'నమస్తే తెలంగాణ' మాజీ ఎండీకి సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్?

by Sathputhe Rajesh |   ( Updated:2022-03-30 02:23:23.0  )
నమస్తే తెలంగాణ మాజీ ఎండీకి సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్?
X

ముచ్చింతల్ లో మొదలైన చిచ్చు రాజకీయంగా అనేక మలుపులు తిప్పుతున్నది. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న మైహోం రామేశ్వరరావు దూరం కావడం.. ఆయనకు బీజేపీ అసోం నుంచి రాజ్యసభకు అవకాశం కల్పిస్తుండటం కొత్త పరిణామాలకు దారి తీసింది. ఒకప్పటి నమస్తే తెలంగాణ ఎండీ సీఎల్ రాజం పేరు తాజాగా తెరపైకి వచ్చింది. యాదాద్రి ఆలయ పున: ప్రారంభోత్సవానికి ఆయన సతీసమేతంగా హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తగా పేరున్న రాజం టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ మెట్లెక్కనున్నారని తెలిసింది. కెప్టెన్ లక్ష్మీకాంతరావు పదవీకాలం జూన్ నెలతో ముగుస్తున్నందున ఆ స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తిగా లక్ష్మీరాజంను పంపడానికి దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: నమస్తే తెలంగాణ పత్రిక మాజీ ఎండీ సీఎల్ రాజంను రాజ్యసభకు పంపించాలని గులాబీ పార్టీ భావిస్తున్నది. త్వరలో పదవీకాలం పూర్తికానున్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్థానంలో ఆయనకు అవకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నది. ఒకే జిల్లా ఒకే సామాజికవర్గానికి చెందిన వ్యక్తితో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని టీఆర్ఎస్ భావిస్తున్నది. ఉద్యమ సమయంలో పత్రిక బాధ్యతలను భుజాన వేసుకుని నడిపించిన లక్ష్మీరాజంను రాజ్యసభకు పంపనున్నట్లు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత మారిన పరిస్థితులు, ఈక్వేషన్ల మార్పుతో అది సాకారం కాలేదు. ఇప్పుడు ఆయనను తెరమీదకు తెచ్చి రాజ్యసభ సభ్యుడ్ని చేయాలని సీఎం భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. టెక్నికల్‌‌గా ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నా రాజ్యసభకు మాత్రం టీఆర్ఎస్ తరఫునే వెళ్లే అవకాశం ఉన్నది. వ్యాపారవేత్తగా, కాంట్రాక్టరుగా, పారిశ్రామికవేత్తగా ఆర్థికంగా బలంగా ఉన్న సీఎల్ రాజం తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్‌కు అనేక రకాలుగా ఉపయోగపడ్డారు. టీఆర్ఎస్ కు కూడా ఆయన సేవలు బాగా లాభించాయి. తొలినాళ్లలో పార్టీకి ఆర్థికంగానూ రాజం దోహదపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కొంతకాలం ఆయన నేతృత్వంలో నమస్తే తెలంగాణ పత్రిక టీఆర్ఎస్ పార్టీకి దాదాపు అధికార పత్రికగానే నడిచింది. రాజ్యసభ సభ్యుడిని చేస్తానని స్వయంగా సీఎం కేసీఆర్ ఆయనకు హామీ ఇచ్చినా అది నెరవేరలేదు. ప్రభుత్వం తరఫున కాంట్రాక్టు పనులూ దక్కలేదు. ఇలాంటి అనేక కారణాలతో సీఎం కేసీఆర్‌తో ఆయనకు దూరం పెరిగింది. విధిలేని పరిస్థితుల్లో అప్పటి హోం మంత్రిగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు పదవీకాలం జూన్ నెలతో ముగుస్తున్నందున ఆ స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తిగా లక్ష్మీరాజంను పంపడానికి దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. లక్ష్మీరాజం దూరంగా ఉన్నంతకాలం 'మై హోమ్' రామేశ్వరరావు ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్నారు. ముచ్చింతల్ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ సందర్భంగా తలెత్తిన బేదాభిప్రాయాలతో రామేశ్వరరావుతోనూ గ్యాప్ పెరిగిందనే భావన టీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. దీంతో సీఎల్ రాజంను మళ్లీ దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి.

అందులో భాగంగానే వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ బాధ్యతలనూ రాజంకు అప్పజెప్పాలనుకుంటున్నట్లు సమాచారం. ఎలాగూ సీఎల్ రాజం కుటుంబానికి రాజన్న ఆలయం కులదైవంగా ఉన్నందున ఇప్పుడు ఆ బాధ్యతలను ఆయనకు అప్పజెప్పడం ఉపయుక్తంగా ఉంటుందన్న వాదనా తెరపైకి వచ్చింది. గతంలో వ్యక్తిగతంగానే ఆలయ, పట్టణ అభివృద్ధికి రాజం తన సొంత డబ్బుల్ని ఖర్చు చేశారు. వీటన్నింటి నేపథ్యంలో రాజంకు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వడం పలు రకాలుగా ఉపయోగపడుతుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. టీఆర్ఎస్‌కు దూరంగా ఉన్న సమయంలోనే కొద్దికాలం దినపత్రిను నడిపినా ఎక్కువకాలం దాన్ని కొనసాగించలేకపోయారు. రాష్ట్రంలో కాంట్రాక్టులు దక్కకపోవడంతో బీజేపీకి దగ్గరై మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అవకాశాలను వెతుక్కున్నారు.

బీజేపీతో రాజకీయంగా యుద్ధానికి సిద్ధమైన పరిస్థితుల్లో సీఎల్ రాజంను కేసీఆర్ మళ్లీ దగ్గరకు తీయాలనుకోవడం వెనక ఇతర ప్రయోజనాలూ ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటు బీజేపీ, అటు టీఆర్ఎస్ పార్టీలకు సమదూరంలో ఉండడం ద్వారా భవిష్యత్తులో సంధానకర్తగా ఉపయోగపడవచ్చనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, రాజ్‌నాథ్​ సింగ్ సహా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, చత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్‌సింగ్ లాంటి చాలా మంది నేతలతో రాజంకు దగ్గరి సంబంధాలే ఉన్నాయి. రాజ్యసభకు పంపడం ద్వారా పలు రకాల రాజకీయ ప్రయోజనాలుంటాయన్నది టీఆర్ఎస్ నేతల అభిప్రాయం. త్వరలో ఈసీ నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో లక్ష్మీరాజం పేరు పార్టీలో చర్చకు రావడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed