BRS అలర్ట్.. ప్రతిపక్షాల దూకుడుతో రంగంలోకి ప్రగతి భవన్!

by Satheesh |   ( Updated:2023-02-24 04:07:03.0  )
BRS అలర్ట్.. ప్రతిపక్షాల దూకుడుతో రంగంలోకి ప్రగతి భవన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాప్రతినిధులు ఏం చేయాలనేది ప్రగతి భవన్ నుంచే మార్గదర్శనం చేస్తున్నారు. ఎక్కడ సమస్యలు ఉన్నాయి.. ఎలా పరిష్కరించాలి.. ఎవరిని కలుపుకొని పోవాలనే విషయాలను స్థానిక నేతలతో మానిటరింగ్ చేస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. ప్రతిపక్షాలకు ప్రజల్లో ఆదరణ రాకుండా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. నేత మధ్య ఉన్న బేధాభిప్రాయాలు సైతం సమసిపోయేలా చర్యలు తీసుకుంటున్నారు.

గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలపై ప్రగతిభవన్ దృష్టి సారించింది. కాంగ్రెస్ యాత్ర, బీజేపీ కార్నర్ మీటింగ్‌లలో ఆపార్టీ నేతల దృష్టికి ప్రజలు తీసుకొస్తున్న సమస్యలను ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్రభుత్వానికి నివేదిక అందజేస్తున్నారు. ఆ సమస్యలను ప్రాధాన్యత పరంగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.

అంతేకాదు ఆ నియోజకవర్గానికి చెందిన స్థానిక ఎమ్మెల్యేను అలర్ట్ చేస్తున్నారు. ఫలానా గ్రామంలో నీటి, రోడ్డు ఇలా మౌలిక సదుపాయాల సమస్య ఉందని వెంటనే పరిష్కరించాలని సూచిస్తున్నారు. అంతేకాదు స్థానిక ప్రజాప్రతినిధులు దగ్గరుండి సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు సైతం ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయినా ఆ సమస్యలు పరిష్కారం కాకుంటే సంబంధిత ఎమ్మెల్యే ఫెయిలూర్ కింద చూపుతున్నట్లు ఓ సీనియర్ నేత తెలిపారు. వారి పనితీరు ఆధారంగానే మళ్లీవారికి పార్టీ అవకాశం కల్పించనుంది.

రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలకు ప్రజల నుంచి ఆధరణ రాకుండా అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్నది. అందులో భాగంగానే ప్రజలకు చేరువయ్యేందుకు నిత్యం కార్యక్రమాలు చేపడుతున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలకు సమస్యలను వివరిస్తున్నారు. దీంతో అలర్టు అయి ఆసమస్యల పరిష్కారానికి చొరవచూపుతున్నారు. వారికి క్రెడిట్ రాకుండా స్థానిక ప్రజాప్రతినిధులను అలర్టు చేస్తున్నారు.

అంతేకాదు స్థానిక నేతల మధ్య ఉన్న గ్రూపు తగాదాల పరిష్కారానికి చర్యలకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. లేకుంటే స్థానిక సమస్యలు పరిష్కారం కావని, రాబోయే ఎన్నికల్లో సైతం ఆ ఎఫెక్ట్ పడుతుందని భావించిన అధిష్టానం ప్రగతిభవన్ నుంచి నేతల పనితీరుపై ప్రత్యేక నిఘా పెట్టింది. వారిని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతుంది. ప్రగతిభవన్ ఫోకస్ ఏ మేరకు సత్ఫలితాలనిస్తుందో చూడాలి.

Also Read...

బిగ్ న్యూస్: తెలంగాణ బీజేపీ నెక్ట్స్ సారథి ఎవరు.. రేసులో ముగ్గురు కీలక నేతలు?

Advertisement

Next Story