అసంతృప్తులకు BRS ఎర.. ఒకే జెడ్పీ చైర్మన్ పదవి నలుగురికి ఆఫర్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-17 06:44:53.0  )
అసంతృప్తులకు BRS ఎర.. ఒకే జెడ్పీ చైర్మన్ పదవి నలుగురికి  ఆఫర్!
X

పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్​పార్టీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడిగినోళ్లకు పదవులను ఎరగా వేస్తున్నారు. పెద్దపల్లి బీఆర్‌ఎస్​టికెట్​ఆశించి భంగపడిన నల్ల మనోహర్​రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని కేటీఆర్​హామీ ఇవ్వడంతోనే తిరిగి పార్టీలో చేరినట్లు ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ఓదెల జెడ్పీటీసీ గంట రాములు, జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్‌, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఉన్న రఘువీర్​‌సింగ్‌తోపాటు ఇటీవల పార్టీలో చేరిన మరో బీసీ నేతకు సైతం జెడ్పీ చైర్మన్​పదవి ఆశ చూపినట్లు ప్రచారం జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్‌ఎస్​నేతలు ఒక్క చైర్మన్​పదవిని నలుగురికి ఆఫర్​ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాక కాంగ్రెస్​నుంచి ఇటీవల బీఆర్‌ఎస్‌‌లో చేరిన పలువురికి రాష్ర్టంలో ప్రభుత్వం ఏర్పడిన తరవాత నామినేటెడ్​ పదవులు ఇస్తామని ఆశ చూపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రజాధరణ లేని నేతలను పక్కన పెట్టుకుని ప్రచారానికి వెళ్తున్నారని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తుండడం గమనార్హం. పదవుల ఆశతో పార్టీకి నాలుగు ఓట్లు ఎక్కువ వస్తాయని భావిస్తే అనేక ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్నవారు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే పదవుల ఎర పార్టీ అభ్యర్థి గెలుపు తీవ్ర ప్రబావం చూపనుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

దిశ, కరీంనగర్​ బ్యూరో : బీఆర్‌ఎస్​ పార్టీ మీద అలిగిన నేతలకు అధికార పార్టీ నేతలు బంఫర్​ఆఫర్లు ప్రకటిస్తున్నారు. పార్టీ టికెట్​ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు ఎన్నికల్లో పార్టీ గెలుపునకు సహకరించకపోవడంతో బుజ్జగింపుల పర్వానికి తెర తీశారు. నేతలను మచ్చిక చేసుకొని ఎన్నికల్లో గెలుపొందడానికి కొందరికి ఎమ్మెల్సీ పదవి, మరి కొందరికి కార్పొరేషన్​చైర్మన్ పదవులతో పాటు జెడ్పీ చైర్మన్​పదవిని ఆఫర్ చేస్తున్నారు. పెద్దపల్లి బీఆర్‌ఎస్​టికెట్​ఆశించి భంగపడిన నల్ల మనోహర్​రెడ్డికి పార్టీ టికెట్​ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్​పార్టీ అభ్యర్థుల ప్రకటన తరువాత పార్టీకి రాజీనామా చేశారు.

పెద్దపల్లి బీజేపీ టికెట్ కోసం ట్రై చేసినా రాకపోవడంతో ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశాడు. పెద్దపల్లి అసెంబ్లీ బరిలో ఇండిపెండెంట్‌గా నిలుస్తానని అందరి మద్దతు కూడగట్టారు. అయితే బుధవారం నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా కేటీఆర్​ సమక్షంలో తిరిగి బీఆర్‌ఎస్​పార్టీలో చేరిన మనోహర్​రెడ్డి తన నామినేషన్‌‌ను ఉపసంహరించుకున్నారు. ఎన్నికల తరువాత బీఆర్​ఎస్​అధికారంలోకి వచ్చిన తరువాత తనకు సామాజిక సేవ కోటలో ఎమ్మెల్సీ ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు మంత్రి కేటీఆర్​ హామీ ఇచ్చారని, అందుకే బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఆయన ప్రకటించారు.

నలుగురికి జెడ్పీ చైర్మన్ పదవి ఆఫర్​..

పెద్దపల్లి కాంగ్రెస్​పార్టీ టికెట్​ఆశించి భంగపడిన ఓదెల జెడ్పీటీసీ గంట రాములు పెద్దపల్లి బీజేపీ టికెట్​ట్రై చేయగా రాలేదు. దీంతో ఇటీవల బీఆర్‌ఎస్​ పార్టీలో చేరారు. రాములుకు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్​పదవీ ఇస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నాడు. జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్​సైతం టికెట్​ఆశించారు. బీఆర్‌ఎస్ టికెట్​సిట్టింగ్​ఎమ్మెల్యే మనోహర్​రెడ్డికి కేటాయించడంతో పార్టీ తీరుపై అలిగిన లక్ష్మణ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్​సమక్షంలో జరిగిన చర్చల్లో లక్ష్మణ్‌కు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్​పదవి ఇస్తానని హామీ ఇచ్చారు.

కేటీఆర్ హామీతో జెడ్పీటీసీ లక్ష్మణ్​తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఉన్న రఘువీర్​సింగ్‌కు సైతం జెడ్పీ చైర్మన్​పదవి హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. కాగా, ఈ ముగ్గురితో పాటు ఇటీవల పార్టీలో చేరిన మరో బీసీ నేతకు సైతం జెడ్పీ చైర్మన్​పదవి ఆశ చూపినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్‌ఎస్​ నేతలు ఒక్క చైర్మన్​పదవిని నలుగురికి ఆఫర్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

కార్పొరేషన్​పదవుల ఎర...

కాంగ్రెస్​పార్టీ నుంచి ఇటీవల బీఆర్‌ఎస్​పార్టీలో చేరిన పలువురికి రాష్ర్టంలో ప్రభుత్వం ఏర్పడిన తరవాత నామినేటెడ్​పదవి ఇస్తామని ఆశ చూపినట్లు ప్రచారం జరుగుతోంది. నామినేటెడ్ పదవి కోసం ఇటీవల సిట్టింగ్​ఎమ్మెల్యే మనోహర్​రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేసిన సదరు నేత ఇప్పుడు గూలాబీ గూటికి చేరడంతో సీనియర్​ బీఆర్‌ఎస్​నేతలు గుస్సా అవుతున్నట్లు పెద్దపల్లిలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీలో అనేక ఏళ్లుగా పని చేసిన వాళ్లకు కాకుండా పార్టీ ఫిరాయిస్తామని, ఎన్నికల్లో పోటీ చేస్తామని బెదిరించినోళ్లకు పదవుల ఆశ చూపించి గెలవాలని చేస్తున్న ప్రయత్నలు బీఆర్‌ఎస్​ పార్టీకి రివర్స్​అవుతున్నాయి. ప్రజాధరణ లేని నేతలను పక్కన పెట్టుకుని ప్రచారానికి వెళ్తున్నారని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. పదవుల ఆశతో పార్టీకి నాలుగు ఓట్లు ఎక్కువ వస్తాయని భావిస్తే అనేక ఏళ్లుగా పార్టీని పట్టుకుని ఉన్నవాళ్లు దూరం అవుతున్నారు. ఈ ప్రభావం వచ్చే ఎన్నికలపై ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed