ఆయనకో న్యాయం.. వీళ్లకో న్యాయమా?:బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

by Javid Pasha |   ( Updated:2023-06-18 10:12:51.0  )
RS Praveen Kumar
X

దిశ, వెబ్ డెస్క్: ఉపా చట్టం కేసులో ప్రొఫెసర్ హరగోపాల్ పై పెట్టిన కేసును రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. అగ్రకులానికి చెందిన ప్రొఫెసర్ హరగోపాల్ పై ఉపా చట్టం కింద కేసు నమోదు అయితే రాష్ట్రంలోని అగ్రకులానికి చెందిన అన్ని పార్టీల నాయకులు వేగంగా స్పందించారని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కేసు ఎత్తేలా చేశారని అన్నారు. ఇదంతా బాగానే ఉందని.. కానీ అదే కేసులో దళిత ప్రొఫెసర్ కాశీం అరెస్ట్ అయినప్పుడు వీళ్లంతా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రొఫెసర్ కాశీంతో పాటు బహుజనులు, ఆదివాసీ బిడ్డలపై ఉపా చట్టం కింద కేసులు నమోదు అయ్యాయని , నేడు ప్రొఫెసర్ హరగోపాల్ గురించి మాట్లాడిన ఏ ఒక్కరూ కూడా వీళ్ల గురించి మాట్లాడటం లేదని అన్నారు. తాడ్వాయి ఉపా కేసులో సీఎం మనసును కరిగించి ప్రొఫెసర్ పై కేసు కొట్టేలా చేసిన కుహన మేధావులు ఎవరో తనకు తెలుసునని అన్నారు.

‘‘ఆ మేధావులకు కొన్ని స్వార్థ ప్రయోజనాలుంటయి. అవి ప్రగతిభవన్కు అపాయింట్మెంటు, అపుడపుడు ఎర్రతివాచీ స్వాగతం(Red Carpet Welcome), విందులు, VC పోస్టులు, MLC సీట్ల రూపంలో ఉంటయి. ఈ మేధావులు అపుడపుడు సీఎం గారిని కీర్తిస్తూ ‘నమస్తే’ మరియు టిష్యూ న్యూస్ కు రాస్తుండాలి. చిలక పలుకులు పలుకుతూ ఉండాలి. ఇక గుట్ట మీద చిత్రమయి ఆర్ట్ గ్యాలరీ జైలులో ‘సారధి’ బ్యారక్ లో బందీ అయిన కోకిలమ్మల దండు ఉండనే ఉన్నది. Quid Pro Quo లాంటిదన్న మాట’’ అని సెటైర్లు వేశారు. రాష్ట్రంలోని బహుజన బిడ్డలపై ఇంత అన్యాయం జరుగుతున్న ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారని నిలదీశారు.

ప్రొ.ఖాశీం, సంధ్య, సోయం చిన్నయ్యలాంటి పోరాట యోధులు, మరెందరో అమాయకులకు న్యాయం జరగాలంటే బహుజన రాజ్యం రావాలని అన్నారు. బహుజనుడు సీఎం అయినప్పుడే అక్రమ కేసులు ఆగుతాయని చెప్పారు.100కు 90 మంది ఉన్న బహుజనులు తమ ఓటు తామే వేసుకుంటే బహజనుడు సీఎం అవ్వడం కష్టం కాదని చెప్పారు. ప్రతి పల్లె, గూడెం, బస్తీ, తోగు, తండా, గేరి, పేట, కాలనీ, సందులకు తిరిగి బహుజనులపై జరుగుతున్న అన్యాయాలను వివరించి బీఎస్పీకి ఓటేసేలా సామూహిక తీర్మానం చేయాలని కోరారు. రాజ్యాంగ వ్యతిరేక, బహుజన వ్యతిరేక, కేసీఆర్ మాఫియా ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా నిద్ర పోవద్దని కార్యకర్తలకు ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed