Yennam Srinivas Reddy: ఆ విషయంలో హరీశ్ నెంబర్ వన్.. కేసీఆర్ నేలకు ముక్కు రాసినా నో యూజ్: యెన్నం

by Prasad Jukanti |   ( Updated:2024-09-13 09:49:35.0  )
Yennam Srinivas Reddy: ఆ విషయంలో హరీశ్ నెంబర్ వన్.. కేసీఆర్ నేలకు ముక్కు రాసినా  నో యూజ్: యెన్నం
X

దిశ, డైనమిక్ బ్యూరో: అధికారం కోల్పోయాక కల్వకుంట్ల కుటుంబం బెంబెలెత్తిపోతోందని, బీఆర్ఎస్ నేతలు ఉన్మాదులుగా మారి శిఖండి రాజకీయాలకు తెరలేపారని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయారా లేక ఉన్మాదంలో ఉన్నాడా తెలియడం లేదన్నారు. వరదలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారిని పరామర్శించాల్సిన కేసీఆర్, కేటీఆర్ లు వారి బాధ్యతలు మరిచి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారని దుయ్యబట్టారు. కేటీఆర్ అమెరికా పారిపోయి ట్విట్టర్ లో రాజకీయాలు చేస్తుంటే, కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని ఇంతకు కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నారా లేక మరెక్కడైనా ఉన్నారా తెలియడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఆయన.. గతంలో అరిచి గీ పెట్టిన వారు ఎవ్వరు మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టలేదన్నారు. ఇది చరిత్ర అని దీన్ని కౌశిక్ రెడ్డి తెలుసుకోవాలన్నారు. ఎవరైతే ఇటువంటి వారిని వాడుకుంటారో వారు, వాడబడిన వారు నాశనం కాక తప్పదని ఇది తన 30 ఏళ్ల రాజకీయ జీవిత అనుభవంతో చెబుతున్నానన్నారు. కౌశిక్ రెడ్డిని ముందర పెట్టి కేటీఆర్, హరీశ్ రావు శిఖండి రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు ఏమి కాలేదని, పోయిన కల్వకుంట్ల కుటుంబం బ్రాండ్ ఇమేజ్ ను పెంచుకునేందుకు ఈ క్షుద్ర విద్యలన్నీ ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఫోర్త్ సిటీకి తాము పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తుంటే ఇక్కడ పరిస్థితులు బాగోలేవు అని చూపించేందుకు ప్రశాంతమైన వాతావరణాన్ని అస్థిర పరిచేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

హరీశ్ రావు ఏంటో నాకు బాగా తెలుసు:

పాడి కౌశిక్ రెడ్డికి అంత ధైర్యం లేదని ఆయన వెనుక కల్వకుంట్ల కుటుంబమే ఉండి ప్రోత్సహిస్తున్నదన్నారు. గత 20 ఏళ్లుగా హరీశ్ రావు ఏంటో నాకు తెలుసని, శిఖండి రాజకీయాలు పోషించడంలో, కుట్రలు కుతంత్రాలు చేయడంలో ఆయన నెంబర్ వన్ అని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇక్కడ ఒకరిని ఎగదోసి అక్కడ మామ దగ్గర పేరు కొట్టేయడం ఆయనకు అలవాటే అన్నారు. ఎంతో మంది ఉద్యమకారుల రాజకీయంగా గొంతుకోసిన చరిత్ర హరీశ్ రావుదన్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డి లాంటి ఉద్యమకారులను టికెట్ ఇప్పించుకోవడంలో విఫలమైన చరిత్ర హరీశ్ రావుదని మండిపడ్డారు. వీరితో గతంలో పని చేసిన ఉద్యమకారులకు వీళ్ల నిజ స్వరూపం ఏంటో తెలుసన్నారు. ఆయనే పార్టీ నుంచి ఎంతో మందిని బయటకు పంపించి పార్టీలో ఆయన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సున్నాకు పరిమితం అయ్యారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో సున్నాకు పరిమితం అయితే ఇక తెలంగాణ రాజకీయ క్షేత్రం నుంచి కనుమరుగు అవుతామనే ఆందోళనతో హైదరాబాద్ లో ఉంటున్న అన్ని రాష్ట్రాల ప్రజల మనసుల్లో భయాందోళనలు పుట్టించే పనికి పూనుకున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో శిక్షలు పడి జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఈ అంశంలో ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రాంతీయ బేధాలు సృష్టిస్తున్నారు. అవసరం వస్తే తెలంగాణ అనడం లేకుంటే తెలంగాణ ఏమి లేదు అనడం కేసీఆర్ కు బాగా అలవాటు అన్నారు. గతంలో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా చేయలేదా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలని యాగాలు చేస్తున్నారని ప్రజల దీవెనలు ఉన్నంత వరకు కేసీఆర్ ముక్కు నేలకు రాసిన ఈ ప్రభుత్వానికి ఏమి కాదన్నారు.

Advertisement

Next Story

Most Viewed