- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామకాల రద్దు?.. కొత్త పాలకవర్గాల ఏర్పాటుకు సర్కార్ సై
దిశ, తెలంగాణ బ్యూరో : కొత్త సర్కారు ఏర్పడడంతో వివిధ స్థాయిల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు, ప్రభుత్వ సిబ్బందిలో బదిలీలు ఇప్పటికే మొదలు కాగా, పాత ప్రభుత్వంలో ఏర్పడిన కార్పొరేషన్ల చైర్‌పర్సన్, సభ్యుల తొలగింపు ఊపందుకుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీలను (ప్రస్తుత పాలకవర్గాలను) రద్దు చేయాలని ప్రభావం భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని మొత్తం 193 కమిటీలను ప్రక్షాళన చేసేలా ప్రణాళిక సిద్ధమైంది. ఈ కమిటీలకు నిర్దేశించిన రెండేళ్ల పదవీ కాలం పూర్తికాని వాటి విషయంలో వచ్చే లీగల్ చిక్కులను దృష్టిలో పెట్టుకుని అడ్వకేట్ జనరల్ నుంచి అభిప్రాయాలను ప్రభుత్వం కోరింది. అక్కడి నుంచి నివేదిక రాగానే దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటోంది.
నిర్దిష్టమైన నిబంధనలు
ప్రతి కమిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ సహా మొత్తం 18 మంది సభ్యులు ఉంటారు. నిత్యం మార్కెట్ కమిటీల పర్యవేక్షణ, ధరల నియంత్రణ తదితరాలను పర్యవేక్షించే ఈ కమిటీల కూర్పును వ్యవసాయ శాఖ లోని మార్కెటింగ్ విభాగం డైరెక్టర్ సంప్రదింపుల అనంతరం ప్రభుత్వం ప్రకటిస్తుంది. సభ్యులుగా ఎవరెవరు ఉండాలో కూడా నిర్దిష్టమైన నిబంధనలను రూపొందించింది. దీంతో చిన్న రైతులు, ఇతరులు, పాడి పశువుల యజమానులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళల నుంచి కూడా ఖచ్చితంగా పాలకవర్గంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. రెండేళ్ల పదవీ కాలం ముగియడానికి ముందు ఈ కమిటీ నిర్వాహకుల తొలగింపునకు అవలంభించాల్సిన పద్ధతులు, చట్టంలో ఉన్న అధికారాలపై ఇప్పటికే కసరత్తు పూర్తయింది.
నివేదిక రాగానే నిర్ణయం..
అడ్వకేట్ జనరల్ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం త్వరలో స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోనుంది. పాత ప్రభుత్వంలో ఏర్పడిన కమిటీలను రద్దు చేసి కొత్త పాలకవర్గాలు ఏర్పాటు త్వరలో సాకారం కానున్నది. ఈ కొత్త ప్రాసెస్ ద్వారా ఆయా గ్రామాల్లోని పార్టీ అభిమానులు, సానుభూతిపరులు, కార్యకర్తలకు అవకాశం లభిస్తుంది. పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పకుండా పదవులు ఉంటాయని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందే పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ఇప్పుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మార్కెట్ కమిటీల కూర్పులో మార్పులు చేర్పుల ప్రక్రియను వీలైనంత తొందరగా ముగించాలని అనుకుంటున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో గ్రామ స్థాయిలో పార్టీకి అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చని కాంగ్రెస్ పార్టీ భావన.
మూడున్నర వేల మందికి అవకాశాలు
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సుమారు మూడున్నర వేల మందికి గ్రామ స్థాయి నుంచి అవకాశాలు లభించనున్నాయి. మొత్తం 193 మార్కెట్లలో చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యుల నియామకం పేరుతో కొత్త వారికి అవకాశాలు రానున్నాయి. తొలుత మార్కెట్ కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన ప్రకటన వస్తే.. ఆ తరువాత మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ సలహా, అభిప్రాయాలతో కమిటీల కూర్పు కొలిక్కి వస్తుంది. రాబోయే సాగు సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని వీలైనంత తొందరగా కమిటీల కూర్పును కొలిక్కి తేవాలని ప్రభుత్వం భావిస్తుంది. గత పాలనలోని పైరవీలు, వైఫల్యాలను పరిగణనలోకి తీసుకుని వ్యవస్థలు సక్రమంగా పని చేయాలన్న ఉద్దేశంతో మార్పులకు కొత్త సర్కార్ శ్రీకారం చుట్టింది. త్వరలోనే కొత్త కూర్పుల మార్కెట్ కమిటీలపై క్లారిటీ రానుంది.