- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ సర్కార్ ప్రపోజల్‌కు కేంద్రం ఆమోదం
దిశ, తెలంగాణ బ్యూరో: టెంపుల్ టూరిజం, ఆలయాల అభివృద్ధి కోసం కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ‘ప్రసాద్’ పథకం కింద తెలంగాణలోని ప్రముఖ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం వేములవాడ ఎంపికైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో తీర్ధయాత్ర పునరుజ్జీవనం, స్పిరిచువ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీం కింద టెంపుల్ టూరిజం మరింత పుంజుకోనుంది. ఇప్పటికే 3 ఆలయాలను కేంద్రం ఈ పథకం కింద ఎంపిక చేసింది. నిధులు మంజూరు సైతం కావడంతో పనులు కొనసాగుతున్నాయి. తాజాగా వేములవాడ సైతం ప్రసాద్ స్కీం కింద ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. దీంతో కేంద్రం నేరుగా కలెక్టర్ల అకౌంటర్లలో డబ్బులు జమ చేయడంతో ఆ నిధులను అభివృద్ధి పనులకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు రాష్ట్రంలోని మరిన్ని ఆలయాల అభివృద్ధికి ‘ప్రసాద్’ స్కీం కింద ప్రతిపాదనలు పంపుతున్నట్లు సమాచారం.
రామప్ప, జోగులాంబ, భద్రాచలం..
రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన హెరిటేజ్ కట్టడం, రామప్పలోని రామలింగేశ్వరాలయం, ఆలంపూర్‌లోని జోగులాంబ, భద్రాచలం టెంపుల్స్‌ను కేంద్రం ఇప్పటికే ప్రసాద్ కింద ఎంపిక చేసింది. భద్రాచలం అభివృద్ధికి రూ.61కోట్లు ప్రతిపాదనలు పంపగా కేంద్రం రూ.41.38 కోట్లు విడుదల చేసింది. ఇక జోగులాంబకు రూ.80 కోట్ల ప్రతిపాదనలు పంపగా, రూ.36.73 కోట్లు, ములుగు రుద్రేశ్వర(రామప్ప) ఆలయంలో తీర్ధయాత్ర, వారసత్వ పర్యాటక మౌలిక సదుపాయల అభివృద్ధికి రూ.62 కోట్లను రిలీజ్ చేసింది. తాజాగా ప్రసాద్ పథకం కింద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ శ్రీరాజ రాజేశ్వరస్వామి ఆలయానికి ప్రతిపాదనలు పంపగా.. కేంద్రం ఆమోదం తెలపడంతో త్వరలోనే నిధులు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ నిధులతో 100 గదుల సామర్థ్యం గల అతిథి గృహం, అన్నప్రసాద భవనం, క్యూ కాంప్లెక్స్‌లను అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ బృందం సైతం ఆలయాన్ని సందర్శించి 3 ప్రదేశాలను పరిశీలించింది. కేంద్రానికి నివేదిక అందజేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
టూరిజం అభివృద్ధి, ఉపాధి కల్పన
ప్రసాద్ స్కీం కింద పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి, సంస్కృతి, హస్తకళలు, వంటకాలు మొదలైన వాటిని ప్రోత్సహించడం, పుణ్య క్షేత్రాల్లో ప్రపంచస్థాయి మౌలిక సదుయాల అభివృద్ధి ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రసాద్ కింద కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సాయం అందిస్తుంది. 100 శాతం ఖర్చులను కేంద్రమే భర్తిస్తుంది. అలాగే నిరంతర నిర్వహణకు పబ్లిక్- ప్రైవేట్ భాగస్వామ్యం, కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) నిధులను ఆలయాలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. పథకం కింద మంజూరైన నిధులు నేరుగా కలెక్టర్ల అకౌంట్లలోకి వస్తాయి. వారే అభివృద్ధి పనుల పర్యవేక్షణ చేస్తారని దేవాదాశాఖ అధికారులు తెలిపారు.
స్వదేశ్ దర్శన్ కింద బల్కంపేట, భువనగిరి కోట
కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘స్వదేశ్ దర్శన్’ కింద కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు. హైదరాబాద్‌లోని 15వ శతాబ్దం నాటి ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం ఎంపికైంది. ఈ దేవాలయ ప్రాంగణంలో రూ. 4.4 కోట్ల నిధులతో కేంద్ర ప్రభుత్వం అన్నదానం భవనం, వర్షపు నీటి సంరక్షణ వసతులు, వరద నీటి డ్రైనేజ్ వ్యవస్థ, బయో టాయిలెట్స్ కాంపౌండ్ వాల్స్, గేట్లు, సీసీటీవీలు, సైనేజెస్, డీజీ సెట్, కెఫెటేరియా తదితర వసతులను కల్పించనున్నారు. అదే విధంగా చారిత్రక భువనగిరి కోట చరిత్ర భావితరాలకు తెలిసేలా రూ.56.81 కోట్లతో గైడెడ్ టూర్లు, లైట్ షోలు లాంటి సౌకర్యాలను కల్పిస్తున్నామని, రోప్ వే అభివృద్ధి, ఇంటర్-ప్రిటేషన్ సెంటర్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రూ.38 కోట్ల (ప్యాకేజీ-1)తో వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ ప్రాంతాన్ని ఎకో టూరిజంగా అభివృద్ధి చేసే పనులను చేపట్టారు.
మరిన్ని ఆలయాలకు ‘ప్రసాద్’ ప్రతిపాదనలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను సైతం ‘ప్రసాద్’ కింద ఎంపిక చేయాలని రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేసి కేంద్రానికి పంపేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందులో పాలమూరులోని కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయం, బాసర, అచ్చంపేట ఉమామహేశ్వరస్వామి ఆలయం, మహబూబ్ నగర్‌లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం, ఉర్కొండ అభయాంజనేయస్వామి ఆలయం, వికారాబాద్ అనంతగిరి క్షేత్రం, చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయం, కీసరగుట్ట శివాలయం, కురివి వీరభద్రస్వామి దేవాలయం, ఏడుపాయల వనదుర్గమాత దేవాలయం, బిచ్కుంద బసవలింగప్ప స్వామిగుడి తదితర ఆలయాలను విడతల వారీగా కేంద్రానికి పంపనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆలయాల అభివృద్ధికి కేంద్రం ఓకే చెబితే భక్తుల సంఖ్య సైతం పెరిగి దేవాదాయశాఖకు ఆదాయం కూడా భారీగా సమకూరనుంది.