- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MP ఎన్నికల వేళ పీకల్లోతూ కష్టాల్లో బీఆర్ఎస్.. KCR ఎంట్రీ ఇవ్వకుంటే భారీ నష్టం తప్పదా..?
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీ లీడర్లు, కేడర్‌లోనూ రాజకీయ భవిష్యత్తుపై భయాలు మొదలయ్యాయి. కారణంగా ‘గులాబీ’ నుంచి ఒక్కొక్కరుగా సిట్టింగులు, మాజీలు బయటకు వస్తున్నారు. పార్టీ నాయకత్వం పట్టించుకోవడంలేదనే అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికే పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరగా మరికొందరు నేతలు అదే దారిని ఎంచుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీలో చేరేందుకు పలువురు సిట్టింగ్ ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరుగుతున్న ఈ పరిణామాలతో బీఆర్ఎస్ అధిష్టానం ఆందోళనలో పడింది. ఎలక్షన్ షెడ్యూలు విడుదలయ్యే నాటికి ఇంకెంతమంది చేజారిపోతారోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పెరుగుతున్న సంఖ్య!
బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చే వారి సంఖ్య ఇంకా పెరగొచ్చనే అనుమానాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలవడం, అదే సమయంలో సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారుతుండటం గులాబీ నేతల్లో అనుమానాలను పెంచింది. ఏ టైమ్‌లో ఏం జరుగుతుందో తెలియని ఆందోళన నెలకొన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కనీసం లోక్‌సభ ఎన్నికల్లోనైనా కొంత బలపడదామని భావిస్తున్న పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. పార్టీ మారడానికి చాలా మంది రెడీ అవుతున్నారనే ప్రచారం నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. సిట్టింగులు మొదలు మాజీలు, చిన్న లీడర్లు మొదలు రాష్ట్ర స్థాయి నేతలు సైతం పార్టీకి దూరమవుతున్నారు.
ఇందుకు కారణం ఏంటో తెలియక నాయకత్వం స్పష్టమైన అంచనాకు రాలేకపోతున్నది. వీటిని నివారించడంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఫెయిల్ అయ్యారనేది పార్టీలో కామన్ టాక్‌గా మారింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు నేతలు జారిపోవడం పార్టీ బలహీనపడడానికి దారితీస్తుందనే అభిప్రాయం బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతున్నది. ఇప్పుడు నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగడం అనివార్యంగా మారిందని, నష్ట నివారణ బాధ్యత ఆయనపైనే ఉన్నదని ఆ పార్టీ లీడర్లు వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు లీడర్లు కాంగ్రెస్‌వైపు చూస్తుంటే మరికొందరు బీజేపీవైపు చూస్తున్నారు. దీన్ని చక్కదిద్దకుంటే నష్టం ఊహకు అందని తీరులో ఉంటుందనేది అధినేత కేసీఆర్ అభిప్రాయం.
ఒక్కొక్కరుగా బయటకు..
పార్టీకి లాయల్‌గా ఉన్న బొంతు రామ్మోహన్, బాబా ఫసియుద్దీన్, డిప్యూటీ మేయర్ శ్రీలత, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. వీరిలో చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. ఇక మున్సిపాలిటీలలో కౌన్సిలర్లు, కార్పొరేషన్లలో కార్పొరేటర్లు సైతం పదుల సంఖ్యలో హస్తం పార్టీ గూటికి చేరారు. అధికారంలో ఉన్న పదేండ్ల కాలంలో ఇతర పార్టీల నుంచి లాక్కున్న బీఆర్ఎస్.. ఇప్పుడు రివర్సులో ఆ పరిణామాలను చవిచూస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పటిష్టమైన 60 లక్షల కేడర్ ఉందంటూ గొప్పగా చెప్పకుంటున్నా కంటికి కనిపించని తీరులో బీటలు వారుతుండడం కేసీఆర్‌ను ఆందోళనకు గురిచేస్తున్నది.
సీనియర్లతో సహా..
పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్‌లో చేరడం, నాగర్‌కర్నూల్ ఎంపీ సైతం బీఆర్ఎస్ను వీడుతున్నట్టు దాదాపుగా స్పష్టం కావడంతో ఆ వరుసలో ఇంకెవరున్నారనేది అంతు చిక్కడంలేదు. జహీరాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం ఎంపీలు సైతం పార్టీ మారుతారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతున్నది. వీరితోపాటు ఇటీవల సీఎంను కలిసిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం గులాబీ పార్టీని వీడే అవకాశం ఉందన్న వాదన తెరపైకి వచ్చింది. మరికొంతమంది త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం ఉందనే వార్తలూ వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్లో రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నవారు, సీనియర్ నేతలు సైతం ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం.
వాడుతున్న గులాబీ..
పటిష్టమైన నాయకత్వం, అరవై లక్షల కార్యకర్తలు, పార్టీ కోసం పనిచేస్తున్నారని కేటీఆర్ చెప్పుకుంటున్నా ఆయనకు సన్నిహితంగా ఉన్న లీడర్లే పార్టీని వీడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వార్ రూమ్‌లో యాక్టివ్‌గా పనిచేసిన బొంతు రామ్మోహన్ కాంగ్రెస్‌లో చేరగా.. ఇంతకాలం బీఆర్ఎస్తో ఉన్న మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెండు రోజుల క్రితం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. పార్టీలో గుర్తింపు లేదని, ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని, ఏండ్ల తరబడి పనిచేస్తున్నా సముచిత స్థానం కల్పించడం లేదని.. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. లీడర్లు పార్టీ మారడం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది కీలకంగా మారింది.
డ్యామేజ్ కంట్రోల్లో పార్టీ అధినేత
పార్టీ మారుతున్న నేతలు రాజకీయ భవిష్యత్ కోసం వెళ్తున్నారా?.. లేక నాయకత్వంపై అసంతృప్తితోనా?.. లేక ఇక్కడ ఇమడలేని పరిస్థితులు ఉన్నాయా?.. ఈ అంశాలు ఇప్పుడు గులాబీ బాస్‌ను కుదిపేస్తున్నాయి. పార్టీలో గుర్తింపు లేదన్నదే నిజమైతే ఇంతకాలం ఎలా కొనసాగారు?.. అవకాశం కోసమే వెళ్లిపోతూ రాజకీయ విమర్శలు చేస్తున్నారా?.. ఈ పరిణామాన్ని నిలువరించడం ఎలా?.. అనేవి కేసీఆర్ ముందున్న సవాళ్లు. పార్టీ మారేవారితో ఎంతవరకు నష్టం?.. ఆ ఎఫెక్టు ఏ స్థాయిలో ఉంటుంది?.. ఆపడానికి ఉన్న మార్గాలేంటి?.. సంప్రదింపులకు ఎవరిని పంపాలి?.. వెళ్లిపోయేంతవరకూ గుంభనంగా ఉన్నప్పుడు కనిపెట్టడం ఎలా? ఇలాంటి వాటిపై అధినేత ఫోకస్ పెట్టారు.
పాపులారిటీ ఉన్న నేతలు జారిపోకుండా చర్యలు మొదలయ్యాయి. పార్టీకి దూరం కావాలనుకుంటున్న నేతల వివరాలపై ఆయన ఆరా తీస్తున్నారు. ఆ జాబితాలో ఎవరెవరున్నారు, వారిని నిలువరించడం ఎలా.. అని సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పరిస్థితిని చక్కదిద్దకుంటే ఈ పరిణామాలు ఎక్కడివరకైనా దారితీయవచ్చనేది ఆందోళన నెలకొన్నది. వారిని నిలువరించలేని పరిస్థితుల్లో ‘వెళ్లిపోయేవారంతా అవకాశవాదులే.. స్వార్థం కోసమే వెళ్తున్నారు.. అధికారంలో ఉన్న పార్టీకి దగ్గరవుతున్నారు.. వారి అవసరాలను తీర్చుకోడానికే ఇదంతా’ అనే ప్రచారంతో కవర్ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. కార్యకర్తల మనోదైర్యం దెబ్బతినకుండా దిద్దుబాటు చర్యలపై దృష్టి సారించారు.