Saichand: మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-29 06:40:00.0  )
Saichand:  మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ అకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం పట్ల సీఎం సంతాపాన్ని ప్రకటించారు. ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం అన్నారు.

సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని కళాకారున్ని కోల్పోయిందన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అన్నారు. మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని సీఎం విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుందని సీఎం తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో సాయిచంద్ పాడిన పాటలను చేసిన సాంస్కృతిక ఉద్యమాన్ని సీఎం స్మరించుకున్నారు. సాయిచంద్ లేకుండా తన సభలు సాగేవి కావని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు తన ఆట పాటలను నిరంతరాయం కొనసాగిస్తూనే వున్నాడని గుర్తు చేసుకున్నారు.

తన ఆట పాటతో ప్రజలలో నాడు ఉద్యమ స్పూర్తిని నేడు అభివృద్ధి చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ బిడ్డని కోల్పోవడం తీరని లోటని సీఎం అన్నారు. శోకతప్త హృదయులైన సాయిచంద్ కుటుంబ సభ్యులు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే శక్తినివ్వాలని భగవంతున్ని ప్రార్థించారు. వారి కుటుంబానికి తాము అండగా ఉంటామన్నారు. వారి కుటుంబ సభ్యలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed