అలా అంటే తెలంగాణను అవమానించడమే.. BJPపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

by Disha Web Desk 4 |
అలా అంటే తెలంగాణను అవమానించడమే.. BJPపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రంలోని బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోరుట్లలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ దాహార్తి తీర్చేందుకు అదనంగా కృష్ణా జలాలు అడిగితే కేంద్రంలోని బీజేపీ ఇవ్వలేదన్నారు. మోడీ తెలంగాణను అవమానించి ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ కుట్రలు బయటపెడతా అన్నారు. రాజ్యాంగాన్ని బీజేపీ ఎలా మార్చాలని చూస్తోందో వివరిస్తా అన్నారు.

రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ కమిషన్ వేసిందన్నారు. రాజ్యాంగ మార్పు అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగంలోనే చేర్చారు అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కొనసాగించాలని చెప్పినందుకు తనపై కేసు పెడతారా అని మండిపడ్డారు. 20 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లు చూశానని.. గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణలో పెత్తనం చేద్దామనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ ఆధిపత్యానికి, తెలంగాణ పౌరుషానికి ఈ ఎన్నికల్లో పోటీ అన్నారు. దమ్ముంటే రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఓట్లు అడగండని బీజేపీ నేతలకు ముఖ్యమంత్రి సవాల్ విసిరారు.

ఎన్నికల ప్రచారం మానేసి.. తాను ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరు కావాలా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ దగ్గర సీబీఐ, ఈడీ, ఐటీ ఉంటే.. తమ దగ్గర నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నారని రేవంత్ అన్నారు. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. కుల గణనకు మోడీ ఒప్పుకోవడం లేదని.. కార్పొరేట్లకు దేశాన్ని అమ్మాలని కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పదేళ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేశారన్నారు. కాంగ్రెస్ ముక్త్ బారత్ అంటే మేము ఇచ్చిన తెలంగాణను అవమానించడమేనా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Read More...

కాంగ్రెస్ అకౌంట్‌కు నాకు అసలు సంబంధమే లేదు: రేవంత్ రెడ్డి

Next Story