Assembly: రైతుల చావుకు కారణం బీఆర్ఎస్సే.. వేముల వీరేశం సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
Assembly: రైతుల చావుకు కారణం బీఆర్ఎస్సే.. వేముల వీరేశం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైతుల చావుకు కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని, రైతును రాజు చేస్తా అని చెప్పి, అప్పుల పాలు చేసిందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఫైర్ అయ్యారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మాట్లాడిన ఆయన రైతు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. రైతు రుణ మాఫీపై సంతోషం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో అధికారిక లెక్కల ప్రకారం 4 వేల పైచిలుకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల చావుకు కారణం అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే రైతు బంధు వల్ల ఒరిగిందేమి లేదని, ఎకరం పొలంలో వ్యవసాయం చేయాలంటే చాలా పెట్టుబడి అవుతుందని, దానికి 5 వేలు ఇచ్చి గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో మార్పులు తీసుకొచ్చినట్టు గప్పాలు కొట్టారే తప్ప చేసింది శూన్యమని ఆరోపించారు.

రైతులను సన్న వరి పండించవద్దని చెప్పారని, దానితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. అలాగే పత్తి వేయవద్దని చెప్పినందుకు రైతులు చిరుదాన్యాలు పండించుకున్నారని, కానీ అదే సంవత్సరం పత్తి భారీ ధరకు అమ్ముడవడంతో రైతుల ఆదాయానికి గండి పడినట్టు అయ్యిందన్నారు. గత ప్రభుత్వం అశాస్త్రీయమైన ఆలోచనలతో రైతుల నడ్డి విరిచిందని అన్నారు. చనిపోయిన రైతులకు రైతు భీమా ఇచ్చామని పదే పదే చెప్పుకుంటున్నారని, కానీ ఆత్మహత్య చేసుకున్న రైతులకు 5 లక్షలు ఇవ్వాలని గతంలోనే జీవో ఇచ్చారని, దాని ప్రకారమే రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ఇచ్చారని తెలిపారు. దానిని మసిపూసి మారేడు కాయ చేసి కొత్తగా ఇచ్చినట్లు చూపించారని అన్నారు. అంతేగాక క్రాఫ్ కాలనీల మాట అటకెక్కిందని, యంత్రాల సబ్సీడీని ఎత్తేశారని, రైతును రాజును చేస్తా అని చెప్పి, అప్పుల పాలు చేశారని, రైతే రాజు అన్న మాటను పేపర్లకే అంకితం చేశారని వేముల వీరేశం అన్నారు.

Advertisement

Next Story

Most Viewed