బీఆర్ఎస్‌లో అలజడి.. హాట్ టాపిక్‌గా మారిన ఎమ్మెల్యేల మధ్య సంభాషణ?

by GSrikanth |
బీఆర్ఎస్‌లో అలజడి.. హాట్ టాపిక్‌గా మారిన ఎమ్మెల్యేల మధ్య సంభాషణ?
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్‌లో అలజడి మొదలైంది. ‘అన్నా నువ్వు పార్టీ మారితే.. నేనూవస్తా’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరికొకరు ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. స్థానిక, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ మారితేనే సేఫ్ అని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే తమ వ్యాపారాలను చక్కబెట్టుకోవడం, కేడర్ దూరం కాకుండా ఉండేందుకే ప్రయారిటీ ఇస్తూ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్టీల నేతలు బీఆర్ఎస్ వైపు చూశారు. గల్లీలీడర్ దగ్గరి నుంచి గులాబీ గూటికి చేరారు. అయితే అధికారం పోయి మూడు నెలలే అయినప్పటికీ మళ్లీ నేతలంతా అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ వైపు కొందరు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపునకు మరికొందరు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే పలువురు చేరారు. రాష్ట్రంలో ఏ పార్టీ అయినా అధికారంలోకొస్తే పదేళ్లపాటు అధికారంలో ఉండటం అనవాయితీ. దీనిని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు.

పార్టీ మారితే లాభమనే..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన వారికే ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లోనూ వారికే పెద్దపీట వేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కనీసం సమాచారం ఇవ్వకుండా ప్రారంభోత్సవాలు, అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు నిధులు కేటాయించకుండా పెండింగ్ పెడుతున్నారు. అంతేకాదు తాము చెబితేనే పనులు చేయాలని కాంగ్రెస్ నేతలు నియోజకవర్గాల్లో హుకూం కూడా జారీ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ గెలిచిన నియోజకవర్గాలకే పెద్దపీట వేస్తుండటం, బీఆర్ఎస్ గెలిచిన వాటిలో పనులు స్థంభిస్తున్నాయి. దీంతో ఏం పనులు చేయలేకపోతున్నామని, గెలిచినా లాభం లేదని పార్టీ మారితేనే లాభమని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఆదివారం ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరారు. ఇక గులాబీ వారంతా ఒక్కొక్కరుగా చేరడం ఖాయమేననే చర్చ జోరుగా సాగుతోంది.

కేడర్ మారితే ఇబ్బందులనే భావనబీఆర్ఎస్‌లో అలజడి మొదలు.. హాట్ టాపిక్‌గా మారిన ఎమ్మెల్యేల మధ్య సంభాషణ?బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా వ్యాపారస్తులే. అందులో ఒకరిద్దరు మినహా. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేకపోవడంతో వ్యాపారాలకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. దీంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో చేరితేనే తమకు లాభమని, సాఫీగా చేసుకోవచ్చని ఇప్పటికే పలువురు సంప్రదింపులు చేసినట్లు సమాచారం. కొందరు నియోజకవర్గ అభివృద్ధి పేరిట సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయిన విషయం తెలిందే. ఈ భేటీయే చేరికకు మార్గం సుగమం చేసుకునేందుకేనని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒకవైపు వ్యాపారాలు, మరోవైపు కేడర్‌ను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నేతలు తంటాలు పడతున్నారు. ప్రభుత్వ పనులు లేకుండా గ్రామస్థాయి నుంచి కాపాడుకోవడం సాధ్యం కాదని, ఒకవేళ తాము మారకుంటే కేడర్ మారితే రాబోయే కాలంలో ఇబ్బందులు పడతామని భావించి ముందే ఎమ్మెల్యేలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story