- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంబేద్కర్ జయంతి రోజు కేసీఆర్ భారీ ప్లాన్.. మోడీకి ఊహించని రేంజ్‌లో రిప్లయ్!
దిశ, తెలంగాణ బ్యూరో: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోడీ సీఎం కేసీఆర్, ఆయన ఫ్యామిలీని అవినీతి, కుటుంబ పాలన అంటూ పరోక్షంగా విమర్శించారు. ఎన్నడూ లేని విధంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ నుంచి ఇప్పటి వరకు రిప్లయ్ రాలేదు. అయితే సీఎం తగిన సమయం, వేదిక కోసం వేచి చూస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 14న అంబేడ్కర్ జయంతి రోజు రాజ్యాంగ నిర్మాత విగ్రహావిష్కరణ సందర్భంగా మోడీ ప్రస్తావించిన అంశాలపై ఘాటుగా రిప్లయ్ ఇచ్చేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది.
విధానపరంగానే..
అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగంలో కేసీఆర్ ఏయే అంశాలను ప్రస్తావిస్తారన్నదానిపైనే రాజకీయ వర్గాల దృష్టి కేంద్రీకృతమైంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై విధానపరంగానే సీఎం కేసీఆర్ జవాబివ్వాలనుకుంటున్నట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఓ వైపు అంబేడ్కర్ ను కీర్తిస్తూనే.. మరోవైపు రాజ్యాంగంలోని అంశాలను ప్రస్తావిస్తూ మోడీకి కౌంటర్ ఇవ్వాలనుకుంటున్నట్లు సమాచారం. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే లేకుంటే తెలంగాణ ఏర్పాటు సాధ్యమయ్యేది కాదని, అందుకు రాష్ట్ర ప్రజలు అంబేడ్కర్ కు రుణపడి ఉంటారనే అంశంతో మొదలుపెట్టి కేంద్ర విధానాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయంటూ ఉదాహరణలతో సహా వివరించడానికి కసరత్తు మొదలైంది. అంబేడ్కర్ ను నిరంతరం తల్చుకునే విధంగా రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరు పెట్టామని, కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన పార్లమెంటు (సెంట్రల్ విస్టా)కు కూడా అంబేడ్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీ చేసి ఏకగ్రీవ తీర్మానాన్ని మోడీ లెక్కలోకి తీసుకోలేదని, ఆయనమీద ఉన్న గౌరవం ఏపాటిదో దీన్నిబట్టి అర్థమవుతుందని విమర్శించే చాన్స్ ఉన్నది. అంతేకాకుండా ట్యాంక్ బండ్ సమీపంలో 125 అడుగుల ఎత్తయిన నిలువెత్తు విగ్రహాన్ని నిర్మించామని హైలైట్ చేయాలనుకుంటున్నారు.
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా..
కేంద్ర, రాష్ట్ర సంబంధాలతోపాటు సహకార సమాఖ్య స్ఫూర్తి విషయంలో చాలా దూరదృష్టితో అంబేడ్కర్ రాజ్యాంగంలో స్పష్టమైన అధికరణాలను పొందుపరిచారని, కానీ కేంద్ర ప్రభుత్వం వాటిని గాలికొదిలేసిందని కేసీఆర్ విమర్శించే అవకాశమున్నది. రాష్ట్రాల హక్కులను హరిస్తున్నదంటూ మరోసారి చెప్పే చాన్స్ ఉన్నది. అనేక రాష్ట్రాలు ప్రస్తుతం ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నాయని గుర్తుచేయవచ్చన్న ఊహాగానాలు గులాబీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
కేంద్రం సహకరించకపోయినా..
కేంద్రం నుంచి తగిన సహకారం లేకపోయినా రాష్ట్రమే తన సొంత వనరులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి సక్సెస్ అయిన పలు అంశాలను ప్రస్తావించే చాన్స్ ఉన్నది. అభివృద్ధికి కేంద్రం సహకరించకపోగా రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకుంటున్నదనే విమర్శలను కొన్ని ఉదాహరణలతో ప్రస్తావించడానికి ఇప్పటికే కొన్నింటిని ఎంపిక చేసినట్లు తెలిసింది. గవర్నర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రానికి జరుగుతున్న చేటు, ఫలితంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రజలకు జరుగుతున్న నష్టం లాంటి విషయాలను కూడా ఈ వేదిక ద్వారా ఉదహరించే అవకాశమున్నది.
ఉదాహరణలతో..
విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదన్న అంశంతో పాటు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తున్నదనే అంశాన్ని కూడా కొన్ని ఉదాహరణలతో వివరించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం మొదలు సుప్రీంకోర్టు కొలీజియం లాంటి అనేక వ్యవస్థల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని కూడా ప్రస్తావించే అవకాశమున్నది. ప్రధాని మోడీ కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ మొత్తం కుటుంబాన్ని విమర్శించినా ముఖ్యమంత్రి సైలెంట్‌గా ఉండిపోడానికి కారణం సరైన వేదిక మీద నుంచి తిప్పికొట్టాలన్న వ్యూహంలో భాగమేనని గులాబీ వర్గాలు పేర్కొన్నాయి. మోడీకి కేసీఆర్ ఘాటుగానే పరోక్ష విమర్శలతో సమాధానం ఇస్తారన్న నమ్మకం గులాబీ నేతల నుంచి వ్యక్తమవుతున్నది.
Also Read..
ప్రభుత్వ భూమిలో BRS MP పాగా.. భూ దోపిడీలను సీరియల్‌గా ప్రకటిస్తా: రేవంత్ రెడ్డి