- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎలక్టోరల్ బాండ్స్ కలెక్షన్లలో బీఆర్ఎస్ టాప్.. ప్రాంతీయ పార్టీల్లోనే ‘రిచెస్ట్’
దిశ, తెలంగాణ బ్యూరో: ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఏ పార్టీకి ఎంత ముట్టిందనే లెక్కలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలకే భారీ మొత్తంలో బాండ్ల రూపంలో కార్పొరేట్ సంస్థలు, సంపన్నుల నుంచి విరాళాలు అందుతున్నట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్ అత్యధిక కలెక్షన్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది. రెండు జాతీయ పార్టీల (బీజేపీ, కాంగ్రెస్) తర్వాత ఎక్కువ సంపన్నమైన పార్టీగా గుర్తింపు పొందింది. దేశంలో లాంఛనంగా ఎలక్టోరల్ బాండ్ల వ్యవస్థ ఉనికిలోకి (2017-18) వచ్చినప్పటి నుంచి గతేడాది మార్చి (2022-23) వరకు బీఆర్ఎస్ పార్టీకి ఈ రూపంలో అందిన విరాళం రూ. 912.69 కోట్లు. ఇందులో 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే ఒక్కసారిగా ఊహకు అందని తీరులో రూ. 529 కోట్లు సమకూరాయి.
దేశం మొత్తం మీద జాతీయ, ప్రాంతీయ పార్టీలను పరిగణనలోకి తీసుకుంటే బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్‌లో ఉన్నది. బీజేపీ రూ. 6,566 కోట్లతో ఫస్ట్ ప్లేస్‌లో, కాంగ్రెస్ రూ. 1,123 కోట్లతో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాయి. ఈ మూడు పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 2023 మార్చి వరకు సమకూరినవి. వీటినే కేంద్ర ఎన్నికల సంఘానికి ఆడిట్ రిపోర్టుల రూపంలో సమర్పించాయి. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు భారతీయ స్టేట్ బ్యాంకు ద్వారా విక్రయమైన బాండ్లలో ఏ పార్టీకి ఎంత ముట్టిందనే వివరాలు అథికారికంగా ఆడిట్ రిపోర్టులను వెల్లడించిన తర్వాత స్పష్టత రానున్నది. ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ 2018లో అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 30 విడతలుగా విక్రయాలు జరిగాయి.
రిచెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ :
ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్ ‘రిచెస్ట్’ గుర్తింపు పొందింది. దీనికంటే ముందు నుంచే ఉనికిలో ఉన్న పార్టీలన్నింటినీ దాటేసి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు సేకరించడంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. స్కీమ్ ఉనికిలోకి వచ్చిన సంవత్సరం బాండ్ల రూపంలో వచ్చిన ఆదాయం నిల్. గడచిన ఐదేండ్లలో రికార్డు స్థాయిలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 529 కోట్ల మేర బాండ్ల రూపంలో డొనేషన్లు అందాయి. దీంతో ఈ స్కీమ్ ద్వారా ఇప్పటివరకు బీఆర్ఎస్ రూ. 912.69 కోట్ల మేర విరాళాలను అందుకున్నది. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు వచ్చిన మొత్తం ఆదాయంలో ఇది 7.61%. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్యలో వచ్చిన ఆదాయాన్ని కలిపితే మరింత పెరగనున్నది.
విరాళాల్లోనూ గులాబీ పార్టీ రికార్డు :
ఎలక్టోరల్ బాండ్లతో సంబంధం లేకుండా ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా కూడా డొనేషన్లను ఆకర్షించడంలో బీఆర్ఎస్ టాప్ త్రీ ప్లేస్‌లో ఉన్నది. ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ సమర్పించిన ఆడిట్ రిపోర్టు (2022-23)లో సొంత పార్టీ నేతలు, పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల నుంచి రూ. 64.03 కోట్ల మేర అందాయి. ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా రూ. 90 కోట్లు మూడు చెక్కుల రూపంలో అందాయి. ఇక ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ. 529 కోట్లు అందాయి. ఈ ఒక్క సంవత్సరంలో బీఆర్ఎస్‌కు రూ. 683.06 కోట్ల మేర డొనేషన్లు సమకూరాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్టేట్ బ్యాంకులో అమ్ముడుపోయిన బాండ్లలో బీఆర్ఎస్‌కు ఎంత విరాళం వచ్చిందనేది 2023-24 ఆర్థిక సంవత్సరం ఆడిట్ రిపోర్టులో వెల్లడి కానున్నది.
నాటి ప్లీనంలో కేసీఆర్ వెల్లడి :
మన పార్టీకి వెయ్యి కోట్ల ఆస్తులున్నాయి.. తొందర్లోనే సొంత విమానం కొనుక్కుంటున్నాం.. అంటూ 2022 ప్లీనరీ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గర్వంగా చెప్పుకున్నారు. టీఆర్ఎస్ పార్టీని ఇకపై జాతీయ స్థాయికి తీసుకెళ్ళి నేషనల్ పార్టీగా తీర్చిదిద్దుతామని, కొద్దిమంది భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అంటూ పేరు కూడా పెట్టేస్తున్నారని వ్యాఖ్యానించారు. అప్పటికే వెయ్యి కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించగా ఆడిట్ రిపోర్టులో సైతం బాండ్ల ద్వారానే మొత్తం రూ. 912 కోట్లు సమకూరినట్లు వెల్లడించడం విశేషం. ప్రతీ జిల్లాలో ఎకరం స్థలం, తెలంగాణ భవన్ విలువ, బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు.. ఇవన్నీ కలుపుకుంటే మరింత ఎక్కువ.
బీఆర్ఎస్‌కు బాండ్ల ఆదాయం ఇలా.. (కోట్ల. రూ.లలో) :
2017-18 : నిల్
2018-19 : 141.50
2019-20 : 89.15
2020-21 : నిల్
2021-22 : 153.00
2022-23 : 529.03