CM Revanth Reddy: మూసీలో ఆత్మహత్య చేసుకున్నా నిన్ను పట్టించుకోరు.. కిషన్ రెడ్డిపై సీఎం ఫైర్

by Prasad Jukanti |
CM Revanth Reddy: మూసీలో ఆత్మహత్య చేసుకున్నా నిన్ను పట్టించుకోరు.. కిషన్ రెడ్డిపై సీఎం ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : శిల్పారామం, ట్యాంక్‌బండ్, హైటెక్‌సిటీ వద్ద సెల్ఫీలు దిగుతూ సెల్ఫ్ డబ్బాలు కొడుతున్నారని కానీ ఇదంతా గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధేనని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిపై గత ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), గత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప సిటీలో కనీసం డ్రైనేజీ కాల్వలను కూడా తవ్వించలేకపోయారని విమర్శించారు. వాళ్లు చేసిన వెధవ పనులకు ఫామ్‌హౌస్‌లో పడుకున్నారని వారి గురించి మాట్లాడటం కూడా దండగేనని ఘాటు విమర్శలు చేశారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ హైదరాబాద్ ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్ఎండీఏ మైదానంలో జరిగిన హైదరాబాద్ రైజింగ్ వేడుకలను సీఎం ప్రారంభించారు. సిటీలో ఫ్లైఓవర్స్, అండర్ పాస్, ఆర్ యూబీ, ఆర్వోబీలకు తదితర పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ట్యాంక్ బండ్ నీళ్లు కొబ్బరినీళ్లలా మారుస్తానని చెప్పి పదేళ్లలో మురికికూపంగా మార్చిన చరిత్ర కేసీఆర్‌దని అన్నారు. రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ పెరిగిందన్నారు. ఆక్రమణదారులను నిద్రలో కూడా హైడ్రా ఉలిక్కిపడేలా చేస్తున్నదన్నారు.

మూసీలో పడుకున్నా కిషన్‌రెడ్డిని పట్టించుకోరు..

కిషన్‌రెడ్డి మూసీలో పడుకున్నా.. అందులో ఆత్మహత్య చేసుకున్నా ఇక్కడి ప్రజలు ఆయన్ను పట్టించుకోరని సీఎం విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే మోడీ (Modi) దగ్గర నుంచి రూ. 25 వేల కోట్ల నిధులు మూసీ అభివృద్ధికి తీసుకురావాలని సూచించారు. ‘మొసలి కన్నీళ్లు కారుస్తున్నావ్ కదా.. ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన కింద రూ.10 వేల కోట్లు తీసుకురా. భూమి నేను ఇస్తా. పేదోళ్లకు ఇండ్లు నిర్మించి ఇద్దాం’ అని పేర్కొన్నారు. మోడీ గుజరాత్‌కు బుల్లెట్ ట్రైన్, సబర్మతి రివర్ ఫ్రంట్, గిఫ్ట్ సిటీ తీసుకెళ్తే తెలంగాణకు కిషన్‌రెడ్డి ఏం తీసుకొచ్చాడని ప్రశ్నించారు. ఆరేళ్లుగా కేంద్రమంత్రిగా పని చేస్తున్న ఆయన రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్నారు. మెట్రో విస్తరణకు, ట్రిబుల్ ఆర్, రేడియల్ రోడ్లకు, మూసీప్రాజెక్టుకు ఎన్ని నిధులు తేస్తారో కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రజలకు సమాధానం చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. హైదరాబాద్‌కు నిధులు తేస్తారా లేక గుజరాత్‌కే వలస వెళ్లి బతుకుతారా అంటూ ఘాటు వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి మూసీ ప్రాజెక్టుకు ఎందుకు అడ్డం పడుతున్నారని సీఎం ప్రశ్నించారు.

హైదరాబాద్‌కు ఆ పరిస్థితి వద్దు..

ప్రపంచంతోనే పోటీ పడుతున్న హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. న్యూయార్స్, టోక్యోతో సమానంగా నగరాన్ని నడిపిస్తామన్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి నగరాల్లో కాలుష్యం కోరలు చాచిందని, హైదరాబాద్‌లో ఆ పరిస్థితి నగరానికి తీసుకురావొద్దనేది తమ ప్రయత్నం అని చెప్పారు. భవిష్యత్ తరాలకు అద్భుతమైన నగరం అందించేందుకే ఫ్యూచర్ (Future City) సిటీ నిర్మిస్తున్నామన్నారు. మరో 15 వేల ఎకరాల ఫారెస్టు ల్యాండ్ ఉందని, మరో 15 వేల ఎకరాల భూములు రైతులు సహకరించి అందిస్తే అద్భుతమైన నగరాన్ని నిర్మించి న్యూయార్స్, టోక్యో, సింగపూర్ నగరాలకు పోటీ పడేలా చేస్తామని సీఎం పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed