ఇకపై పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండదు.. సీఎం రేవంత్ హామీ

by GSrikanth |
ఇకపై పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండదు.. సీఎం రేవంత్ హామీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడచిన పదేండ్లలో ఆర్థికంగా, సామాజికంగా విధ్వంసమైన తెలంగాణను పునర్‌‌ నిర్మించాల్సిన అవసరం ఉన్నదని, ఇందులో పోలీసులు కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో గురువారం జరిగిన ఐపీఎస్ ఆఫీసర్ల ‘గెట్‌ టు గెదర్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, పోలీసులపై ప్రభుత్వం నుంచి ఎలాంటి పెత్తనం ఉండబోదని హామీ ఇచ్చారు. పోలీసులను సబ్‌ ఆర్డినేట్ అధికారులుగా చూసే పద్ధతి ఈ ప్రభుత్వంలో ఉండదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన ఓ అవకాశంగా మాత్రమే భావిస్తున్నామని, ప్రజలకు సేవ చేయడంలో అందరినీ కలుపుకుపోతామన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పునర్‌‌ నిర్మాణంలో పోలీసులు ఇచ్చే సలహాలు, సూచనలను వినమ్రంగా స్వీకరిస్తామని స్పష్టం చేశారు.

గత పదేండ్ల కాలంలో రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతిన్నదని, ఈ పరిస్థితి నుంచి తెలంగాణను బయటపడేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ బృహత్ కార్యంలో పోలీస్ ఆఫీసర్లు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ క్రయ విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, హైదరాబాద్‌ను ‘డ్రగ్స్‌-ఫ్రీ సిటీ’గా చేయాలని సూచించారు. యువతీ, యువకులను డ్రగ్స్ వ్యసనం నుంచి బయటపడేయాలన్నారు. రోజురోజుకూ సైబర్ నేరాలు ముప్పుగా పరిణమించాయని, వాటిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఆఫీసర్లకు విజ్ఞప్తి చేశారు. అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుంటూ అభివృద్ధి చెందిన దేశాల్లో అనుసరిస్తున్న పద్ధతులపై అధ్యయనం చేయాలని సూచించారు.

శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం కష్టపడుతున్నారంటూ ఐపీఎస్ అధికారులను సీఎం అభినందించారు. పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డీజీపీ రవిగుప్తా, అదనపు డీజీ శివధర్రెడ్డి, సీఐడీ అదనపు డీజీ షికా గోయల్, హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, ఇతర పోలీసు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed