- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Telangana : వ్యక్తిగత ఎజెండా లేదు.. చట్టాన్ని మాత్రమే అమలు చేస్తాను : సీఎం రేవంత్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన కోసం సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 33 జిల్లాలకు 33 మంది అబ్జర్వర్స్ ను నియమించాలని కోరారు. బుధవారం ఆయన గాంధీభవన్ లో జరిగిన కుల గణన సమీక్షలో మాట్లాడుతూ.. కుల గణన ఎక్స్ రే లాంటిది కాదని, ఒక మెగా హెల్త్ క్యాంప్ అని స్పష్టం చేశారు. తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడుతుందని, సామాజిక, ఆర్ధిక, రాజకీయ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ ఎన్నికల ముందు మాట ఇచ్చారన్నారు. దాని హామీని కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందన్నారు. సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభలో సోనియాగాంధీ కూడా తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారని, రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, అడ్డంకులు వచ్చినా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడంలో సోనియమ్మ సఫలీకృతం అయ్యారని సీఎం వ్యాఖ్యానించారు. గతంలోనూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసి ఇచ్చిన మాట నిలపెట్టుకున్న చరిత్ర సోనియమ్మదని వివరించారు. గాంధీ కుటుంబ ఓ మాట ఇస్తే, దాన్ని ఎవరు అడ్డువచ్చినా నెరవేర్చుతారన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఏం చెప్పినా, చేయాల్సిన బాధ్యత కార్యకర్తలుగా పీసీసీ చీఫ్, సీఎంలపై ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డి చట్టాన్ని అమలు చేస్తాడు తప్పా, వ్యక్తిగత ఎజెండాతో పనిచేయడని క్లారిటీ ఇచ్చారు. వ్యక్తులు ముఖ్యం కాదని, వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి ఇచ్చిన మాటను నిలబెట్టే వారసులుగా నిలవాలన్నారు.
కాంగ్రెస్ తోనే గుర్తింపు... పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలే...
రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా గుర్తింపు ఏమీ లేదని, కాంగ్రెస్ పార్టీతోనే వచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేస్తే తాను సీఎం కూర్చీలో కుర్చున్నానని వెల్లడించారు. ఇక పార్టీ ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్లామని, పార్టీ విధానాన్ని అమలు చేయడమే తమ ప్రభుత్వ విధానం అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో సంబంధం ఉన్న నిరంజన్ ను బీసీ కమిషన్ చైర్మన్ గా నియమించుకున్నామన్నారు. పని చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా, ప్రతీ క్షణం సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ క్యాడర్, లీడర్స్ పై ఉన్నదన్నారు. బాధ్యతగా పనిచేస్తే, పడిన కష్టానికి తప్పకుండా ఫలితం ఉంటుందన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట అమలు చేసే క్రమంలో ఎవరు అభ్యంతరకరంగా వ్యవహరించినా వారిని పార్టీ క్షమించదని నొక్కి చెప్పారు. దేశానికి తెలంగాణ ఒక మోడల్ గా మారాలని, ఆ దిశగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదన్నారు. నవంబర్ 30 లోగా కులగణన పూర్తి చేసి భవిష్యత్ యుద్ధానికి సిద్ధం కావాలన్నారు. తెలంగాణ నుంచే నరేంద్రమోదీపై యుద్ధం ప్రకటించాలన్నారు.
భవిష్యత్ జనగణనలో తెలంగాణ మోడల్
భవిష్యత్ లో కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో తెలంగాణ మోడల్ ను పరిగణనలోకి తీసుకునేలా మోడల్ డాక్యుమెంట్ ను కేంద్రానికి పంపుతామన్నారు. దేశ వ్యాప్తంగా కుల గణనకు వీలవుతుందన్నారు. ఇక ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా డీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు. రాజకీయ మనుగడ కోసం అడ్డంకులు సృష్టించినా 10 నెలల్లో 50 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. గ్రూప్ 1 విషయంలోనూ ప్రతిపక్షాలు రకరకాల అపోహలు సృష్టించి అడ్డుకోవాలని చూశాయన్నారు. జీవో ఇచ్చినపుడు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు, ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలైనప్పుడు కోర్టుకు పోని బీఆర్ఎస్, మెయిన్స్ నిర్వహించే సందర్భంలో జీవో 29పై రాద్ధాంతం చేశాయన్నారు. కానీ విద్యార్ధులకు న్యాయం జరుగుతుందని భావించిన సుప్రీంకోర్టు కూడా వారి పిటిషన్ ను కొట్టేసిందన్నారు.
అది తప్పుడు ప్రచారం....
కొంత మంది అగ్రవర్ణాల కోసమే గ్రూప్ 1 నిర్వహిస్తున్నారని, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని ఒక తప్పుడు వాదన తీసుకొచ్చారని, ఇది సరైంది కాదన్నారు. సెలక్టైన 31,383 మదిలో 10 శాతం లోపే అగ్రవర్ణాలు ఉన్నారన్నారు. 57.11 శాతం బీసీలు, 15.38 శాతం ఎస్సీలు, 8.87 శాతం ఎస్టీలు, 8.84 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాలో సెలక్ట్ అయ్యారని వివరించారు. స్పోర్ట్స్ కోటాలో మరో 20 మంది ఎంపికయ్యారన్నారు. బీఆర్ఎస్ ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలనే దుర్భుద్ధితో గ్రూప్ 1 పై అనవసరమైన తప్పుడు ప్రచారం చేశారన్నారు.
ఇందిరా గాంధీ దేశ పటిష్టతకు కృషి చేశారు
తన ప్రతి రక్తపు బొట్టు దేశ పటిష్టతకు తోడ్పతుందని ప్రకటించిన మహనీయురాలు మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆమె సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తెలిసినప్పటికీ దేశ సమగ్రత, సమైకత్య, పటిష్టత కోసం కఠిన నిర్ణయాలు తీసుకొని ఆమె ముందుకు సాగారని సీఎం గుర్తు చేశారు. ‘‘రాజభరణాల రద్దు... బ్యాంకుల జాతీయీకరణ, 20 సూత్రాల కార్యక్రమం వంటి విప్లవాత్మక నిర్ణయాలతో దేశ ప్రగతికి, పేదల అభ్యున్నతికి ఇందిరా గాంధీ ఎంతగానో కృషి చేశారన్నారు. తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ పాలనను ఆదర్శంగా తీసుకుందని.. ఆ మహనీయురాలి స్ఫూర్తితోనే పేదల అభ్యున్నతే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాన్ని చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.