సర్పంచుల పెండింగ్ బిల్లులపై బీఆర్ఎస్ రాజకీయం

by karthikeya |
సర్పంచుల పెండింగ్ బిల్లులపై బీఆర్ఎస్ రాజకీయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల అంశంపై బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తున్నదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఓ రకంగా ఇప్పుడు మరోరకంగా వ్యవహరిస్తున్నదని సొంత పార్టీ నేతల నుంచి అసంతృప్తులు వినపడుతున్నాయి. నాడు ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నా బిల్లులను చెల్లించకుండా, ఇప్పుడు ఆందోళనలకు ఉసిగొల్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మాజీ సర్పంచుల ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం వెనక బీఆర్ఎస్ హస్తం ఉన్నట్టు నిఘా వర్గాలు ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఆందోళనలు చేస్తోన్న మాజీ సర్పంచుల్లో మెజార్టీ మంది బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారని ఆ రిపోర్టులో పేర్కొనట్టు సమాచారం.

నాడు అపాయింట్‌మెంట్ ఇవ్వని లీడర్లు.. ఇప్పుడు మద్దతా?

నాటి ప్రభుత్వ తీరు వల్లే ప్రస్తుతం మాజీ సర్పంచులు ఆందోళనలు చేస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. అప్పటి ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టడం వల్లే ఇబ్బందులు తలెత్తాయని చర్చ జరుగుతున్నది. బిల్లులను రిలీజ్ చేయాలని పలుసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని, కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా దూరం పెట్టారనే విమర్శలున్నాయి. అధికారం పోయిన తర్వాత మాజీ మంత్రులు మాజీ సర్పంచులపై ప్రేమ ఒలకబోస్తున్నారని సెటైర్లు వినిపిస్తున్నాయి. నాడు ఖజానాలో డబ్బులు ఉన్నా బిల్లులు చెల్లించలేదని, ఇప్పుడు మాత్రం మాజీ సర్పంచులను ఉసిగొల్పడం విడ్డూరంగా ఉందని ఆ పార్టీ నేతలు తమ ఇంటర్నల్ మీటింగ్‌లో సెటైర్లు వేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఇదే విషయాన్ని కొందరు సీనియర్ బీఆర్ఎస్ లీడర్లు మాజీ సర్పంచులకు ఫోన్ చేసి హితబోధ చేశారని సమాచారం. ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్న లీడర్లే నాడు మంత్రులుగా ఉండి ఏం చేశారో గుర్తు చేస్తూ ‘అప్పుడు మంత్రులుగా ఉన్నోళ్లు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. ఒకవేళ కలిసినా బిల్లుల అంశం ప్రస్తావిస్తే పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం మిమ్మల్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండాలి’ అని కౌన్సెలింగ్ ఇచ్చినట్టు తెలిసింది.

ఈ 10 నెలల్లో రూ.588 కోట్లు రిలీజ్

2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా, సర్పంచుల పదవీ కాలం 2024 జనవరి చివరన ముగిసింది. ఈ నెల రోజల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ గ్రామాలకు పనులు అప్పగించలేదు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న బిల్లులు అన్ని బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులవే. అయినా కాంగ్రెస్ పవర్‌లోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీల్లో జరిగిన పనులకు సుమారు రూ.588 కోట్లు రిలీజ్ చేసినట్టు సెక్రెటేరియట్ వర్గాలు తెలిపాయి. అయితే పంచాయతీ చట్టం ప్రకారం గ్రామాల్లోని పారిశుధ్యం, మంచినీటి పనులు మాత్రమే గ్రామపంచాయతీల నేతృత్వంలో జరగాలి. కానీ అప్పటి సర్కారు మాత్రం సర్పంచులతో బలవంతంగా సివిల్ కాంట్రాక్టు పనులు చేయించిందని, ఒకవేళ సర్పంచులు మొండికేస్తే గ్రామానికి ఇతర నిధులు ఇవ్వబోమని బెదరించి ఒప్పించినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనితో సర్పంచులు అప్పులు చేసి మన ఊరు–మన బడి, క్రీడా ప్రాంగణాలు, వైకుంఠధామాల పనులు చేశారనే ప్రచారం జరుగుతున్నది.

Advertisement

Next Story

Most Viewed