సోలాపూర్‌లో కేసీఆర్ ‘షో’.. 600 కార్లతో సినీ స్టైల్‌లో ఎంట్రీ..!

by Satheesh |   ( Updated:2023-06-26 16:09:28.0  )
సోలాపూర్‌లో కేసీఆర్ ‘షో’.. 600 కార్లతో సినీ స్టైల్‌లో ఎంట్రీ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్రలోని సోలాపూర్‌లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హడావిడి చేశారు. రెండ్రోజుల పర్యటనకు సోమవారం ఉదయం ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. సాయంత్రం వరకు సోలాపూర్‌కు చేరుకున్నారు.

కాంగ్రెస్ మాజీ ఎంపీ ధర్మన్న సాధూల్ ఇంటికి కేసీఆర్ వెళ్లారు. పలు రాజకీయ అంశాలపై చర్చించారు. అదే విధంగా చేనేత కార్మికులతో మాటామంతి నిర్వహించారు. రాత్రి సోలాపూర్‌లోని హోటల్ బాలజీ సరోవర్‌లో బస చేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు సోలాపూర్‌ నుంచి పండరీపూర్ చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

పండరీపూర్‌లోని విఠోభారుక్మిణి మందిర్‌లో సీఎం కేసీఆర్‌‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత సోలాపూర్‌ జిల్లా సర్కోలి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనే ప్రముఖ నాయకుడు భగీరథ్‌ బాల్కే సహా పలువురు నేతలు కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి నుంచి ధారాశివ్‌ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హైదరాబాద్‌కు రోడ్డుమార్గాన బయల్దేరనున్నారు. సీఎం బస్సులో మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, సంతోష్ కుమార్, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు మహారాష్ట్ర నేతలు ఉన్నారు.

మరో బస్సులో మిగిలిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. కేసీఆర్ వెంట మంత్రులు కేటీఆర్ మల్లారెడ్డితో పాటు పువ్వాడ అజయ్ కుమార్ వెళ్లలేదు. ఉప్పల్‌లోని పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు స్కై వాక్ ప్రారంభోత్సవం నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి వెళ్లలేదు.

మంత్రి పువ్వాడ సచివాలయంలోని తన కార్యాలయంలో బిజీబిజీగా గడిపారు. మహారాష్ట్రకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ సీఎం సూచనల మేరకు పలు ఫైల్స్‌పై సంతకాలు చేశారు. రవాణా శాఖలో కొనసాగుతున్న సేవలు, నూతనంగా చేపట్టిన ఆన్లైన్ విధానం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి : మోడీ పాలనలో దేశం సురక్షితం: కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే

Advertisement

Next Story

Most Viewed