రైతులకు కేసీఆర్ భారీ శుభవార్త.. తడిసిన ధాన్యంపై సీఎం కీలక ప్రకటన

by Satheesh |
రైతులకు కేసీఆర్ భారీ శుభవార్త.. తడిసిన ధాన్యంపై సీఎం కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: వర్షానికి ధాన్యం తడిసిన రైతన్నలు ఎలాంటి ఆందోళన చెందొద్దని.. గింజలేకుండా కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు. తడిసిన ధాన్యానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తుందని స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని కాపాడుతూ రైతుల కష్టాల్లో భాగస్వామ్యం పంచుకోవడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. అకాల వర్షాల నేపథ్యంలో వరికోతలను మరో మూడు నాలుగు రోజులు వాయిదా వేసుకోవాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తీరు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన వరిధాన్యం సేకరణ, భవిష్యత్తులో యాసంగి వరి ముందస్తుగా కోతలకు వచ్చేలా చర్యలు, ఇందుకు వ్యవసాయశాఖ అనుసరించాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వడగండ్ల వానలకు దెబ్బతిన్న పంటలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 10 వేల రూపాయలను అందిస్తూ ఇప్పటికే ఆదుకుంటున్నదన్నారు. ప్రతి ఏటా మార్చినెలాఖరుకల్లా యాసంగి వరికోతలు పూర్తయ్యేలా రాష్ట్ర రైతాంగం వరిని ముందస్తుగానే నాటుకోవాలని పిలుపు నిచ్చారు. శాస్త్రీయ అధ్యయనం చేసి రాష్ట్ర రైతాంగాన్ని చైతన్యపరచాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు, మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో తలెత్తే మార్పులను ఎప్పటికప్పుడు రైతాంగానికి అర్థమయ్యే రీతిలో కరపత్రాలు, పోస్టర్లు, అడ్వర్ టైజ్ మెంట్లు తదితర ప్రచార మార్గాల ద్వారా అవగాహనను, చైతన్యాన్ని కల్పించాలన్నారు.

రాష్ట్రంలో నిర్మించిన రైతు వేదికలను వేదికగా చేసుకుని వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని స్పష్టం చేశారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, బాజిరెడ్డి గోవర్ధన్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం సెక్రటరీలు స్మితా సభర్వాల్, రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సివిల్ సప్లైస్ కమిషనర్ వి. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed