ఆ విషయంలో BRS యూత్ వింగ్ వెనుకంజ.. అధినేత కేసీఆర్ అసంతృప్తి

by Gantepaka Srikanth |
ఆ విషయంలో BRS యూత్ వింగ్ వెనుకంజ.. అధినేత కేసీఆర్ అసంతృప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ యువజన విభాగం ఇన్ యాక్టివ్ గా కనిపిస్తున్నది. ప్రభుత్వ వైఫల్యాలను, యువత సమస్యలను ఎత్తిచూపడంలో విఫలమవుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా.. కొత్తకమిటీని ఏర్పాటు చేయాలని కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దీని కోసం పేర్లను పరిశీలించగా, యూత్ వింగ్ చీఫ్ పదవి కోసం పలువురు మాజీ ఎమ్మెల్యేలు పోటీపడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

గళమెత్తని యూత్ వింగ్ నేతలు

బీఆర్ఎస్ అనుబంధ సంఘాల్లో యువజన విభాగం ఒకటి. అయితే ఆ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఈ వింగ్ ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదని తెలుస్తున్నది. కాంగ్రెస్ హామీలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి, విద్యారంగ సమస్యలను ఎత్తి చూపడంలో ఈ వింగ్ విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వివిధ సమస్యలపై పార్టీ నేతలు మాట్లాడుతూ కార్యక్రమాలు చేపడుతున్నా.. యూత్ వింగ్ మాత్రం సైలెంట్ గానే కనిపిస్తున్నది. అసలు పార్టీకి యువజన విభాగం ఉందా అనే అనుమానం బీఆర్ఎస్ కార్యకర్తలే వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

ఆరేండ్లకు పైగా ఒకే కమిటీ

పార్టీ అధినేత కేసీఆర్ 2017లో యువజన విభాగం అధ్యక్షుడిగా శంభీపూర్ రాజును నియమించారు. అప్పటి నుంచి అదే కమిటీ కొనసాగుతున్నది. తొమ్మిది నెలల క్రితం వరకు ఆ పార్టీ అధికారంలో ఉండటంతో నూతన కమిటీలపై దృష్టిపెట్టలేదు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విభాగం యాక్టీవ్ అవుతుందని, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ యూత్ పక్షాన పోరాటానికి కార్యచరణ రూపొందిస్తుందని భావించారు. కానీ తొమ్మిది నెలలవుతున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క కార్యక్రమం చేపట్టకపోవడం చర్చనీయాంశమైంది. నిర్లక్ష్యం, భయంతో కార్యక్రమాలు చేపట్టడం లేదా? లేకుంటే సమస్యలే లేవనే భావనతో ఉద్యమ కార్యచరణ చేపట్టడం లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

కొత్త కమిటీ కోసం కసరత్తు

యూత్ విభాగం కమిటీని యాక్టివ్ చేసేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. పాత కమిటీ బలహీనంగా ఉండటంతోనే ప్రభుత్వంపై పోరాటం చేయడం లేదనే ప్రచారం జరుగుతున్నది. యూత్ విభాగం బలోపేతంగా ఉంటేనే పార్టీ సైతం పటిష్టం అవుతుందని, అందుకోసం బలమైన నేత కోసం చూస్తున్నట్లు సమాచారం. పార్టీ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఈ కమిటీని వేసి పటిష్టం చేయాలని అధినేత భావిస్తున్నట్లు తెలిసింది. అందుకోసం కొంతమంది పేర్లను సైతం ఆయన పరిశీలించినట్లు సమాచారం.

ఆశిస్తున్న పలువురు మాజీ ఎమ్మెల్యేలు

యువజన విభాగం అధ్యక్ష పదవి కోసం పార్టీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. పార్టీ అధినేతకు సైతం విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. యువజన విభాగం బాధ్యతలు తనకే ఇస్తున్నారని ఇటీవల ఓ మాజీ ఎమ్మెల్యే తన సన్నిహితులతో పేర్కొన్నట్లు తెలిసింది. యువజన విభాగాన్ని పటిష్టం చేసిన తర్వాత ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు ఉధృతం చేయాలని పార్టీ భావిస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed