ఒడిషా నైని బ్లాక్‌లో బొగ్గు తవ్వకాలపై డిప్యూటీ CM భట్టి కీలక ఆదేశాలు

by Rajesh |   ( Updated:2024-07-17 17:33:41.0  )
ఒడిషా నైని బ్లాక్‌లో బొగ్గు తవ్వకాలపై డిప్యూటీ CM భట్టి కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఒడిషాలోని అంగుల్ జిల్లా ఛెండిపడలోని నైని బొగ్గు బ్లాకుల్లో నాలుగు నెలల్లో ఉత్పత్తి ప్రారంభం కావాలని సింగరేణి అధికారులను డిప్యూటీ సీఎం (ఇంధన శాఖ మంత్రి కూడా) మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఇటీవలే ఒడిషా ముఖ్యమంత్రితో భేటీ అయిన సందర్భంగా బొగ్గు తవ్వకాలకు అవసరమైన అన్ని అనుమతులు లభించేలా విజ్ఞప్తి చేశారు. సానుకూల స్పందన రావడంతో వెంటనే అన్ని రకాల డాక్యుమెంటేషన్ వర్క్స్ కంప్లీట్ చేసి నాలుగు నెలల్లో మైనింగ్ యాక్టవిటీస్ ప్రారంభం కావాలని ఆదేశించారు. బొగ్గు తవ్వకాలతో కొన్ని గ్రామాల్లోని ప్రజలు నిర్వాసితులు అవుతున్నందున ఆర్ అండ్ ఆర్ (రిహబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్) చట్టం ప్రకారం మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని, సింగరేణి సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ప్రకారం ప్రజలకు అవసరమైన పనులు చేపట్టి ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి కోసం నిర్దిష్ట టైమ్ టేబుల్‌ను రూపొందించుకోవాలని సింగరేణి అధికారులకు స్పష్టం చేశారు. బొగ్గు తవ్వకాలకు అవసరమైన అనుమతుల విషయంలో ఏమేం మిగిలిపోయాయో స్టడీ చేసి వాటిని సత్వరం పొందేలా ఆ రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. సింగరేణి అధికారులతో బుధవారం నిర్వహించిన సందర్భంగా పై ఆదేశాలు ఇచ్చారు. నైని కోల్ బ్లాక్‌ను ఇటీవల స్వయంగా సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క... భూ సేకరణతో నిర్వాసితులు అవుతున్న అక్కడి గ్రామ ప్రజలతో, స్థానిక ఎమ్మెల్యే అగస్తి బెహరాతో కలిసి చర్చించి సహకారం అందించాల్సిందిగా కోరారు. ప్రత్యామ్నాయంగా వారి ఉపాధి, పునరావాసం కోసం తగిన చర్యలను సింగరేణి తరఫున సమకూరుస్తామని కూడా వారికి డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. బొగ్గు తవ్వకాలకు అన్ని రకాల అనుమతులు లభించినందున ఆ రాష్ట్ర అటవీ శాఖ ఇప్పటికే బదలాయించిన 783 హెక్టార్లలోని చెట్లను లెక్కించి వాటిని తొలగింపుపై దృష్టి పెట్టాలన్నారు.

బొగ్గు తరలింపునకు అవసరమైన రోడ్ల విస్తరణ పనులు జరగాల్సి ఉన్నందున ఓపెన్ కాస్ట్ ప్రాంతం నుంచి ఛెండిపడ వరకు ఉన్న ప్రస్తుత రోడ్డును వైడెనింగ్ చేయడం, హైటెన్షన్ విద్యుత్ లైన్‌ను నిర్మించడం తదితర పనులలో వేగం పెరగాలన్నారు. ఇందుకు రెండు రాష్ట్రాల్లోని రోడ్లు-భవనాలు, విద్యుత్ శాఖల అధికారులు సంప్రదింపులతో అన్ని పర్మిషన్లు వచ్చేలా చూడాలన్నారు. నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం, కల్పించాల్సిన పునరావాసం, సీఎస్ఆర్ కింద ఉపాధి అవకాశాల కల్పన తదితరాలన్నీ పూర్తిచేస్తే బొగ్గు తవ్వకాలకు తగిన గ్రౌండ్ ప్రిపేర్ అవుతుందని అధికారులకు డిప్యూటీ సీఎం వివరించారు. నైని బొగ్గు బ్లాక్ సింగరేణికి 2015లోనే దక్కినా ఇప్పటివరకూ ఉత్పత్తి ప్రారంభం కాలేదని, ఇప్పుడు అన్ని ఆటంకాలూ తొలగిపోయినందున వెంటనే చొరవ తీసుకుని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి కనీసం నాలుగు నెలల్లో బొగ్గు ఉత్పత్తి జరిగేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఓఎస్డీ సురేందర్‌రెడ్డి, జీఎం (కోఆర్డినేషన్) దేవేందర్, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, స్పెషల్ సెక్రటరీ కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed