CM Revanth: కేసీఆర్ కుటుంబం వద్ద రూ.లక్ష కోట్లు ఉన్నాయ్: సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు

by Shiva |   ( Updated:2024-09-03 15:40:49.0  )
CM Revanth: కేసీఆర్ కుటుంబం వద్ద రూ.లక్ష కోట్లు ఉన్నాయ్: సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోతగా వర్షాలు కురిశాయి. దీంతో తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వరదలు నివాస ప్రాంతాలన అతలాకుతలం చేశాయి. ఇక ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో 30కి పైగా కాలనీలు వరదలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలోనే వరద బాధితులను పరామర్శించేందుకు సోమవారం సీఎం రేవంత్ రోడ్డు మార్గంలో ఖమ్మంకు బయలుదేరారు. మంగళవారం ఉదయం ఆయన మహబూబాబాద్ జిల్లాలో వరద నీటిలో కొట్టుకుపోయిన యువ శాస్త్రవేత్త కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటం వల్లే పెద్ద నష్టం తప్పిందని అన్నారు. కృష్ణా, ఖమ్మం జిల్లాలు పక్కపక్కనే కవల పిల్లల్లాగే ఉంటాయని తెలిపారు.

కృష్ణా జిల్లా కంటే ఖమ్మం జిల్లాలోనే రికార్డు స్థాయిలో 42 సెం.మీ వర్షపాతం నమోదైందని అన్నారు. అందుకే ఎక్కవ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. త్వరలోనే విపత్తుకు కారణమైన మున్నేరు రిటైనింగ్ వాల్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. త్వరలోనే ఇంజినీర్లతో చర్చిస్తామని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో భారీగా దోపిడీ జరిగిందని ఆరోపించారు. అందుకే ఈ స్థాయిలో చెరువులు తెగాయని ఫైర్ అయ్యారు. వర్షం, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.5,430 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించి రాష్ట్రానికి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ నేతలపై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబం వద్ద రూ.లక్ష కోట్లు ఉన్నాయని రూ.2 వేల కోట్లు సీఎం సహాయనిధికి ఇవ్వొచ్చు కదా అని సెటైర్లు వేశారు. అమెరికాలో ఉండి కేటీఆర్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఏపీలో సీఎం చంద్రబాబు బాగా పని చేశాడని హరీశ్ అంటున్నాడని దుయ్యబట్టారు. త్వరలోనే అందరి లెక్కలు తీస్తామని.. ఖమ్మంలో పువ్వాడ అజయ్ ఆక్రమణల గుట్టును తేల్చేద్దామని.. హరీశ్‌ను రమ్మనండి నిజ నిర్ధారణ కమిటీ వేద్దామని సవాల్ విసిరారు. మరోవైపు బీజేపీ ఎంపీ ఈటల చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు డిమాండ్ చేశారని.. ఆ నిధులను కేంద్రం నుంచి ఈటలే తెప్పించాలని అన్నారు.

Advertisement

Next Story