సీఎం రేవంత్ అధ్యక్షతన రేపు సీఎల్పీ మీటింగ్.. ఆ అంశంపైనే కీలక చర్చ!

by Shiva |   ( Updated:2024-09-21 12:35:29.0  )
సీఎం రేవంత్ అధ్యక్షతన రేపు సీఎల్పీ మీటింగ్.. ఆ అంశంపైనే కీలక చర్చ!
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తున్న వేళ కాంగ్రెస్ (Congress) గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన రేపు కాంగ్రెస్‌ శాసన సభాపక్షం సమావేశం కానుంది. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీతో పాటు ఏఐసీసీ నుంచి వచ్చిన బాధ్యులు విశ్వనాథ్, విష్ణునాథ్‌, కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతోన్న సంక్షేమ పథకాల (Welfare schemes) అమలు తీరును సమీక్షించనున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బూత్ లెవల్ (Booth Level) నుంచి బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన విధి విధానాలపై వారు చర్చించనున్నారు.

ఇక మండల స్థాయి నుంచి కొత్త కమిటీలను నియమించడం స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించుకోవడం, ప్రభుత్వ పథకాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడం, వివిధ స్థాయిల్లో పార్టీ ముఖ్య నాయకుల మధ్య సమన్వయం నెలకొల్పే విషయాలు చర్చకు రానున్నాయి. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కొత్త కమిటీ ఏర్పాటు, పార్టీ బాధ్యతతో పాటు అభ్యర్థితం ఖరారుపై ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు బాధ్యతలను అప్పగించనున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో జెడ్పీ చైర్మన్ (ZP Chairman), జెడ్పీటీసీలు (ZPTC), ఎంపీపీలు (MPP), ఎంపీటీసీలు (MPTC), సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు గెలిచేలా యాక్షన్ ప్లాన్‌ను రూపొందించే విషయం సమావేశంలో చర్చించనున్నట్లుగా సమాచారం.

Advertisement

Next Story