- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR జాతీయ రాజకీయాలకు బ్రేక్.. గులాబీ బాస్ ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం..?
దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంటు ప్రత్యేక సెషన్‌లో జమిలి ఎన్నికల బిల్లు వస్తుందనే విషయంపై దాదాపుగా క్లారిటీకి వచ్చింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటుతో ఈ సెషన్‌లోనే వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లు చర్చకు రానున్నట్లు తెలుస్తున్నది.
జమిలి ఎన్నికలు అనివార్యమైతే ఇతర రాష్ట్రాల్లో లోక్‌సభకు అభ్యర్థుల్ని నిలబెట్టడమెలా అనేది బీఆర్ఎస్‌లో చర్చకు దారితీసింది. మహారాష్ట్ర సహా పలు ఇతర రాష్ట్రాల్లో బరిలో నిలిచి తగినంత ఓటు బ్యాంకు సంపాదించి జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలన్న కేసీఆర్ ఆశలపై జమిలి ఎన్నికలు నీళ్లు చల్లినట్లయింది.
అసెంబ్లీ ఎన్నికల కారణంగా తెలంగాణలోనే పూర్తిస్థాయిలో కేంద్రీకరించాల్సిన పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో క్యాంపెయిన్‌కు కేసీఆర్‌కు అవకాశం లేకుండా పోతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం డిసెంబర్‌లో పూర్తయితే వచ్చే ఏడాదిలో జరిగే లోక్‌సభ ఎన్నికలపై కంప్లీట్ ఫోకస్ పెట్టొచ్చని కేసీఆర్ భావించారు.
తెలంగాణ అసెంబ్లీ, ఇతర రాష్ట్రాల్లోని లోక్‌సభ ఎన్నికల మీద వేర్వేరుగా దృష్టి పెట్టొచ్చని అనుకున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగితే కేసీఆర్ క్యాంపెయిన్ షెడ్యూల్‌లో పరిమితులు ఏర్పడక తప్పదు. తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సృష్టించాలని భావించడంతో ఇక్కడే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. దీంతో మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో తిరగడానికి వీలుండకపోవచ్చు.
జాతీయ రాజకీయాలకు బ్రేక్..?
తెలంగాణలో యాంటీ ఇన్‌కంబెన్సీ ప్రభావంతో అనివార్యంగా ప్రచారంలోకి దూకక తప్పేలా లేదు. కాంగ్రెస్ బలపడుతున్నదని ప్రజల్లో ఓపెన్ టాక్ వినిపిస్తున్న సమయంలో మరింతగా ఫోకస్ పెట్టాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో తెలంగాణను వదిలేసి మహారాష్ట్ర లాంటి ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లడానికి జమిలి రూపంలో కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించినట్లయింది. తెలంగాణ మోడల్‌ను ఇతర రాష్ట్రాల్లో పాపులర్ చేయాలనుకున్న ప్లానింగ్‌కు బ్రేకులు పడ్డాయి. ఇకపైన కేసీఆర్ తన ప్లానింగ్‌లో ఎలాంటి మార్పులు చేస్తారన్నది పార్టీ నేతల్లో ఆసక్తికరంగా మారింది.
జమిలి ఎన్నికలు అమల్లోకి వస్తే ఇకపైన జాతీయ పార్టీగా గుర్తింపు పొందేలా పోలింగ్ పర్సంటేజీని తెచ్చుకోవాలంటే తెలంగాణలో పార్టీ కార్యకలాపాల బాధ్యతలను కుమారుడికి అప్పగించి కేసీఆర్ ఇకపైన పూర్తిస్థాయిలో జాతీయ స్థాయి బాధ్యతల్లోకి వెళ్లాల్సి ఉంటుందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. జమిలి ఎన్నికలైతే ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలపై ఫోకస్ పెట్టాలంటే స్పష్టమైన ప్లానింగ్, వర్క్ డివిజన్ తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి.
మహారాష్ట్ర, ఏపీ సంగతేంటి..?
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మార్చడం వెనక ఉద్దేశం జాతీయ పార్టీగా ఆవిర్భవించాలన్నదే. ఇందుకోసమే కాంగ్రెస్, బీజేపీలు బలహీనంగా ఉండి ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న మహారాష్ట్రను తొలి ప్రయోగశాలగా మార్చుకున్నారు. ఆ రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల లీడర్లను, కేడర్‌ను చేర్చుకున్నారు. ఎక్కువగా ఆ రాష్ట్రంలో బలంగా ఉన్న ఎన్సీపీ నుంచి చేరికలపై దృష్టి పెట్టారు. అక్కడ జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు.
పార్టీ సభ్యత్వాన్ని పెంచుకోవడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పార్టీ ఆఫీసులనూ నెలకొల్పారు. లోక్‌సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ స్థాయిలో సీట్లు వస్తాయంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఫుల్ టైమ్ ఆ స్టేట్ మీద ఫోకస్ పెట్టి ఎంపీ సీట్లను గెల్చుకోవడంతో పాటు పోలింగ్ పర్సంటేజీని పెంచుకోవాలని అనుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు స్టేట్ ఆఫీస్‌ను కూడా నెలకొల్పారు. ఒడిశాలోనూ పార్టీని విస్తరింపజేయాలన్న లక్ష్యంతో ఆ రాష్ట్ర మాజీ సీఎం గిరిధర్ గమాంగోతో పాటు ఆయన కుటుంబ సభ్యులను, కొద్దిమందిని చేర్చుకున్నారు. ఎంపీ ఎన్నికల నాటికి అక్కడ కూడా కొంత ఓట్ల శాతాన్ని పొందాలని భావించారు. అయితే జాతీయ పార్టీగా నిలదొక్కుకోవాలని వేసుకున్న ఆలోచనలకు ‘జమిలి’ బ్రేక్ వేసినట్లయింది.