కేంద్రం రూల్ మేరకే కొంటాం.. ధాన్యంపై సివిల్ సప్లైస్ కమిషన్ మెలిక

by samatah |
కేంద్రం రూల్ మేరకే కొంటాం.. ధాన్యంపై సివిల్ సప్లైస్ కమిషన్ మెలిక
X

అప్పుడు అలా..!

‘‘అకాల వర్షాలతో రైతన్నలు ఎలాంటి ఆందోళన చెందొద్దు. తడిసిన ధాన్యాన్ని గింజ లేకుండా కొంటాం. మామూలు వరి ధాన్యానికి చెల్లించిన ధరనే తడిసిన ధాన్యానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. వ్యవసాయాన్ని కాపాడుతూ రైతుల కష్టాల్లో భాగస్వామ్యం పంచుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యం’’.. అని ఈ నెల 2న సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీ.

ఇప్పుడు ఇలా..!

‘‘ధాన్యంలో 17శాతానికి పైగా తేమ ఉంటే కొనుగోలు చేయాలంటే.. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. కేంద్రం రూల్స్ ప్రకారం తేమ 17 శాతం లోపు ఉంటే వెంటనే కొంటాం. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు సెంటర్లకు తీసుకురావాలి. అందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం’’.. అని సివిల్ సప్లై వీసీ, ఎండీ వి.అనిల్ కుమార్ శుక్రవారం స్పష్టంచేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. కాగా.. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. అయినా.. తేమశాతం మాత్రం పూర్తిస్థాయిలో తగ్గడం లేదు. దీనిపై ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తేమశాతాన్ని 17 నుంచి 20 వరకు సడలించాలని ఎఫ్ సీఐకి విజ్ఞప్తి చేశామని చెప్పారు. మిల్లర్లతోనూ మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెడితే తేమశాతం 20 వరకు వస్తే దానిని కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపించాలని ఆదేశించారు. అయినా.. నేడు 17 శాతం లోపు తేమ ఉంటే వెంటనే ధాన్యం కొనుగోలు చేస్తామని, లేదంటే చేయమని సివిల్ సప్లై అధికారులు స్పష్టంచేస్తున్నారు. ఎందుకంటే.. ధాన్యంలో 17 శాతంపైగా తేమ ఉంటే కొనుగోలు చేయడానికి కేంద్రం నిబంధనలు అడ్డుగా ఉన్నాయని అంటున్నారు. లేదంటే కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామనే అధికారుల స్టేట్ మెంట్.. తప్పు మాది కాదు కేంద్రానిది అన్న తీరుతో వ్యవహరిస్తున్నారు.

ధాన్యంలో 17 శాతానికి పైగా తేమ ఉంటే కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు అడ్డుగా ఉన్నాయని సివిల్ సప్లై కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ అనిల్ కుమార్ స్పష్టం చేశారు. ధాన్యం సేకరణలో రైతులు ఆందోళనలపై వస్తున్న కథనాలకు శుక్రవారం ఒక ప్రకటనలో స్పందించారు.

ఎలాంటి జాప్యానికి ఆస్కారం లేకుండా యాసంగి సిజన్‌లో రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం రైతులకు అందుబాటులో ఉండే విధంగా రాష్ట్రవ్యాప్తంగా 7,175 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే 7.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా కొనుగోలు చేశామన్నారు. ఈ యాడాది గురువారం వరకు 19.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. 3.40 లక్షల మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం 17 శాతం లోపు ఉంటే తక్షణమే కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. 19.62 లక్షల మెట్రిక్ టన్నులకు గానూ 18.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడం జరిగిందన్నారు. రైతులు కేంద్ర ప్రభుత్వ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నామని స్పష్టంచేశారు.

Advertisement

Next Story

Most Viewed