ప్రజల అసంతృప్తిపై కేసీఆర్ సర్వే.. వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏంటీ..!

by Nagaya |   ( Updated:2022-12-14 02:40:32.0  )
ప్రజల అసంతృప్తిపై కేసీఆర్ సర్వే.. వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏంటీ..!
X

అంతా సీక్రెట్

ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది..? మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా? మీ ఇంట్లో ఎంతమంది ఓటర్లున్నారు..? అందరూ స్థానికంగానే ఉంటున్నారా.? వేరే సెగ్మెంట్ కు ఏమైనా షిఫ్ట్ అయ్యారా..? కొత్త ఓటర్లు ఎవరైనా జాబితాలో చేరారా..? సర్కారు పథకాల్లో మీకు ఏమేరకు లబ్ధి చేకూరింది..? సుమారు ఎంత మేరకు ఆర్థిక సాయం అందింది.. అంటూ ఆశ, అంగన్ వాడీ వర్కర్లు ఆరా తీస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి పథకాలు అమలు చేస్తే బాగుంటుందో అనే విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టో కోసమే ఈ సర్వే చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. ప్రజల్లో అసంతృప్తిని పసిగట్టేందుకు నిర్వహిస్తున్న ఈ సర్వేకు అంగన్ వాడీ, ఆశ వర్కర్లును వినియోగిస్తుండటం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉన్నదనే అంశంపై అధ్యయనం చేయిస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే సర్వే మొదలైంది. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో చేపట్టేందుకు సర్కారు రెడీ అయ్యింది. ఉన్నతాధికారులు వంద ఇండ్లకు ఒక్కరికి బాధ్యతను అప్పగించారు. నిర్దిష్టమైన ప్రశ్నావళి ప్రకారం గుట్టుచప్పుడు కాకుండా ఈ సర్వే జరుగుతున్నది.

ఇండ్లకు వెళ్తున్న సిబ్బంది ఫ్యామిలీలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు, పాత జాబితాలో ఉన్నవారు కంటిన్యూ అవుతున్నారా? ఎక్కడికైనా నివాసం మార్చారా? కొత్తగా ఓటర్లు చేరారా? ఇంట్లో ఎంత మందికి ఎలాంటి పథకాలు అందుతున్నాయి..? సుమారు ఎంత మొత్తంలో వాటి ద్వారా ఆర్థిక సాయం అందుతున్నది.. అనే వివరాలను సేకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఫార్మాట్ పత్రంలో వివరాలను ఎంటర్ చేస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, ఆసరా పింఛన్లు, ఎస్సీ-ఎస్టీ ప్రైడ్ స్కీమ్, ఓవర్సీస్ స్కాలర్‌షిప్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ, డబుల్ బెడ్‌రూమ్, రుణమాఫీ, ఉచిత వ్యవసాయ విద్యుత్, కరెంటు సబ్సిడీ... ఇలా ఏయే పథకాల ద్వారా ఆ కుటుంబం లబ్ధిపొందుతున్నది..? అందులో ఎంత మందికి ప్రయోజనం కలిగింది.. తదితర వివరాలన్నింటినీ నమోదు చేసుకుంటున్నారు. ఇదే ప్రశ్నావళిలో రానున్న కాలంలో ఎలాంటి పథకాలు ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఇకపైన ఏం ఆశిస్తున్నారు, అలాంటి సాయం ఏ రూపంలో ఉండాలనుకుంటున్నారు? అనే అంశాలపైనా వారి ఆశలు, ఆకాంక్షలను సేకరిస్తున్నారు.

ఉచిత ఎరువుల స్కీమ్ పై గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ అమలులోకి రాలేదు. ఇప్పుడు అలాంటి ఉచిత స్కీమ్‌ల లాంటివి కావాలని కోరుకుంటున్నారా? అనే కొన్ని ఉదాహరణలను సైతం ప్రస్తావిస్తున్నారు. నిరుద్యోగ భృతి లాంటి స్కీమ్‌లను ప్రకటించినా వాటి ఫలాలు అందకపోవడంపై వారిలో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకతను కూడా నమోదు చేసుకుంటున్నారు. నాలుగు రోజుల్లోనే ఆ ఫీడ్‌బ్యాక్‌ ప్రక్రియను పూర్తిచేసి మండల స్థాయి అధికారికి అప్పగించేలా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే సర్వే పూర్తవగా.. మరికొన్ని చోట్ల నడుస్తున్నది. అయితే సర్వే చేస్తున్న సిబ్బంది మాత్రం విషయాన్ని బయటికి చెప్పడానికి నిరాకరిస్తున్నారు. రాష్ట్రంలో ఒక్క గ్రామాన్ని కూడా విడిచిపెట్టకుండా మొత్తం అన్ని ఇండ్లనూ కవర్ చేసేలా ప్రోగ్రామ్‌కు రూపకల్పన జరిగింది.

మునుగోడు ఎన్నికల ఫలితాల విశ్లేషణ తర్వాత బీఆర్ఎస్ ఈ ప్రక్రియను మొదలుపెట్టింది. ఓటర్లలో ఉన్న అభిప్రాయానికి అనుగుణంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వారి మనసును గెల్చుకోడానికి, మరోసారి అధికారంలోకి రావడానికి వీలుగా ఈ సర్వేలోని అంశాలను ప్రామాణికంగా తీసుకోనున్నది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని హామీలను ఇవ్వడానికి, ఎన్నికల ప్రచారం సందర్భంగా బహిరంగసభల్లో వీటితో పాటు మరికొన్ని వాగ్ధానాలను గుప్పించడానికి నాందిగా ఈ సర్వే ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. ఒకవైపు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన సమయంలో సొంత రాష్ట్రంలో గతం కన్నా పార్టీ ప్రతిష్ట దిగజారకుండా ముందుజాగ్రత్తగా ఈ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి సహా మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి నిరసన సెగ తగులుతున్న పరిస్థితుల్లో దిద్దుబాటు చర్యలకు టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని జిల్లాల్లోనూ ఈ సర్వేను పూర్తిచేసి దానికి తగినట్లుగా మంత్రులకు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, పార్టీ లీడర్లకు, కేడర్‌కు ఈ వివరాలను అందించి అనుగుణమైన కార్యాచరణపై అధిష్టానం క్లారిటీ ఇచ్చే అవకాశమున్నది.

సిట్టింగులందరికీ టికెట్లు హుళక్కేనా?

సిట్టింగ్‌ సభ్యులందరికీ ఈసారి టికెట్లు ఇస్తానని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. కానీ ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నవారి విషయంలో పార్టీ భిన్నంగా ఆలోచించే అవకాశమున్నది. ఇలాంటి స్థానాల్లో అభ్యర్థులను మార్చకపోతే పార్టీకి ఇబ్బందేనంటూ కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే వినోద్ కుమార్ కొన్ని సందర్భాల్లో నర్మగర్భంగా ప్రకటించారు. తాజా సర్వేలో వచ్చే అభిప్రాయాలను విశ్లేషించిన తర్వాత స్థానిక ఎమ్మెల్యేలపై ఉండే వ్యతిరేకతకు అనుగుణంగా కేసీఆర్ ఆల్టర్నేట్ ఆలోచన చేసే అవకాశమున్నది. ఇలాంటి పరిణామాన్ని ముందుగానే ఊహించిన కేసీఆర్ సంక్షేమ పథకాల అమలు బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పజెప్పి వేగవంతం చేయాలని నిర్దేశించారు. నెల రోజుల వ్యవధిలో అన్ని జిల్లాల నుంచి వచ్చే వివరాల తర్వాత మరింత క్లారిటీ రానున్నది.

Read More...

Telangana Congress పై అధిష్టానం ఆరా..

Advertisement

Next Story

Most Viewed