మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఒంటరి పోరే..! KCR యాక్షన్ ప్లాన్ ఇదే?

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-09 02:24:22.0  )
మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఒంటరి పోరే..! KCR యాక్షన్ ప్లాన్ ఇదే?
X

దిశ, తెలంగాణ బ్యూరో : మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఒంటిరిగానే పోటీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. అన్ని నియోజకవర్గాల్లో ఏ పార్టీతో సంబంధం లేకుండా పోటీ చేయాలని భావిస్తుంది. అందులో భాగంగానే నియోజకవర్గానికి 50వేల సభ్యత్వం చేయాలని నేతలకు టార్గెట్ ఇచ్చింది. 10వేల మంది మహిళలు ఖచ్చితంగా ఉండాలని స్పష్టం చేసింది. ప్రతి సభ్యత్వాన్ని ఆన్‌లైన్ చేసేలా చర్యలు చేపట్టింది. పార్టీ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పించాలని ఇప్పటికే పార్టీ నేతలను అధిష్టానం ఆదేశించింది.

మహారాష్ట్రలో తొలి అడుగుతోనే విజయ ఢంకా మోగించాలని భావించిన కేసీఆర్ అక్కడ జరిగే స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని బీఆర్ఎస్ భావిస్తుంది. రాష్ట్రంలోని 288 నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోటీ చేయాలని పక్కా ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే స్థానిక నేతలకు కార్యాచరణను ఇచ్చింది. యాక్టీవ్ మెంబర్స్ వెయ్యిమందిని గుర్తించి క్రియాశీల సభ్యులకే పదవులు అని కేసీఆర్ ప్రకటించారు. సర్పంచ్ మొదలు ఎంపీ వరకు అన్ని స్థాయిల పదవులకు ప్రథమ అర్హత క్రియాశీల సభ్యత్వమనే విషయాన్ని మరువద్దని సూచించారు. ప్రచారం చేయాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు.

ప్రతి సభ్యత్వం ఆన్‌లైన్...

సభ్యత్వాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేసేలా చర్యలు చేపట్టారు. ప్రతి నియోజకవర్గానికి ఒక మొబైల్ వాహనం ఏర్పాటు చేశారు. ప్రతి సభ్యుడి వివరాలను వెనువెంటనే పొందుపర్చడంతో వివరాలను కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. ప్రతిగ్రామం నుంచి సభ్యత్వం చేసేలా చర్యలు చేపట్టారు. ఈ నెల 10వ తేదీ నుంచి వచ్చే నెల 10లోగా పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.

మహిళలకు ప్రాధాన్యం..

జిల్లా సమన్వయకర్తలు, వారి పరిధిలో ఉండే నాయకులు పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదుపై దృష్టి కేంద్రీకరించాలని అధిష్టానం ఆదేశించింది. సంస్థాగత నిర్మాణంలో గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ కమిటీలు, పట్టణ, నగర ప్రాంతాల్లో వార్డు కమిటీలు వేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీ అనుబంధ కమిటీల్లో రైతు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, యువజన, మహిళ, విద్యార్థి, లీగల్ సెల్, సోషల్ మీడియా కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పించాలని కేసీఆర్ సూచించారు.

టార్గెట్ రైతులు, మహిళలే...

రైతులు, మహిళలే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతున్నది. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం అందుకున్న కేసీఆర్ మహిళల సాధికారత కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని మరో అంశాన్ని తెరమీదకు తెస్తున్నారు. పార్టీకి ఆదరణ వీరితోనే సాధ్యమని భావించిన గులాబీ నేత వారి సమస్యలనే అస్త్రంగా చేసుకొని ముమ్ముర ప్రచారం చేయనున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు, రాయితీలను వివరించి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కరపత్రాల ద్వారా తెలంగాణ సంక్షేమ, అభివృద్ధిని గడపగడపకు వివరించేలా ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నారు.

వెయ్యిమందితో సోషల్ మీడియా టీం..

ప్రతి నియోజకవర్గంలో సభ్వత్వాల సమయంలోనే వెయ్యిమందిని యాక్టివ్‌గా ఉన్నవారిని గుర్తించనున్నారు. వారితో వార్డు, గ్రామ, మండలాల, నియోజకవర్గాల వారీగా సోషల్ మీడియా కమిటీ వేయనున్నట్లు సమాచారం. ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు వినియోగించుకోనున్నట్లు తెలిసింది. అదే విధంగా తెలంగాణ చేపట్టిన అబివృద్ధి, సంక్షేమాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదని పోల్చుతూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయనున్నారు.

Read more:

ప్లస్సా..? మైనస్సా..? ఆ నేతలపై KCR నజర్!

Advertisement

Next Story