- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రౌండ్ లెవల్‌లో పార్టీ పరిస్థితిపై బీఆర్ఎస్ అధినేత ఫోకస్
రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్‌పై బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టింది. సర్వేలు నిర్వహించి పబ్లిక్ పల్స్ పసిగట్టే పనిలో పడింది. అయితే పార్టీకి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే దానిపై ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నట్లు తెలిసింది. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న జనరల్ బాడీ సమావేశంలో ఇదే ప్రధాన చర్చ కానున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పార్టీ నేతలకు అధినేత ప్రత్యేక కార్యాచరణ ఇవ్వనున్నట్లు తెలిసింది.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ, 2024లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటి నుంచే ప్లాన్ రచిస్తున్నారు. అందుకోసం స్థానిక పరిస్థితుల గురించి ఆరా తీస్తున్నారు. నేతలు, ఎమ్మెల్యేల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రజలు ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నారు? ఇతర పార్టీల నేతల్లో ఎలాంటి అభిప్రాయాలున్నాయి? ఏం చేస్తే విజయం సాధిస్తాం? ఇలా పలు అంశాల గురించి తెలుసుకుంటున్నారు. వాటికి అనుగుణంగానే ప్రణాళికలు రూపొందించనున్నట్లు సమాచారం.
జనరల్ బాడీ మీటింగ్‌లో..
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 27న ఘనంగా నిర్వహించేందుకు అధిష్టానం ఏర్పాట్లు చేస్తున్నది. అందులో భాగంగానే తెలంగాణ భవన్‌లో పార్టీ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించనున్నది. ఈ మీటింగ్‌లో ప్రధానంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్‌పై చర్చ జరగనున్నట్లు తెలిసింది. గత ఎన్నికలకు భిన్నంగా వ్యూహాలు రచించి, అమలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకు నేతలకు ప్రత్యేక కార్యాచరణను ఇవ్వనున్నట్లు తెలిసింది.
5 రాజకీయ తీర్మానాలు?
జనరల్ బాడీ సమావేశంలో రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి, విస్తృతంగా చర్చించి, వాటిని ఆమోదించనున్నట్లు తెలిసింది. అందులో ప్రధానంగా ఐదు రాజకీయ తీర్మానాలు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. సంక్షేమ పథకాలు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ వైఖరి, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి వెళ్లేలా నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. అదే విధంగా ఎన్నికల సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు విస్తృతం చేసే అవకాశం ఉన్నదని, దేనికైనా సిద్ధంగా ఉండాలని నేతలను సన్నద్ధం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సోషల్ మీడియానూ పటిష్టం చేసుకోవాలని, ప్రతిపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధినేత సూచించనున్నట్లు సమాచారం. అదే విధంగా అక్టోబర్ 10న భారత రాష్ట్ర సమితి వరంగల్ మహాసభ నిర్వహణపైనా ఇందులో చర్చించే అవకాశమున్నది.
ప్రతినిధులకు ఆహ్వానాలు
జనరల్ బాడీ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లతో పాటు కార్పొరేషన్ల చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల నేతలు సుమారు 300 మందికి పైగా ఆహ్వానాలు పంపుతున్నట్లు సమాచారం. ప్రతి ఒక్కరికీ పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలపడంతో పాటు జనరల్ బాడీ సమావేశానికి రావాలని ఆహ్వానంలో పేర్కొంటున్నట్లు తెలిసింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో పార్టీ ప్రతినిధులంతా అలర్ట్‌గా ఉండాలని, నిత్యం ప్రజల్లో ఉండేలా మార్గనిర్దేశనం చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను కేసీఆర్ వివరిస్తారని తెలిసింది.