సినీరంగ ప్రముఖులకు సీఎం రేవంత్ కీలక సూచన

by Satheesh |
సినీరంగ ప్రముఖులకు సీఎం రేవంత్ కీలక సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: గద్దర్ పేరుతో అవార్డులను ఇవ్వాలనుకునే అభిప్రాయాన్ని గతంలోనే వెల్లడించానని గుర్తుచేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. సినీ రంగ ప్రముఖులు నిర్దిష్ట ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకూ నంది అవార్డులతో సినీ రంగ ప్రముఖులను సత్కరించే సంప్రదాయం ఉన్నదని, అదే స్థాయిలో ప్రతి ఏటా డిసెంబరు 9న గద్దర్ పేరుతో సినీరంగ కళాకారులకు అవార్డులు ఇస్తామని ప్రకటించామని గుర్తుచేశారు.

కానీ ఇప్పటివరకు సినీ రంగం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందలేదని, ఇకనైనా నిర్దిష్ట ప్రపోజల్స్‌తో రావాలని కోరారు. దివంగత డాక్టర్ సి.నారాయణరెడ్డిని స్మరించుకోవడంలో భాగంగా ఆయన పేరుతో ‘విశ్వంభర’ జాతీయ సాహిత్య పురస్కారాన్ని శివశంకరికి రవీంద్రభారతిలో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు. ఆ సందర్భంగా సీం రేవంత్‌రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ సినారె 93వ జయంతి సందర్భంగా ఆయన భార్య సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

డాక్టర్ సినారె ఒక కవితగా, వైస్ ఛాన్సెలర్‌గా, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నో రూపాల్లో తెలుగు సమాజానికి సేవలందించారని సీఎం రేవంత్ తన ప్రసంగంలో గుర్తుచేసుకున్నారు. ఆయన కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన వ్యక్తి కాదని, మొత్తం తెలుగుజాతికే గర్వకారణమన్నారు. మారుమూల ప్రాంతానికి చెందిన సినారె తన సాహిత్య సృజన ద్వారా తెలుగు ప్రపంచంతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని పేర్కొన్నారు.

ఆయన జీవితం సాహిత్యరంగానికే కాక ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన సాహిత్యంలో అన్ని సెక్షన్ల ప్రజల జీవితాలు కనిపిస్తాయని, యధాలాపంగా రచనలు చేయకుండా లీనమై రచించారని కొనియాడారు. ఆ కారణంగానే ఆయన ఎప్పుడో రాసిన మాటలు, పాటలు, రచనలు ఇప్పటికీ మనకు నోటిమీదే గుర్తుంటున్నాయని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సినారె గతంలో రచించిన ‘సమన్వితం’ పుస్తకాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు.

డాక్టర్ సినారె జ్ఞాపకార్థం ఏం చేయాలనేదానిపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఆయన రచనలను గ్రంథరూపంలోకి తీసుకురావాలని ఎవరైనా కోరుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. డాక్టర్ సినారె పేరు మీద శివశంకరికి ‘విశ్వంభర’ జాతీయ సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేసిన అనంతరం ఆమెను అభినందించారు. తమిళనాట ప్రముఖ రచయిత్రిగా గుర్తింపు పొందిన శివశంకరి గతంలో సరస్వతీ సమ్మాన్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఇప్పుడు ‘విశ్వంభర’ అవార్డును సొంతం చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed