లిక్కర్ స్కాం కేసులో పొలిటీషియన్లపై సీబీఐ ఫోకస్

by GSrikanth |
లిక్కర్ స్కాం కేసులో పొలిటీషియన్లపై సీబీఐ ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో సీబీఐ ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను విచారణకు రావాల్సిందిగా మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇంతకాలం ఈ కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై వ్యాపారవేత్తలను ప్రశ్నించిన సీబీఐ.. ఇప్పుడు పొలిటీషియన్లపై ఫోకస్ పెట్టింది. అందులో ఫస్ట్ స్టెప్‌గా మనీశ్ సిసోడియాను విచారించాలని భావిస్తున్నది. గతేడాది అక్టోబరులో ఆయనను ఒకసారి ప్రశ్నించినా.. తాజాగా మరోసారి విచారణ కోసం నోటీసు జారీ చేయడం గమనార్హం. ఇదే కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (ఒక సాక్షిగా) హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో డిసెంబరు 11న సీబీఐ విచారించింది. వీరిద్దరూ పొలిటికల్ లీడర్సే.

ఇదే కేసులో మనీ లాండరింగ్ కోణం నుంచి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవను ఈడీ అరెస్టు చేసింది. మద్యం కుంభకోణంలో అవినీతి, అధికార దుర్వినియోగం, ఎక్సయిజ్ పాలసీ కారణంగా ఢిల్లీ రాష్ట్ర ఖజానాకు ఏర్పడిన నష్టం తదితరాలపై సీబీఐ దృష్టి సారించింది. నేరపూరిత కోణం నుంచి సీబీఐ దర్యాప్తు చేస్తుండగా.. అక్రమ మార్గాల్లో ముడుపుల రూపంలో చేతులు మారిన డబ్బుపై, మనీ లాండరింగ్ కోణం నుంచి ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఏకకాలంలో రెండు దర్యాప్తు సంస్థలూ దూకుడు పెంచడంతో తదుపరి ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే స్కామ్‌లో ఈడీ పలువురిని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుని విచారించింది. మరికొందరిని అరెస్టు చేయకున్నా అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ రిమాండుకు తరలించింది. వీరిపై తీవ్రమైన అభియోగాలు నమోదైనందున బెయిల్ ఇవ్వడానికి స్పెషల్ కోర్టు నిరాకరించింది.

ఒకే సారి రెండు సంస్థలు..

ఒకేసారి సీబీఐ, ఈడీ సంస్థలు వేర్వేరు కోణాల నుంచి దర్యాప్తు చేస్తుండడంతో కేసు ఏ మలుపు తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ డిప్యూటీ సీఎంను రెండోసారి నోటీసులు జారీ కావడంపై పలు చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు దఫాలుగా ఆయన ఇంట్లో, ఆఫీసులో, బ్యాంకు లాకర్లలో సోదాలు జరిపినా ఏమీ దొరకలేదంటూ స్వయంగా సిసోడియా వేర్వేరు సందర్భాల్లో స్పష్టం చేశారు. గత నెలలో సంక్రాంతి పండుగ రోజున సైతం సచివాలయంలోని ఆయన ఆఫీసులో అధికారులు తనిఖీలు చేశారు. కానీ, అవి సోదాలు కావని, కొన్ని అంశాలపై క్లారిటీ తీసుకోడానికి, అవసరమైన వివరాలను సేకరించడానికి మాత్రమే వచ్చామంటూ సీబీఐ అధికారులు స్పష్టం చేశారు.

ఢిల్లీ మద్యం కుంభకోణంపై ప్రాథమిక దర్యాప్తు పూర్తిచేసిన సీబీఐ పలువురిని అరెస్టు చేసి వారిపై చార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టులో సమర్పించింది. స్కామ్‌లో పలువురి ప్రమేయం ఉన్నందున వారిని విచారించే ప్రక్రియ కొనసాగుతున్నదని, ఆ తర్వాత తదుపరి చార్జిషీట్‌లో అదనపు వివరాలు వెలుగులోకి వస్తాయంటూ అప్పట్లోనే సీబీఐ తరపు న్యాయవాది స్పష్టం చేశారు. తొలిసారి విచారణలో ఎక్సయిజ్ పాలసీకి సంబంధించిన వివరాలను రాబట్టిన సీబీఐ.. తాజా ఎంక్వయిరీలో ఏయే అంశాలపై ఫోకస్ పెట్టనున్నదనేది ఆసక్తికరంగా మారింది. మనీశ్ సిసోడియాను ప్రశ్నించి వదిలేస్తుందా? లేక అరెస్టు చేస్తుందా? అనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. తొలిసారి విచారణకు హాజరైనప్పుడు బీజేపీలో చేరాల్సిందిగా అధికారులు ఒత్తిడి చేశారంటూ ఆయన మీడియాకు వివరించారు. దీన్ని సీబీఐ తీవ్రంగా పరిగణించి తమకు రాజకీయాలతో సంబంధం లేదని వివరణ ఇచ్చింది.

కవితకు సైతం నోటీసులు?

మనీశ్ సిసోడియాకు కొనసాగింపుగా కవితకు కూడా నోటీసులు జారీ అవుతాయా? అనే చర్చలు ఢిల్లీ స్థాయిలో జోరుగా సాగుతున్నాయి. లిక్కర్ స్కామ్‌లో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, ఒక సాక్షిగా మాత్రమే తనను సీబీఐ అధికారులు విచారించారంటూ కవిత డిసెంబరు 11న క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే సీఆర్‌పీసీలోని సెక్షన్ 191 ప్రకారం సీబీఐ నోటీసులు జారీచేసి కొన్ని డాక్యుమెంట్లు, ఆధారాలను ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వ్యక్తిగతంగా స్థిర, చరాస్తుల వివరాలు, డైరెక్టర్‌గా ఉన్న కంపెనీల ఆర్థిక లావాదేవీలు తదితరాలను 2022 వరకూ క్రోడీకరించి ఇవ్వాలని ఆ నోటీసుల్లో సీబీఐ పేర్కొన్నది. ఆ ప్రకారం వివరాలను కవిత వారికి సమర్పించినట్టు ఆమె సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. మనీశ్ సిసోడియాను ఒకసారి విచారించిన తర్వాత రెండో సారి కూడా నోటీసులు జారీచేయడంతో కల్వకుంట్ల కవితకు సైతం ఇలాంటి నోటీసులు అందుతాయా? అనే చర్చలు మొదలయ్యాయి. లిక్కర్ స్కామ్‌లో మనీశ్ సిసోడియాను ప్రధాన నిందితుడిగా సీబీఐ పేర్కొన్నందునే ఆయనకు నోటీసులు వెళ్లి ఉండొచ్చని, కవితను ఒక సాక్షిగా మాత్రమే సీబీఐ పరిగణిస్తున్నందున రెండోసారి నోటీసులు రాకపోవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదే కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడిని ఈడీ అరెస్టు చేయడం అనూహ్యంగా జరిగిపోయింది. ఇకపైన కూడా ఇలాంటి ఊహకు అందని తీరులో సీబీఐ, ఈడీ అధికారులు ఎలాంటి షాక్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. మనీశ్ సిసోడియాను సీబీఐ ఆఫీసర్లు ఏ కోణం నుంచి ప్రశ్నిస్తారనేది కీలకం.

ఇంతకాలం వ్యాపారవేత్తలపై దృష్టి సారించిన సీబీఐ, ఈడీ ఇప్పుడు పొలిటీషియన్లపై దృష్టి సారించాయి. మాగుంట రాఘవను ఈడీ అరెస్టు చేయడంతో సీబీఐ ఇప్పుడు మనీశ్ సిసోడియాను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు ఢిల్లీ పొలిటికల్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. విచారణకు పిలిచినందున వెంటనే అరెస్టు చేయకపోయినా.. అరెస్టు చేసే అవకాశాలను కొట్టిపారేయలేమనే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ పొలిటికల్ లీడర్ల ఎంక్వయిరీలో భాగంగా తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సైతం మరోసారి నోటీసులు జారీ అయ్యే అవకాశాలపై ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో సైతం ఇలాంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. గులాబీ పార్టీ నేతలకు సైతం ఇలాంటి అనుమానాలు లేకపోలేదు. "సీబీఐ, ఈడీ ఏం చేస్తాయి?.. ఎక్కువలో ఎక్కువ అరెస్టు చేస్తాయి.. జైల్లో పెడతాయి... అంతకంటే ఎక్కువ ఏం చేస్తాయి.. చంపుతాయా..?" అంటూ బహిరంగంగానే ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. దీంతో కవితకు నోటీసులు జారీ చేసి విచారించడం, అవసరమైతే అరెస్టు చేసే వరకూ పరిణామాలు దారితీస్తాయనే అనుమానాలు ఆ పార్టీ నేతల్లోనే నెలకొన్నాయి. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story