BRS VS BJP.. నిర్మల్‌లో హీటెక్కుతున్న పాలిటిక్స్!

by Sathputhe Rajesh |
BRS VS BJP.. నిర్మల్‌లో హీటెక్కుతున్న పాలిటిక్స్!
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : నిర్మల్ నియోజకవర్గంలో రాజకీయ వేడి అప్పుడే మొదలైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అటు అధికార బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నువ్వా? నేనా? అన్నట్లు దూకుడు పెంచుతున్నాయి. నిన్నటి దాకా ఎన్నికల వరకు వేచి చూసే పరిస్థితి కనిపించగా, కాంగ్రెస్ పార్టీని వీడి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ చేరిన అనంతరం నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. గతంలో ఆయన వెంట ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు, బీజేపీ శ్రేణులు తోడు కావడంతో ఆయన బలం ఒక్కసారిగా పెరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో రెండుసార్లు ఓడిపోయిన ఏలేటి వచ్చే ఎన్నికల్లో గెలుపు తీరాలను చేరేందుకు యత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే అధికారపక్షంతో పాటు ఇతర రాజకీయ పార్టీల నుంచి బీజేపీలోకి నేతలను ఆహ్వానించే ప్రయత్నం మొదలుపెట్టారు. దీంతో నియోజకవర్గంలో రాజకీయం రోజురోజుకు హీటెక్కుతున్నదని పలువురు చర్చించుకుంటున్నారు.

వలసలను ప్రోత్సహిస్తున్న పార్టీలు

వచ్చే ఎన్నికలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అత్యంత రసవత్తరంగా నిర్మల్ నియోజకవర్గంలో సాగుతాయని ప్రచారం మొదలైంది. అధికార పార్టీ అభ్యర్థిగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మరోసారి బరిలో ఉండబోతున్నారు. అత్యంత బలమైన నేతగా ఆయనకు ముద్ర ఉంది. అనేక ప్రతికూల పరిస్థితులను తట్టుకొని పలు ఎన్నికల్లో విజయం సాధించారు. ఎన్నికల్లో తలపడడం, పోల్ మేనేజ్మెంట్ చేయడం, విజయతీరాలకు చేరడం మంత్రి అల్లోలకు వెన్నతో పెట్టిన విద్య. అదే అనుభవంతో మళ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. రెండుసార్లు ఓడిపోయిన మహేశ్వర్ రెడ్డి ఈసారి మంచి ఊపు మీద ఉన్న బీజేపీ టికెట్ పై పోటీకి రంగంలోకి దిగుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల నుంచి నేతలు కార్యకర్తలను గోడ దూకుడుకు ప్రోత్సహిస్తున్నారు. మూడు రోజుల క్రితం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో సారంగాపూర్ మండలం జామ్ గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు అధికార పార్టీలో చేరారు. ఇది బీజేపీ శ్రేణులను కలవరానికి గురి చేసింది. దీంతో బీజేపీ నాయకత్వం మరుసటిరోజే ఆపరేషన్ ప్రారంభించి పార్టీ మారిన కమలం కార్యకర్తలను తిరిగి తమ గూటిలోకి చేర్చుకున్నది. ఈ వ్యవహారం నియోజకవర్గంలో తీవ్ర చర్చకు దారితీసింది. కాగా తాజాగా అధికార పార్టీలో కొనసాగుతున్న సీనియర్ కౌన్సిలర్ నాలుగు సార్లు వరుసగా గెలిచిన నేతగా పేరు ఉన్న అయ్యన్నగారి రాజేందర్ ను, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కలిశారు.

బిజెపి శ్రేణులతో కలిసి ఆయనను కలవడం చర్చకు దారితీసింది. రాజేందర్ బీజేపీ చేరడం ఖాయమని ప్రచారం మొదలైనప్పటికీ ఆయన పార్టీ కండువా కప్పుకోలేదని గతంలో మహేశ్వర్ రెడ్డితో ఉన్న సంబంధాల నేపథ్యంలోనే వారిద్దరూ కలిసినట్లు అంటున్నారు. అయ్యన్న గారి రాజేందర్ మంగళవారం ఏలేటి మహేశ్వర్ రెడ్డితో భేటీ అయిన ఘటనతో అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. తాజా పరిణామం నిర్మల్ పట్టణంలో తమకు మైనస్ గా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రంగంలోకి దిగారని ఆయన స్వయంగా పార్టీ శ్రేణులను ఎదుటి పక్షంలోకి వెళ్లకుండా ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఎన్నికలకు మరో ఆరు నెలల గడువు ఉండగానే నేతల పార్టీల మార్పు కప్పల తక్కెడగా మారిన పరిస్థితుల్లో ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కీలకమైన కాంగ్రెస్...

నిర్మల్ నియోజకవర్గం రాజకీయాల్లో కాంగ్రెస్ అత్యంత కీలకంగా మారబోతున్నది. మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరడంతో పార్టీకి నాయకత్వ లోపం ఏర్పడింది. అయితే అధికార పార్టీ నుంచి సారంగాపూర్ జెడ్పిటిసి సభ్యులు కాంగ్రెస్ లో చేరడం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆయనకు కూడా బలమైన బంధుగణంతోపాటు రాజకీయ అనుభవం ఉంది. ఆయన వల్ల ఎవరికి నష్టం.. ఎవరికి లాభం లేదా ఆయనే ఇద్దరిని దాటి ముందుకు వెళతారా.. అన్నది ఇప్పుడు రాజకీయంగా చర్చగా మారింది.

Advertisement

Next Story

Most Viewed