‘దొంగ జపానికి కొంగ మళ్లీ బయలుదేరింది’.. కేసీఆర్‌పై CM రేవంత్ సెటైర్స్

by Disha Web Desk 19 |
‘దొంగ జపానికి కొంగ మళ్లీ బయలుదేరింది’.. కేసీఆర్‌పై CM రేవంత్ సెటైర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఎల్బీనగర్‌లో రేవంత్ రెడ్డి రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షెడ్డుకు పోయిన కారు తుప్పు పట్టిందని.. అది మళ్లీ రాదని ఎద్దేవా చేశారు. ఓడిపోయి ఉద్యోగం పోయాక కేసీఆర్‌కు ఇప్పుడు ప్రజలు గుర్తుకు వచ్చారని.. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు దొంగజపం చేసే కొంగ బయలుదేరిందని కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ విమర్శించారు. ఇప్పుడు 400 ఎంపీ సీట్లు ఇవ్వాలని మోడీ అడుగుతున్నారు.. 400 సీట్లలో బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేయాలని మోడీ భావిస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేసేందుకు మోడీ సిద్ధంగా ఉన్నారని అన్నారు.

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటునే అవమానించిన మోడీ తెలంగాణ ప్రజల ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. మెట్రో ప్రాజెక్టు అడిగితే బీజేపీ నేతలు జైశ్రీరాం అంటారు.. రాష్ట్రానికి నిధులు అడిగితే హనుమాన్ జయంతి నిర్వహించాం అంటున్నారని సెటైర్ వేశారు. గుడిలో ఉండాల్సిన దేవుడిని బీజేపీ వాళ్లు రోడ్ల మీదకు తెచ్చారని ఫైర్ అయ్యారు. ఇన్నేళ్లు మనం శ్రీరామనవమి, హనుమాన్ జయంతి జరుపుకోలేదా అని ప్రశ్నించారు. మోడీ, కేసీఆర్ కలిసి గ్యాస్ సిలిండర్ ధరను రూ.1200కు పెంచారని.. మేం అధికారంలోకి వచ్చాక రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed