Rythu Bharosa : రైతు భరోసాపై బీఆర్‌ఎస్‌ పోరుబాట.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలు

by Ramesh N |
Rythu Bharosa : రైతు భరోసాపై బీఆర్‌ఎస్‌ పోరుబాట.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేసిన ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, రైతులు నిరసనలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కాంగ్రెస్‌ సర్కార్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇచ్చిన హామీ మేరకు తక్షణమే రైతు భరోసా అమలు చేయాలని గులాబీ శ్రేణులు డిమాండ్ చేశాయి.

కాగా, ‘రైతు భరోసా’ పథకం కోసం రైతన్నలు ఎదురు చూస్తున్నారు. పంట సాగు కోసం గత ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.10 వేలు రెండు విడతల్లో ఇచ్చేది. అయితే అదే పథకాన్ని రైతు భరోసాగా మార్చి పంట పెట్టుబడి సాయంగా (ఖరీఫ్, రబీ సీజన్‌లో) ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు అవుతున్నా.. ఇంకా ఈ పథకం అమల్లోకి రాలేదు. ఈ క్రమంలోనే రైతు భరోసాపై తాజాగా మంత్రి తుమ్మల కీలక అప్డేట్ ఇచ్చారు. తమ ప్రభుత్వంలో మాత్రం కేవలం సాగులో ఉన్న భూములకే రైతు భరోసా నిధులు జమ చేస్తామని స్పష్టంచేశారు. అందుకోసం సబ్ కమిటీ ఏర్పాటు వేసినట్లు తెలిపారు. విధివిధానాలు ఖరారు కాగానే.. రాబోయే పంట కాలం నుంచి రైతు ఖాతాల్లో రైతు భరోసా పంట సాయం అందిస్తామని ప్రకటించారు.

Advertisement

Next Story