డిజిటల్ క్రాఫ్ సర్వే చేపట్టలేం : ఏఈవోల ప్రకటన

by Y. Venkata Narasimha Reddy |
డిజిటల్ క్రాఫ్ సర్వే చేపట్టలేం : ఏఈవోల ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : డిజిటల్ క్రాప్ సర్వేకు వ్యతిరేకంగా అగ్రికల్చర్ ఎక్సటెన్షన్ ఆఫీసర్లు(ఏఈవో) గళమెత్తారు. శామీర్ పేట లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో అత్మీయ సమ్మేళనం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏఈవోలు సమావేశమై తమ సమస్యలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ప్రభుత్వం చేపట్టమన్న డిజిటల్ క్రాప్ సర్వే చేపట్టలేమని వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవోలు) తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా ఏఈవో సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ మేము ఉద్యోగంలో చేరిన గడిచిన 7 సంవత్సరాలలో అనేక వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, రైతు బంధు, రైతు భీమా అమలు, రైతు వేదికల నిర్మాణాలు అమలు చేశామని గుర్తు చేశారు.

ఇప్పుడు కూడా మేం ప్రభుత్వం ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సిద్దమని, అయితే పంటల పరిశీలన సర్వేకు వెళ్ళే ఏఈవోలకు సహాయకులను, భద్రతను ఇవ్వాలని తాము కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. గతంలో సర్వేలు జరిగినప్పుడు వీఆర్వో, వీఆర్ఏలు తమతో పాటు ఉండేవారని, ఇప్పుడు ఒంటరిగా వెళ్ళే క్రమంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా ఏఈవోలలో అధిక సంఖ్యలో ఉన్న మహిళా ఏఈవోలకు భద్రత కరువైందని , అందుకే డిజిటల్ క్రాప్ సర్వే చేయబోమని ప్రభుత్వానికి నివేదిస్తున్నామని తెలిపారు. సహాయకులను తోడుగా నియమిస్తే డిజిటల్ క్రాప్ సర్వే చేస్తామని, తమ సమస్యలపై ప్రభుత్వం అన్ని కోణాల్లో పరిశీలన చేయాలని కోరారు.

Advertisement

Next Story