ఆయన పీసీసీ చీఫ్ కాదు పప్పెట్: బీఆర్ఎస్ నేతల ఫైర్

by srinivas |
ఆయన పీసీసీ చీఫ్ కాదు పప్పెట్: బీఆర్ఎస్ నేతల ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మ బలిదానాలకు కాంగ్రెస్ నాయకులే కారణమని, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని ప్రజలు నమ్మితే 2014,2018లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదని ఎమ్మెల్యే కె. పి వివేకానంద, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశం‌లో వారు మాట్లాడుతూ.... పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖను పొరపాటున కేసీఆర్‌కు పంపారనే అనుమానం కలుగుతుందన్నారు. పేరుకే మహేష్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడని ఆయనను ఓ పప్పెట్‌లా మార్చారన్నారు. గతంలో పని చేసిన పీసీసీ అధ్యక్షులు సీఎంల పని తీరు బాగా లేకపోతే బహిరంగగానే చెప్పేవారని ఎమ్మెల్యే కె.పి వివేకానంద ఎద్దేవా చేశారు.

పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది కేసీఆర్ అనే విషయాన్ని మహేష్ గౌడ్ తెలుసుకోవాలని హితవు పలికారు. ఆర్థిక రంగంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్న మహేష్ కుమార్ ఆర్బీఐ హ్యాండ్ బుక్‌ను చదువుకోవాలన్నారు. రుణమాఫీ 25 లక్షల మందికి కూడా పూర్తికాలేదన్నారు. ఘట్కేసర్‌లో ప్రాథమిక సహకార సొసైటీలో ఒక్క రైతుకు కూడా రుణమాఫీ కాలేదని, సీఎంతో మాట్లాడి వారికి రుణ మాఫీ చేయించి, మహేష్ కుమార్ డమ్మి పీసీసీ ప్రెసిడెంటా అసలైన... ప్రెసిడెంటా అనేది తేల్చుకోవాలన్నారు. ఉద్యమం నుంచి పుట్టిన తల్లే తెలంగాణకు నిజమైన తల్లి అని, ఉద్యమంలో ఉన్న తల్లికి కాంగ్రెస్ నేతలు దండలు వేసిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సంకుచిత మనస్తతత్వం గురించి పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడాలన్నారు.మూసి, హైడ్రా, కాళేశ్వరం, అదానీ అన్నింటిలో రేవంత్ రెడ్డివి ద్వంద్వ ప్రమాణాలేనని, తన శాడిస్టు ధోరణితోనే హిరో అల్లు అర్జున్‌ను అరెస్టు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్ సాయిరెడ్డి తన ఆత్మహత్య లేఖలో రేవంత్ సోదరుల పేర్లు రాసిన చర్యలు తీసుకోలేదన్నారు.

అనంతరం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ... మహేష్ గౌడ్ రాసిన లేఖ చిత్తు కాగితంతో సమానరమన్నారు. నీళ్లు, నిధులు,నియామాకాలపై మీరు తప్పుడు లెక్కలు చెప్పారు. కానీ, ఈ నినాదాలను ఆచరణలో కేసీఆర్ చేసి చూపించారన్నారు. తెలంగాణ సంస్కృతి గురించి అసలు రేవంత్,మహేష్ గౌడ్‌కు తెలుసా..? తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను మాయం చేస్తారా..? కేటీఆర్, హరీష్ రావు, కవితలు ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మహేష్ ఎక్కడ ఉన్నారంటూ ధ్వజమెత్తారు. అప్పులపై కాంగ్రెస్ చేస్తున్న అబద్దాలకు ఆర్బీఐ చెంపపెట్టులాంటి నివేదిక ఇచ్చిందన్నారు. కేసీఆర్ హయాంలో చేసిన అప్పు 3 లక్షల 17 వేలకోట్ల రూపాయలేనని ఆర్బీఐ పేర్కొన్నట్టు వివరించారు. రేవంత్ ఏడాది లో లక్ష కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు ? చిన్న ఆస్తి నైనా సృష్టించారా ?..కాంగ్రెస్‌ను బొంద పెట్టొద్దు అని పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ రేవంత్‌ను కోరుతూ లేఖ రాయాలంటూ హెచ్చరించారు. మొదట గురుకులాల దండగ అన్న సీఎం మేం మెడలు వంచడంతో గురుకులాల బాట పట్టారన్నారు. అసెంబ్లీ, మండలి సమావేశాలు నెల రోజులు జరపాలని పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్‌కు లేఖ రాయాలని కేటీఆర్ మీద ఎన్ని కేసులు పెట్టాలని చూసినా బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు.

Advertisement

Next Story