తెలంగాణతోనే పోదాం.. దేశమంతా ప్రచారానికి BRS ప్లాన్

by Mahesh |   ( Updated:2022-12-12 05:17:08.0  )
తెలంగాణతోనే పోదాం.. దేశమంతా ప్రచారానికి BRS ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : '' తెలంగాణ మోడల్ తోనే దేశ రాజకీయాల్లో పాపులర్ అవుదాం. అన్నిరంగాల్లోనూ రాష్ట్రం బెటర్‌గా ఉందని ఎస్టాబ్లిష్ చేద్దాం.. ఒక్కో స్కీమ్, ప్రాజెక్టుల స్లైడ్స్, ఇమేజ్‌లను తయారు చేసుకుందాం. ఆ తర్వాత ప్రచారంలోకి దిగుదాం.'' అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నొక్కి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీతో దేశ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న నేపథ్యంలో తెలంగాణ రోల్ మోడల్‌గా ప్రచారం చేసుకుందామని పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో వెల్ఫేర్ స్కీమ్స్, అభివృద్ధితో మరే రాష్ట్రం కంటే, కేంద్రం కంటే బెటర్ గా ముందుకెళ్దామని మంత్రులు, అధికారులకు సూచించారు.

ప్రతి వెల్ఫేర్ డిపార్టుమెంటులో ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉండాలని ఆదేశించారు. త్వరలోనే దళిత బంధుకు రూ. 2,000 కోట్లు విడుదల చేయాలనే ప్రాథమిక నిర్ణయం జరిగినట్లు తెలిసింది. సంక్షేమ పథకాలపై కేబినెట్‌ భేటీలో జరిగిన చర్చలో పాల్గొన్న ఒకరు వివరాలను వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదికి దళితబంధుకు రూ. 17,700 కోట్లు ప్రభుత్వం కేటాయించినందున ఆర్థిక శాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ జారీ చేసింది. నిధులు మాత్రం విడుదల కాలేదు. దీన్ని దృష్ట్యా వెంటనే అన్ని జిల్లాల్లో లబ్ధిదారులకు ఫండ్స్ రిలీజ్ చేయాలని సీఎం ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని పాపులర్ చేయడంపై..

సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిలోనూ తెలంగాణను నమూనాను మాటలతో కాకుండా నిర్దిష్టంగా ఏ స్కీమ్ కింద ఎంత మంది లబ్ధిదారులు, ప్రభుత్వసాయం, కలిగిన లబ్ధి, జీఎస్‌డీపీలో అది ప్రతిబింబించిన తీరు, ఇతరరాష్ట్రాలు దీనిని అనుసరించడం ఇలాంటి వేర్వేరుగా అంశాలతో పబ్లిసిటీ డిజైన్ల తయారీపై చర్చించినట్టు పేర్కొన్నారు. ఉదాహరణగా, 24 గంటల విద్యుత్, వ్యవసాయ రంగానికి ఉచిత కరెంట్, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు100 యూనిట్లు ఫ్రీ, లాండ్రీ-సెలూన్‌లకు రాయితీలు.. ఇలాంటివి ఉంటాయని పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా, దళిత బంధు, ఆసరా పింఛన్ల పైనా స్లైడ్స్ తయారవుతాయని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు థర్మల్ ప్రాజెక్టులు, రైతు వేదికలు తదితర అన్ని అంశాలనూ ప్రస్తావించాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

అన్ని రాష్ట్రాల్లోకి తీసుకెళ్లేలా..

సంక్షేమ పథకాలకు సక్రమం అమలయ్యేలా అన్ని వెల్ఫేర్ డిపార్టుమెంట్లలో కార్యదర్శి, కమిషనర్ స్థాయిల్లో వేర్వేరు ఐఏఎస్ అధికారులు ఉండాలని సీఎం నొక్కి చెప్పినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఎస్సీ వెల్ఫేర్ శాఖలో మాత్రమే ఇద్దరు వేర్వేరుగా ఉన్నారని, ఎస్టీ, బీసీ శాఖల్లో ఒక్కరే ఉండగా, వీలైనంత త్వరగా శాఖను కూడా పునర్ వ్యవస్థీకరించాల్సిందిగా సీఎస్‌ను ఆదేశించినట్లు వెల్లడించారు. ఓ వైపు ఎన్నికలు సమీపిస్తుండగా, మరోవైపు జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించడం లాంటి పరిస్థితుల్లో తెలంగాణ మోడల్‌ను అన్నిరాష్ట్రాల్లోకి తీసుకెళ్లడం, అక్కడి ప్రజలకు రాష్ట్ర పథకాలపై అవగాహన కలిగించడం ప్రచారం ప్రధాన లక్ష్యమని వివరించారు.

అలాగే నిర్దిష్టంగా ఖజానాకు అందని వివరాలన్నింటినీ ఆర్థికశాఖ మంత్రివర్గ సమావేశంలో నివేదిక రూపంలో అందజేసింది. ప్రత్యామ్నాయంగా రాష్ట్రమే సొంతంగా నిధులను ఏ తీరులో సమీకరించుకోవాలో ఆర్థిక మంత్రి, అధికారులు, సీఎంఓ అధికారులతో సీఎం విడిగా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి అంచనాల మేరకు ఆదాయం వచ్చిందో లేదో ఆరా తీసినట్లు తెలిపారు.

Also Read...

ఢిల్లీ పాలిటిక్స్ రాజశ్యామల యాగంతో షురూ!

Advertisement

Next Story

Most Viewed