంచి ఢిల్లీ వెళ్ళిన రాష్ట్ర ప్రతినిధి బృందం సోనియాగాంధీని ఆమె నివాసంలో సోమవారం సాయంత్రం కలుసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి వెళ్ళి కలవడం ఇదే ఫస్ట్ టైమ్. పావుగంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో దాదాపు రెండు నెలల పాలనపై సంక్షిప్తంగా వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్‌ను ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల వ్యవధిలోనే లాంఛ్ చేయడం, ఇప్పటివరకు సుమారు 15 కోట్ల మంది మహిళలు ప్రయాణించినట్లు ఆమెకు వివరించారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేలా ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ఇప్పటివరకూ ఉన్న రూ. 5 లక్షల గరిష్ట పరిమితిని రూ. 10 లక్షలకు పెంచిన అంశాన్ని కూడా వివరించారు.

మరో రెండు గ్యారంటీల అమలుపై ఫోకస్:

త్వరలో మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్‌ను అందించడం, గృహజ్యోతి గ్యారంటీ కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలును ప్రారంభించనున్నట్లు సోనియాగాంధీకి వీరు వివరించారు. ఈ రెండింటిని వీలైనంత తొందరలో అమల్లోకి తెచ్చేలా రాష్ట్ర మంత్రివర్గంలోనూ లోతుగా చర్చ జరిగింది. అసెంబ్లీ వేదికగానే వీటిని సీఎం రేవంత్ లాంఛనంగా ప్రకటిస్తారని మంత్రి పొంగులేటి మీడియాకు వివరించారు. వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో రానున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లోనే ఇందుకు సంబంధించిన నిధుల కేటాయింపు ఉండనున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ రెండు గ్యారంటీలను త్వరలోనే అమలు చేయడానికి అవసరమైన నిధుల సమీకరణకు దాదాపు లైన్ క్లియర్ అయింది.

సమిష్టి కృషితో సత్ఫలితాలు:

రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా మంత్రివర్గమంతా సమిష్టిగా చేస్తున్న కృషిని ఇటు సోనియాగాంధీకి, అటు రాహుల్‌గాంధీకి వివరించారు. ముగ్గురూ కలిసి వెళ్ళడంతో అభిప్రాయ భేదాలకు తావులేదనే మెసేజ్‌ను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళారు. ఢిల్లీ వెళ్ళే ప్రతిసారీ డిప్యూటీ సీఎంను లేదా ఎవరో ఒక మంత్రిని సీఎం రేవంత్ తీసుకెళ్ళడం పార్టీలోనే ఒక మంచి సంప్రదాయానికి దారి తీసిందని పార్టీ నేతలే గొప్పగా చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భేదాభిప్రాయాలకు తావు లేకుండా పార్టీ పటిష్టంగా ఉండేందుకు, పాలనా ఫలాలు ప్రజలకు అందేందుకు, హామీలను నెరవేర్చేందుకు జరుగుతున్న టీమ్ ఫంక్షనింగ్‌ పార్టీ అధినాయకత్వం దృష్టిలోకి వెళ్ళింది.

తెలంగాణ నుంచి పోటీ చేయండి:

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా సోనియాగాంధీని రిక్వెస్టు చేశారు. ఇప్పటికే పీసీసీ ఈ మేరకు తీర్మానం చేసిందనే అంశాన్ని ఆమెకు వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లిగా ప్రజలు గుర్తిస్తున్నారని, అందువల్లనే వారు కూడా తెలంగాణ నుంచి పోటీ చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఆమె దృష్టికి తీసుకెళ్ళారు. స‌రైన స‌మ‌యంలో నిర్ణయం తీసుకుంటాన‌ని సోనియాగాంధీ వీరికి హామీ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆశావహుల నుంచి వచ్చిన దరఖాస్తులను, పోటీ చేయడానికి వస్తున్న ఆసక్తిని ఆమెకు వివరించారు. ప్రతీ లోక్‌సభ సెగ్మెంట్‌కు వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి బలమైన, పాపులారిటీ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

కులగణనకు సన్నాహాలు షురూ:

ఏఐసీసీ పాలసీకి అనుగుణంగా తెలంగాణలోనూ కులగణన చేపట్టాలని మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని సోనియాగాంధీకి వివరించి దీనికి తగిన సన్నాహాలను మొదలుపెట్టినట్లు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి తెలిపారు. మంత్రివర్గంలోనూ దీనిపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకున్న విషయాన్ని వివరించారు. దీనికి సంబంధించిన లీగల్ ప్రొసీజర్‌పై అధికారుల స్థాయిలో కసరత్తు మొదలైంది. అసెంబ్లీ సమావేశాల్లోనూ దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశమున్నది. ఇప్పటికే కర్ణాటకలో మొదలైన ప్రాసెస్‌పై రాష్ట్ర అధికారులు దృష్టి పెట్టారు. బీహార్ రాష్ట్రం కంప్లీట్ చేసిన కులగణన ప్రక్రియపైనా తెలంగాణ ఆఫీసర్లు స్టడీ చేస్తున్నారు. వాటికంటే బెటర్‌గా ఉండేలా మార్గదర్శకాలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

నీతీ ఆయోగ్ వైస్ ఛైర్మన్‌తో భేటీ:

కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ‌కు రావ‌ల్సిన రూ. 1800 కోట్ల గ్రాంట్‌ను వెంట‌నే విడుద‌ల‌య్యేలా స‌హ‌క‌రించాల‌ని నీతీ ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమ‌న్ భేరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయనను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క‌లిసి పలు అంశాలపై చర్చించారు. హైద‌రాబాద్‌ నగరంలో మూసీ న‌ది రివ‌ర్ ఫ్రంట్ అభివృద్ధికి అవ‌స‌ర‌మైన నిధులు ఇప్పించాల‌ని కోరారు. ప్రపంచ‌ బ్యాంకు ఎయిడ్ విడుద‌ల‌కు మ‌ద్దతు ఇవ్వాల‌ని రిక్వెస్టు చేశారు. రాష్ట్రంలో తాగు నీటి స‌ర‌ఫ‌రాకు అవ‌స‌ర‌మైన నిధులతో పాటు వైద్య, ఆరోగ్య, విద్యా రంగాల్లో తీసుకురానున్న సంస్కర‌ణ‌ల‌కు మ‌ద్దతు ఇవ్వాల‌ని విజ్ఙప్తి చేశారు.

Advertisement

Next Story