కానిస్టేబుళ్లు నిబద్ధతతో పని చేయాలి: RTC చైర్మన్ బాజిరెడ్డి

by GSrikanth |
కానిస్టేబుళ్లు నిబద్ధతతో పని చేయాలి: RTC చైర్మన్ బాజిరెడ్డి
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్ ఆర్టీసీ కానిస్టేబుళ్లు నిబద్ధతతో పనిచేయాలని ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. కొత్తగా విధుల్లో చేరబోతున్న కానిస్టేబుళ్లకు అభినందనలు చెబుతూనే సంస్థలోని యాభైవేల మంది సిబ్బంది, బస్సులను కాపాడాల్సిన గురుతర బాధ్యత మీపై ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్​కొండాపూర్‌లో ఆదివారం టీఎస్​ఆర్టీసీకి చెందిన 166 మంది కానిస్టేబుళ్ల శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన గోవర్ధన్, విశిష్ట అతిధిగా హాజరైన సంస్థ ఎండీ సజ్జనార్​కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గోవర్ధన్​మాట్లాడుతూ.. టీఎస్​ఆర్టీసీ కానిస్టేబుల్​ఉద్యోగం అంత సులభమైంది కాదన్నారు. విధుల నిర్వర్తనలో ఏ చిన్న తప్పు జరిగినా చర్యలు తప్పవని చెప్పారు.

ఆర్టీసీకి మీరు కండ్లు, చెవుల్లాంటి వారని చెబుతూ మున్ముందు ఆర్టీసీ లాభాల బాట పట్టేట్లు చూడాలన్నారు. ప్రజలకు సంస్థను మరింత చేరువగా తీసుకురావటానికి ఏడాదిగా కొత్త కొత్త కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. సంస్థ ఎండీ సజ్జనార్​మాట్లాడుతూ.. కొత్తగా 166 మంది కానిస్టేబుళ్లు ఆర్టీసీలో చేరుతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 57మంది మహిళలు ఉండటం శుభ పరిణామమని చెప్పారు. ఈ కొత్త రక్తంతో సంస్థ మరింతగా అభివృద్ధి పథంలోకి దూసుకెళుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. శిక్షణలో మాదిరిగానే విధులను నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు. 2014 నుంచి ఇప్పటివరకు సంస్థలో కారుణ్య నియామకాల కింద 1,606మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు చెప్పారు.

సంస్థలో కానిస్టేబుళ్లది కీలకమైన పాత్ర అని చెప్పిన సజ్జనార్​చిత్తశుద్ధితో పనిచేసి సంస్థ అభ్యున్నతికి పాటుపడాలన్నారు. సంస్థ అభివృద్ధి కోసం యాభైవేల మంది సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పిన ఆయన అందులో మీరు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఒక్క నెలలోనే కానిస్టేబుళ్లకు సమర్థవంతమైన శిక్షణ ఇచ్చిన అదనపు డీజీపీ స్వాతిలక్రా, కొండాపూర్​8వ బెటాలియన్​కమాండెంట్​మురళీకృష్ణకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సృజన్​(బెస్ట్​ఆల్​రౌండర్), రమాదేవి (బెస్ట్​ఇండోర్), పూజిత, సాయికిరణ్​(బెస్ట్​ఔట్​డోర్)లకు ట్రోఫీలను అందచేశారు. కార్యక్రమంలో టీఎస్​ఆర్టీసీ జాయింట్​డైరెక్టర్​డాక్టర్​సంగ్రామ్​సింగ్​జీ పాటిల్, సీపీఎం కృష్ణకాంత్, 8వ బెటాలియన్​కమాండెంట్​మురళీకృష్ణ, అదనపు కమిషనర్లు గంగారాం, నరేందర్​సింగ్​తదితరులు పాల్గొన్నారు.

కారుణ్య నియామకాల ద్వారా...

కానిస్టేబుళ్లుగా శిక్షణ పూర్తి చేసుకున్న166 మంది కారుణ్య నియామకాల ద్వారా సంస్థలో చేరారు. వీరిలో 107మంది పురుషులు, 57మంది మహిళలు ఉన్నారు. శిక్షణ ముగింపు కార్యక్రమంలో కానిస్టేబుళ్లు ప్రదర్శించిన విన్యాసాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed