BRS: ఆ సామాజికవర్గానికి దగ్గరయ్యరేలా బీఆర్ఎస్ ప్లాన్.. మొన్న ఓడించింది వాళ్లేనా?

by Gantepaka Srikanth |
BRS: ఆ సామాజికవర్గానికి దగ్గరయ్యరేలా బీఆర్ఎస్ ప్లాన్.. మొన్న ఓడించింది వాళ్లేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: గిరిజనులపై గులాబీ పార్టీ(BRS) దృష్టి సారించింది. వారిలోని అసంతృప్తిని తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నది. గత ఎన్నికల్లో దూరమైన ఆ వర్గానికి దగ్గరయ్యే అయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. లగచర్ల ఘటన(Lagacharla incident)లో బాధితులు అధికశాతం గిరిజను(tribals)లే కావడంతో వారి పక్షాన నిలబడి కొట్లాడేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే ఒకవైపు బాధిత కుటుంబాల పరామర్శ, మరోవైపు జైళ్లలోని గిరిజను రైతుల పరామర్శకు శ్రీకారం చుట్టారు. తాము గిరిజనుల పక్షమని చెప్పే ప్రయత్నా్న్ని గులాబీ పార్టీ ముమ్మరం చేసింది. గత తప్పిదాల నుంచి బయటపడేందుకు బీఆర్ఎస్ కృషి చేస్తున్నది.

బీఆర్ఎస్‌పై గత కొంతకాలంగా గిరిజనులు గుర్రుగా ఉన్నారు. 2022 సెప్టెంబర్ 17న బంజారాహిల్స్‌లోని బంజారా, ఆదివాసీ భవనాలను పార్టీ అధినేత కేసీఆర్(KCR) ప్రారంభించి గిరిజనులకు హామీలు కురిపించారు. గిరిజనులకు ఐదారు శాతం నుంచి 10 శాతం వరకు రిజర్వేషన్లు పెంచుతానని, గిరిజన బంధు(Girijana Bandhu Scheme) అమలు చేస్తామని, పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని, భూములు లేని వారికి పోడు భూములు పంచుతామని హామీ ఇచ్చారు. కానీ, అవన్నీ అమలుకు నోచలేదు. 10శాతం రిజర్వేషన్ పెంచుతూ జీవో జారీ చేసినప్పటికీ కేంద్రం నుంచి స్పష్టత రాలేదు. రాష్ట్రంలో రిజర్వేషన్ పెంచినా అమలులో సాధ్యం కాలేదు. దీంతో గిరిజనులు గత కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహించారు. దీంతో గత శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్లు వేయలేదని పార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యనించారు. వారు దూరం కావడంతోనే చాలా నియోజకవర్గాల్లో ఓటమిని చవిచూశామని పేర్కొన్నారు. నామినేటెడ్, కార్పొరేషన్లతో పాటూ అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనులకు టికెట్లు ఇచ్చినప్పటికీ ఆ వర్గం నుంచి సరైన రెస్పాన్స్ రాలేదని పార్టీ నేతలే అభిప్రాయపడ్డారు. కేవలం1.8 శాతం ఓట్ల తేడాతోనే బీఆర్ఎస్ చాలా సీట్లు కోల్పోంది. అందులోనూ గిరిజన ఓట్లే ఎఫెక్ట్ అని తేలింది. అందుకే వారికి దగ్గరయ్యేందుకు బీఆర్ఎస్ మళ్లీ వ్యూహాలను రచిస్తోంది.

లగచర్ల ఘటనలతో ముందుకు..

ప్రభుత్వం ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు భూసేకరణ చేపడుతోంది. లగచర్లలో భూ సేకరణకు వెళ్లిన అధికారులపై ప్రజలు దాడి చేసిన ఘటన తెలిసిందే. ఈ క్లస్టర్ భూ సేకరణలో ఎక్కువగా గిరిజనుల భూములే పోతున్నాయి. వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తుండటంతో అక్కడి ప్రజలు ససేమీరా అంటున్నారు. ఈ దాడి ఘటనలో గిరిజన రైతులపై కేసు నమోదు చేయడంతో పాటు జైలుకు తరలించారు. దీంతో సంగారెడ్డి జైలులో రైతుల పరామర్శకు కేటీఆర్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ నుంచి బృందం వెళ్లింది. అందులో సత్యవతి రాథోడ్(ఎమ్మెల్సీ), అనిల్ జాదవ్(ఎమ్మెల్యే), రమావత్ రవీంద్ర కుమార్(మాజీ ఎమ్మెల్యే), జాన్సన్ నాయక్(పార్టీ సీనియర్ నాయకుడు). వీరంతా గిరిజనులు కావడంతో వీరిని ముందుంచి ఆ వర్గానికి దగ్గర అయ్యేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందించినట్లు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు లగచర్ల గ్రామానికి పార్టీ నేతలను పంపించి బాధిత కుటుంబాలను పరామర్శించడం, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. వారి పక్షాన న్యాయస్థానాల్లోనూ కొట్లాడుతామని ఇప్పటికే పార్టీ ప్రకటించింది. వీటన్నింటితో గిరిజనులకు దగ్గర కావాలని పార్టీ భావిస్తున్నది.

మరోవైపు రైతుల పక్షాన పోరాటం..

బీఆర్ఎస్ మరింతగా రైతుల పక్షాన పోరాటానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు రుణమాఫీపై ధర్నాలు, మరికొంతమంది పాదయాత్రలు, రైతు బోనస్‌పై నిలదీతలు, మీడియా వేదికగాను ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. రాబోయే రోజుల్లో రైతుభరోసా, బీమాతో పాటు మరోవైపు గిరిజనులకు భూ పంపిణీ, పోడు భూముల సమస్యలపైనా గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల టైంలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలపైనా ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నది. ఏదీ ఏమైనప్పటికీ ప్రభుత్వం గిరిజనుల పక్షాన నిలబడి పోరాటం చేసి ఆ వర్గానికి పార్టీ దగ్గర కావాలని చూస్తున్నది.

Advertisement

Next Story