అసెంబ్లీ వేదికగా కేసీఆర్ భారీ స్కెచ్.. చరిత్రలో ఇదే మొదటిసారి కానుందా..?

by Nagaya |   ( Updated:2022-12-19 06:35:12.0  )
అసెంబ్లీ వేదికగా కేసీఆర్ భారీ స్కెచ్.. చరిత్రలో ఇదే మొదటిసారి కానుందా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ఇప్పటికే సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసి పనిలో నిమగ్నమైంది. ఇక సభలో ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై కొట్లాడతారా? లేక కేంద్రం టార్గెట్‌గా మాట్లాడుతారా..! అనేది అంతటా ఆసక్తికరంగా మారింది. గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణకు జరిగే అన్యాయంపై ఈసారి నిలదీయాలని ఇప్పటికే సర్కార్ కసరత్తు కూడా పూర్తి చేసింది. వారం రోజులు జరిగే సమావేశాల్లో కేంద్రం అన్యాయాలపైనే చర్చించాలని, వాటినే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రచార అస్త్రాలుగా చేసుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ భారీ స్కెచ్ వేసిందని విశ్వసనీయ సమాచారం. ఇక ఎమ్మెల్యేలైతే తమ సెగ్మెంట్లలోని సమస్యలపై జాబితాలు సిద్ధం చేసుకునే పనిలో తలమునకలయ్యారు. అసెంబ్లీ వేదికగా జరిగే సమావేశాల్లో ప్రజా సమస్యలు ప్రస్తావనకు వచ్చి పరిష్కారమవుతాయనే భావన అందరిలోనూ ఉంది. అందుకు భిన్నంగా ఈసారి అసెంబ్లీ సెషన్స్ జరిగేలా ఉంది. కేంద్రం టార్గెట్‌గానే సమావేశాలు నిర్వహించాలని టీఆర్ఎస్ సర్కార్ ఆలోచన చేసింది. అందుకు అనుగుణంగానే కార్యాచరణనూ రూపొందిస్తున్నది. ఇలా చేయడం అసెంబ్లీ చరిత్రలోనే ప్రథమం.

రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటుందనే..

కేంద్రం నుంచి 2022 -23 ఆర్థిక ఏడాదికి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో రూ.40 వేల కోట్లపైగా తగ్గిందని, ఇలాంటి చర్యలతో రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఎఫ్ఆర్ బీఎం పరిమితిని రూ.54 వేల కోట్లుగా కేంద్రం ప్రకటించిందని, దీనిని అనుసరించే రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించుకుందని పేర్కొంటున్నది. కేంద్రం అకస్మాత్తుగా ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని రూ.39 వేల కోట్లకు కుదించిందని, తద్వారా అందాల్సిన 15 వేల కోట్ల నిధులు తగ్గాయని స్పష్టం చేస్తున్నది. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తామంటేనే 0.5 శాతం రుణ పరిమితికి అనుమతిస్తామనే నిబంధనకు ఒప్పుకోకపోవడంతోనే కేంద్రం 6వేల కోట్లు, ఎఫ్ఆర్‌బీఎంతో 15వేల కోట్లు మొత్తం 21వేలకోట్లు, బడ్జెటేతర రూ.20 వేల కోట్లు ఇలా మొత్తంగా 40 వేలకోట్లుకు పైగా నిధులు ఆపేసిందని అసెంబ్లీలో ఎండగట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. అదేవిధంగా విభజన హామీలపై సైతం మరోసారి ప్రస్తావించే అవకాశం ఉన్నది. వారం రోజులపాటు ఏయే అంశాలపై సభను నిర్వహించాలనేదానిపై మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి నివేదికను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. కేంద్రం టార్గెట్‌గానే ప్రజల్లోకి వెళ్తే ఏ మేర కలిసి వస్తుందన్న దానిపైనా మంత్రుల నుంచి అభిప్రాయం తీసుకున్నట్లు తెలిసింది.

కేంద్రంపై డైవర్షన్ చేసి..

అసెంబ్లీ ఎన్నికలకు గడువు కొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను టీఆర్ఎస్ అధిష్టానం సిద్ధం చేస్తున్నది. ఓ వైపు సమస్యలు, మరోవైపు కేంద్రం అన్యాయాలపై పోరాటాలకు రెడీ అవుతున్నది. అసెంబ్లీలో చర్చించిన అంశాలతోపాటు రాష్ట్రంలో ప్రతిపక్షాల విమర్శలనూ తిప్పికొట్టేందుకు ప్రణాళికలను పార్టీ అధిష్టానం చేస్తున్నట్టు సమాచారం. అదే విధంగా తెలంగాణకు ముందు, ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని సైతం ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. తద్వారా ప్రజల్లోని వ్యతిరేకతను కేంద్రంపై డైవర్షన్ చేసి లబ్ధిపొందే ప్రయత్నాలను ప్రారంభించినట్లు స్పష్టమవుతున్నది.

తమ ఖాతాల్లో వేసుకునే ప్లాన్

సెగ్మెంట్‌లోని పెండింగ్ సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తే ప్రజలు సైతం వీక్షిస్తారని, తమపై మంచి అభిప్రాయం ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో అండగా ఉంటారని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇలా ప్రతి అంశాన్ని తమ ఖాతాల్లో వేసుకునే ప్లాన్‌లో నిమగ్నమయ్యారు. అయితే అసెంబ్లీ జరిగిన అన్నిరోజులు కేంద్రం తెలంగాణకు చేసే అన్యాయాలపై మాట్లాడితే పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్న తలెత్తుతుంది. మొత్తంగా సమస్యలను ప్రస్తావించకపోతే ప్రజల్లోనూ వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదని ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గంలోని సమస్యలపై తయారు చేసుకున్న ప్రశ్నలను అసెంబ్లీ సెక్రెటరీకి ఒకటి రెండ్రోజుల్లో ఇవ్వాలని పలువురు ఎమ్మెల్యేలు చూస్తున్నారు.

Also Read: బాసర ట్రిపుల్ ఐటీ‌లో మళ్లీ ఉద్రిక్తత

Advertisement

Next Story