మళ్లీ గులాబీ గూటికి భిక్షమయ్యగౌడ్.. బంపరాఫర్ ఇచ్చిన కేటీఆర్?

by GSrikanth |   ( Updated:2022-10-21 03:32:10.0  )
మళ్లీ గులాబీ గూటికి భిక్షమయ్యగౌడ్.. బంపరాఫర్ ఇచ్చిన కేటీఆర్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ మళ్లీ గులాబీ గూటికీ చేరారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆయన తిరిగి గురువారం సాయంత్రం గులాబీ కండువా కప్పుకున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి, బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న తీవ్ర అన్యాయాన్ని, వివక్షను చూశాక ఆ పార్టీలో కొనసాగడంలో ఏమాత్రం అర్థం లేదని భావిస్తూ, ఆపార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు భిక్షమయ్యగౌడ్ ప్రకటించారు. బీజేపీ అధిష్టానానికి రాజీనామా లేఖను గురువారం పంపారు. తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంటామంటూ బీజేపీ చేసిన వాగ్దానాలను నమ్మి ఆ పార్టీలో చేరానన్నారు. మాజీ ఎమ్మెల్యేగా, సీనియర్ నాయకుడిగా రాజకీయాల్లో దాదాపు రెండున్నర దశాబ్దాల అనుభవం ఉన్న నాకు ఆ పార్టీలో చేరిన నాటి నుంచి అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో తనలాంటి బీసీ నాయకులను పట్టించుకునే వారే లేరని, పైగా ఈమధ్య కాలంలో పదే పదే తెలంగాణ రాష్ట్రానికి, బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ తీసుకుంటున్న పలు నిర్ణయాలు ఆ పార్టీలో కొనసాగకుండా చేశాయన్నారు.

తెలంగాణలో ఉన్న స్థానిక నాయకత్వంపైన ఢిల్లీలోని బీజేపీ హై కమాండ్‌కి ఏమాత్రం పట్టులేదనే విషయం పార్టీలో చేరిన కొద్ది కాలనికే అర్థమైందన్నారు. గత దశాబ్ద కాలంగా తెలంగాణలో ఎలాంటి మత సంఘర్షణలు ఆందోళనలు లేకుండా కొనసాగుతున్న ప్రశాంతమైన శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేలా స్థానిక బీజేపీ నాయకులు విద్వేశాలు పెంచేలా మాట్లాడినా, బీజేపీ హై కమాండ్ స్పందించకపోవడం నన్ను ఎంతో కలతకు గురిచేసిందన్నారు. నల్లగొండలో కోమటిరెడ్డి సోదరులు వందల మంది గౌడ్ల రాజకీయ జీవితాలను సమాధి చేశారన్నారు. కోమటి రెడ్డి దుర్మార్గపు రాజకీయల నుంచి దూరంగా పోయేందుకే బీజేపీలో చేరానని, కానీ రాజగోపాల్ రెడ్డి తన కాంట్రాక్టుల కోసం బీజేపీలోకి వచ్చారన్నారు. అయన వేల కోట్ల ఆర్థిక లాభం కోసం ఉపఎన్నిక తెచ్చి, బీజేపీ పార్టీ బీసీల మనోభావాలకు విలువ లేకుండా చేసిందన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీకి రాజీనామా చేశానన్నారు. కనీసం ఈ ఉపఎన్నిక సందర్భంగా అయినా మునుగోడు నియోజక వర్గంలో బీజేపీ ఇచ్చిన హామీలు నేరవేర్చి నిబద్దత నిరూపించుకోవాలని లేఖలో కోరారు.

కేసీఆర్‌తో భిక్షమయ్యగౌడ్ భేటీ

బీజేపీకి రాజీనామా చేసిన భిక్షమయ్యగౌడ్ గురువారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. మధ్యవర్తిత్వం మంత్రి కేటీఆర్ వ్యవహరించారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎలిమినేటి కృష్ణారెడ్డి ప్రస్తుతం కొనసాగుతుండగా ఆయన పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 30తో ముగుస్తుంది. ఆయన స్థానంలో భిక్షమయ్యగౌడ్‌ను నియమిస్తామని హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. గురువారం తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పలువురు నేతలు చేరారు.

Advertisement

Next Story

Most Viewed