ఘనంగా దశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు

by Mahesh |
ఘనంగా దశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు
X

దిశ , తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తేదీ నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు ఈ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచిన తొమ్మిదేళ్లలో ప్రతి శాఖ సాధించిన విజయాలను ప్రతిబింబించేలా తగు ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులకు సూచించారు. తొమ్మిదేళ్లలో వాస్తవాలు, గణాంకాలు, సాధించిన విజయాలను వివరించే డాక్యుమెంటరీలను రాష్ట్ర స్థాయిలో ప్రతి శాఖ తయారు చేయాలని, ముఖ్యమైన పబ్లిక్ స్మారక చిహ్నాలు, భవనాలపై విద్యుత్ అలంకరణ చేయాలని ఆమె పేర్కొన్నారు.

రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలతోపాటు జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో కూడా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ ఉత్సవాలు సజావుగా నిర్వహించేందుకు పలు సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, జీఏడీ సెక్రటరీ శేషాద్రి, ఆర్థికశాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కార్యదర్శి నిర్మల, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ కె. అశోక్‌రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌ బి. రాజమౌళి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ ఎం. హరికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story