వివాదాస్పద స్థలంలోనే ప్రాజెక్టు.. అమాయకుల చేత కోట్లలో పెట్టుబడి!

by GSrikanth |
వివాదాస్పద స్థలంలోనే ప్రాజెక్టు.. అమాయకుల చేత కోట్లలో పెట్టుబడి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మై హోం మంగళకు ఎదురుగానే.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు 5 కి.మీటర్ల దూరమే. ఔటర్‌కు 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. హైటెక్ సిటీకి 5 నిమిషాలు, గచ్చిబౌలికి రెండే నిమిషాల్లో చేరొచ్చు.. 35 ఎకరాల్లో హైరైజ్ అపార్ట్‌మెంట్స్.. ఇతర కంపెనీలంతా చ.అ.కు 12 వేల నుంచి 13 వేల వరకు ఉంది. ఐతేనేం? చ.అ. ధర కేవలం రూ.4699 మాత్రమే. 1800, 2100, 2600, 3500 చ.అ.ల విస్తీర్ణంలో ఫ్లాట్స్. త్వరపడండి. అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అమాయకుల చేత పెట్టుబడి పేరిట రూ.కోట్లు కూడబెట్టారు. ఇదేదో మామూలు కంపెనీ కాదు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఏ చౌరస్తాలో చూసినా కనిపించే బిల్డాక్స్ కంపెనీ దందా కావడం విశేషం. ఇప్పటికే లక్షల్లో చ.అ.ల విస్తీర్ణం అమ్మేసినట్లు సదరు కంపెనీ ఎజెంట్లు కస్టమర్లకు చెప్తున్నారు. దీన్ని బట్టి ఎన్ని రూ.కోట్లు వసూలు చేశారో మీకే తెలుస్తుంది. ఐతే వారు ప్రచారం చేస్తోన్న లొకేషన్ ని బట్టి అది హఫీజ్ పేట సర్వే నం.80 కి సంబంధించిన స్థలం. ఐతే కోర్టు కేసులో ఉందని, టైటిల్ డిస్ప్యూట్ నడుస్తున్నదని హైదరాబాద్ లోని బిల్డర్లందరికీ తెలుసు. అందుకే జీహెచ్ఎంసీ అనుమతులు జారీ చేయడం లేదు.


కానీ బిల్డాక్స్ సంస్థ మాత్రం అందులోనే హైరైజ్డ్ అపార్ట్మెంట్స్ నిర్మించుకోవడానికి ధైర్యం చేస్తున్నది. పైగా ప్రీలాంచ్ ఆఫర్లతో వసూళ్లకు తెగబడ్డారు. క‌ళ్ల ముందే ఇంత పెద్ద అక్రమం జ‌రుగుతుంటే.. జీహెచ్ఎంసీ ఎందుకు పట్టించుకోవ‌ట్లేదు? రెరా అథారిటీ నోటీసులు జారీ చేసి చేతులు దులిపేసుకున్నది. అమాయక కొనుగోలుదారుల‌కు ఫ్లాట్లను అంట‌గ‌డుతుంటే.. సాహితీ త‌ర‌హాలో చేతులు కాలిన త‌ర్వాత మందు రాస్తారేమో? వివాదాస్పద స్థలంలోనే బిల్డాక్స్ భారీ ప్రాజెక్టును చేపడుతుండడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ల్యాండ్ పై అనేక వివాదాలు ఉన్నాయని తెలియక బ‌య్యర్లు వెనకాముందు చూడ‌కుండా సొమ్ము క‌ట్టేస్తున్నారు. ఇలా బిల్డాక్స్ సంస్థ ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల దాకా వ‌సూలు చేసింద‌ని స‌మాచారం. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ సంస్థకు చెందిన కొంద‌రు ఉద్యోగులు, రియాల్టీ ఏజెంట్లు.. గ‌జ‌దొంగ‌ల్లా ప్రజ‌ల సొమ్మును కొల్లగొడుతున్నారు. ఈ అక్రమ అమ్మకాలకు అడ్డుక‌ట్ట ప‌డ‌నంత కాలం.. బిల్డాక్స్ సంస్థ వంటివి ఇంకెన్ని రూ.వందల కోట్లు వసూలు చేస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.

పెట్టుబడికి స్వర్గధామం.. అంటూ

కొండాపూర్ ఏరియా.. మైహోం మంగళకు ఎదురుగానే.. 30 ఎకరాల్లో జి+35 నిర్మిస్తున్నాం. 15 టవర్లు. ప్రీలాంచ్ కింద చ.అ. ధర రూ.4699 మాత్రమే. 15 అంతస్తుల వరకు ఎలాంటి పెంపు ఉండదు. అదే ఏరియాలో మిగతా ప్రాజెక్టుల ధర రూ.12 వేల నుంచి రూ.13 వేల వరకు ఉంది. మూడున్నరేండ్లల్లో మీకు ఫ్లాట్‌ అప్పగిస్తాం. 30 రోజుల్లో 100 శాతం పేమెంట్ చేసిన వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందంటూ ఏజెంట్లు ప్రచారం చేస్తున్నారు. కానీ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్ పేట సర్వే నం.80లోని 484.31 ఎకరాలు సర్కారుదేనని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. పైగా అదే ల్యాండ్ పై అనేక కేసులు నడుస్తున్నాయి. దీంతో ఈ భూముల్లో ఎలాంటి క్రయ విక్రయాలు చేయొద్దని ప్రొహిబిటెడ్ జాబితాలో నమోదు చేశారు. మరి ఆ విషయం అంత పెద్ద బిల్డాక్స్‌కు తెలియకుండా ఉండదు. ఇందులో అపార్టుమెంట్లను క‌ట్టేందుకు అనుమ‌తి రాద‌ని.. ఐనా ప్రజ‌ల‌కు అనుమానం కలగకుండా మై హోం మంగళకు ఎదురుగా అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ల్యాండ్ లో కేసులు కొలిక్కి రాకుంటే అనుమతులు వచ్చే అవకాశమే లేదు. పైగా రెండు, మూడేండ్ల త‌ర్వాత ఎవ‌రైనా సొమ్ము ఇవ్వమ‌ని ఒత్తిడి చేస్తే.. అస‌లు మొత్తంలో ఎంతో కొంత వెన‌క్కి ఇచ్చేసి.. మిగ‌తా సొమ్మును వెన‌క్కి ఇచ్చేయాల‌న్నది కొన్ని సంస్థల మాస్టర్ ప్లాన్‌గా క‌నిపిస్తోంది. బ‌య్యర్లు అడిగేంత‌వ‌ర‌కూ వ‌సూలు చేసిన కోట్ల రూపాయ‌ల‌పై వ‌డ్డీని ఆస్వాదించాల‌ని కొన్ని సంస్థలు ఆచరణలో చూపించాయి.

ఆ రేటుతో మతి పోవాల్సిందే

హ‌ఫీజ్‌పేట్ స‌ర్వే నం.80 ప్రాంతం.. సుప్రీం కోర్టులో కేసున్న విష‌యం ప్రజాప్రతినిధులకు, పుర‌పాల‌క శాఖ అధికారుల‌కు, జీహెచ్ఎంసీ సిబ్బందికి తెలుసు. ఆ కేసు ప‌రిష్కార‌మైతే త‌ప్ప నిర్మాణ ప‌నుల్ని చేప‌ట్టడానికి వీలుండ‌దు. అలాంటిది బిల్డాక్స్ అనే సంస్థ ఏ ధైర్యంతో ప్రాజెక్టును మార్కెట్లోకి తీసుకొచ్చిందో అర్ధం కావడం లేదని డెవలపర్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏకంగా అందులో అపార్టుమెంట్లను నిర్మించ‌డానికి ప్రణాళిక‌ల్ని ర‌చించింది. ప్రణాళిక‌లైతే ఫ‌ర్వాలేదు కానీ.. ఈ కంపెనీ ఏకంగా ప్రీలాంచ్ ఆఫ‌ర్ ను ప్రక‌టించింది. ఆ రేటు చూసిన‌ వారెవ్వరైనా మ‌తిపోవాల్సిందే. ఎక్కడ్నుంచైనా డ‌బ్బులు తెచ్చి.. అందులో ఫ్లాట్ కొనాల‌న్న ఆలోచ‌న‌లు ఎవ‌రికైనా క‌లుగుతాయి. కాక‌పోతే అంద‌రూ గ‌మ‌నించాల్సిన అంశం ఏమిటంటే.. అస‌లీ నిర్మాణాన్ని క‌డుతున్నదెవ‌రు? అత‌ని బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి? గ‌తంలో ఎప్పుడైనా అపార్టుమెంట్లను నిర్మించిన చ‌రిత్ర ఉందా? వారి దగ్గర కొన్నవారిలో ఎంత‌మంది హ్యాపీ క‌స్టమ‌ర్లు ఉన్నారు. ప్రీలాంచ్ ఆఫ‌ర్ కింద సొమ్ము క‌ట్టిన త‌ర్వాత‌.. అందులో నిర్మాణానికి అనుమ‌తి రాక‌పోతే ఎలా? ఆయా అపార్టుమెంట్‌ను జీహెచ్ఎంసీ ప‌ర్మిష‌న్ ఇవ్వక‌పోతే ప‌రిస్థితి ఏమిటి? అస‌లీ ప్రాజెక్టుకు ప‌ర్మిష‌న్ వ‌స్తుందా? రేటు త‌క్కువుంద‌ని వంద‌లాది మంది బిల్డాక్స్‌కు సొమ్ము క‌ట్టిన త‌ర్వాత‌.. సాహితీ సంస్థ మాదిరిగా బిచాణా ఎత్తేస్తే ఎలా? ఇవన్నీ ఆలోచించకుండా కొనుగోలు చేస్తే ఇబ్బందులు తప్పవని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story