బిగ్ న్యూస్: BRS ఎంపీలకు ‘సర్వే’ టెన్షన్.. నేతల పూర్తి వివరాలు సేకరిస్తోన్న KCR!

by Satheesh |
బిగ్ న్యూస్: BRS ఎంపీలకు ‘సర్వే’ టెన్షన్.. నేతల పూర్తి వివరాలు సేకరిస్తోన్న KCR!
X

అధిష్టానం చేస్తున్న సర్వే బీఆర్ఎస్ ఎంపీల్లో టెన్షన్ పుట్టిస్తున్నది. పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తుండడం వారిని ఆందోళనలో పడేస్తున్నది. ఇప్పటికే గులాబీ బాస్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఎంపీల పనితీరుపై ఆరా తీస్తున్నారు. అయితే ఈ సర్వేలో తమపై నెగెటివ్ వస్తే భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళన వారిలో కనిపిస్తున్నది. పనితీరు ఆధారంగానే మళ్లీ అవకాశమిస్తామని ఇప్పటికే కేసీఆర్ స్పష్టం చేయడంతో వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్టు దక్కుతుందో.. ఎవరికి మొండి చేయి చూపుతారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంపీల పనితీరుపై బీఆర్ఎస్ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివరాలను సేకరిస్తున్నది. ఎంపీ నిధులు ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నారు? ఏ అభివృద్ధి పనులకు ఉపయోగిస్తున్నారు? పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలేమిటి? వంటి వాటితో డిటెయిల్డ్ రిపోర్ట్ తయారు చేస్తున్నది. అంతేకాకుండా ఢిల్లీలోనూ వారి పనితీరు, పార్లమెంట్ సమావేశాల్లో అనుసరిస్తున్న విధానంపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఎంపీలు ఎవరెవరిని కలుస్తున్నారు? వారిని కలవడానికి ఎవరొస్తున్నారు? వంటి సమాచారాన్ని సైతం తెలుసుకుంటున్నట్లు సమాచారం.

అంతేకాకుండా పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో ఏమైనా బేధాభిప్రాయాలు ఉన్నాయా? శాసనసభ్యులతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా? అని కూడా తెలుసుకుంటున్నది. ఆయా సామాజిక వర్గాలపై ఎంపీల ప్రభావం ఏ మేరకు ఉంటుందనే వివరాలను కూడా సేకరిస్తున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఏమేరకు పనికొస్తారనే అంచనా వేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా సర్వేలో వచ్చిన రిపోర్ట్ ఆధారంగానే మళ్లీ ఎంపీ టికెట్టు కేటాయించాలా? వద్దా?.. లేకుంటే అసెంబ్లీకి పంపాలా? లేదా అసెంబ్లీలకు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించాలా? అనే నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు.

పనితీరుపై ఎంపీల్లో గుబులు

కొంత మంది ఎంపీలు తమ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు. స్థానికంగా ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ వాటి పరిష్కారంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. పనితీరును మెరుగుపర్చుకోవాలని ఇప్పటికే అధినేత ఆదేశించినప్పటికీ కొంతమందిలో మార్పు రాలేదు. దీంతో అలాంటి ఎంపీలు ఎక్కువ టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తున్నది. అయితే పనితీరు ఆధారంగానే కేసీఆర్ టికెట్లు కేటాయిస్తే ఎంతమందికి మళ్లీ ఎంపీగా పోటీ చేసే అవకాశం వస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Next Story

Most Viewed