ఓడగొడితే నేను కూడా ఏమి చేయలేను: సీఎం KCR ఆసక్తికర వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-11-14 09:56:16.0  )
ఓడగొడితే నేను కూడా ఏమి చేయలేను: సీఎం KCR ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పుట్టింది తెలంగాణ కోసమని, తెలంగాణ ప్రజల కోసమేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అభ్యర్థులనే కాదు వారి పార్టీల చరిత్ర కూడా చూడాలని, అభ్యర్థుల గుణగణాలను ఓటర్లు చూడాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ పాలకుర్తిలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. 11 సార్లు చాన్స్ ఇస్తే.. కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందని విమర్శించారు.

50 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండే ఏమి చేసిందో ప్రజలకు తెలుసన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రైతుబంధు మాయమవుతుందని అన్నారు. 3 గంటల కరెంట్ చాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ గెలిస్తే 24 గంటల కరెంట్ ఉంటుందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో 30 లక్షల వ్యవసాయ మోటర్లు ఉన్నాయని, 10 హెచ్‌పీ మోటర్లు ఎవరు కొనిస్తారని ప్రశ్నించారు.

నా ప్రాణం అడ్డంపెట్టి తెలంగాణ తెచ్చిన

నా ప్రాణం అడ్డంపెట్టి తెలంగాణ తెచ్చినా కాబట్టి మీ బతుకులు చెడిపోవద్దు.. అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతులు బలపడాలని కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. భారత్‌లో ప్రతి రాష్ట్రంలో నీళ్లకు ట్యాక్స్ ఉందని, కానీ ట్యాక్స్ లేని ఓకే ఒక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రైతులకు కరెంటు ఫ్రీగా వస్తుందని, రైతుబంధు, రైతుబీమా వస్తుందని, ధాన్యం కూడా ప్రభుత్వమే కొంటుందని వెల్లడించారు.

ఈ సదుపాయాలన్ని ఏ రాష్ట్రంలో కూడా లేవని, ఈ సదుపాయాలన్ని మొత్తం వారు తీసివేస్తామని చెబుతున్నారని ఆరోపించారు. అందుకే ఆలోచించి ఓటు వేయాలని, ఓడగొట్టుకుంటే కేసీఆర్ సైతం ఏమీ చేయాలేడని పిలుపునిచ్చారు. ఇవన్ని కూడా వారు చాటుగా చెప్పడం లేదని, ఓపెన్‌గానే చెబుతున్నారని అన్నారు. ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామని వారు చెబుతున్నారని, ధరణి ఎందుకోసం పెట్టామో అందరూ ఆలోచన చేయాలని, ఈ విషయాలపై చర్చ చేయాలన్నారు.

గిరిజన బంధు తప్పక అమలు చేస్తాం..

తెలంగాణ రాక ముందు 50 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదన్నారు. నా కన్న దొడ్డుగున్నోళ్లు, నా కన్నా ఎత్తుగున్నోళ్లు చాలా మంది సీఎంలయ్యారు. కానీ కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదు.. అని విమర్శించారు. తండాల్లో గిరిజనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో సమస్యలు ఎదుర్కున్నారని, కానీ తెలంగాణలో గిరిజనులకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. గిరిజన బంధు ఇస్తామని చెప్పారని, తప్పకుండా గిరిజన బంధు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పేదలకు గ్రామానికి వంద ఇళ్లు మొదటి రెండెళ్లలో ఇస్తామని అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చెక్‌డ్యామ్ రావు అని పేరు పెట్టారని అన్నారు. ఎందుకంటే ఎన్నో చెక్‌డ్యామ్‌లు కట్టించారని హర్షంవ్యక్తంచేశారు.

Advertisement

Next Story