రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. చర్చించిన అంశమిదే..!

by Rajesh |   ( Updated:2024-06-24 13:33:04.0  )
రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. చర్చించిన అంశమిదే..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల బృందంతో వెళ్లి ఇవాళ సాయంత్రం రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా వీరి మధ్య 25 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లోని రక్షణశాఖ భూముల బదలాయింపు, కొన్ని జిల్లాల్లో సైనిక్ స్కూళ్ల పెంపు, తదితర అంశాలపై చర్చ జరిగింది. మెహిదీపట్నం రైతు బజార్ వద్ద స్కైవాక్ నిర్మాణానికి రక్షణశాఖ భూమి ఆటంకంగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న రక్షణ శాఖకు చెందిన 0.21 హెక్టార్లను బదిలీ చేయాలని ముఖ్యమంత్రి కోరారు. అలాగే హైదరాబాద్ నుంచి కరీంనగర్-రామగుండంను కలిపే రాజీవ్ రహదారిలో ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వరకు 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణం కోసం డిఫెన్స్ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.

అలాగే నాగ్‌పూర్ హైవే(ఎన్‌హెచ్-44)పై కండ్లకోయ సమీపంలోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీలకు, భవిష్యత్తులో డబుల్ డెక్కర్(మెట్రో కోసం)కారిడార్‌తో పాటు ఇతర నిర్మాణాలకు కలిపి మొత్తం 56 ఎకరాల రక్షణశాఖ భూములను బదిలీ చేయాలని కోరారు. కాగా రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీలో సీఎం వెంట కాంగ్రెస్ ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్ కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, బలరాం నాయక్, మల్లు రవి, సురేశ్ షెట్కార్ తదితరులు ఉన్నారు కాగా రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్.. కేంద్ర గృహ నిర్మాణశాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

త్వరలో సీఎం వరంగల్ టూర్

ఈ నెల 28న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరంగల్ నగరంలో పర్యటించబోతున్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై దృష్టి సారించిన సీఎం.. కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ(కుడా) పరిధిలో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులపై హనుమకొండ కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ రివ్యూ మీటింగ్‌కు కావాల్సిన పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాలని అధికారులకు సీఎంఓ ఆదేశించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed