ఆధ్యాత్మికతతో శుభారంభం..రాజశ్యామల యాగంతో BRS entry

by Mahesh |   ( Updated:2022-12-13 02:51:25.0  )
ఆధ్యాత్మికతతో శుభారంభం..రాజశ్యామల యాగంతో BRS entry
X

దిశ, తెలంగాణ బ్యూరో : జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజశ్యామల యాగంతో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే సీఎం కుటుంబ సమేతంగా ఢిల్లీకి చేరారు. మంగళవారం యాగాన్ని ప్రారంభిస్తారు. ముగిసిన తర్వాత బుధవారం లాంఛనంగా బీఆర్ఎస్ ఆఫీస్ ఓపెన్ చేస్తారు. పార్టీ నేతలను హాజరుకావాల్సిందిగా ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. 2018 లో రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లినప్పుడు నిర్వహించిన రాజశ్యామల యాగం కేసీఆర్‌కు అనుకున్నట్లుగానే కలిసొచ్చింది.

ప్రస్తుతం సెంట్రల్ పాలిటిక్స్ లోకి అడుగుపెడుతుండగా మరోసారి ఈ యాగాన్ని ఢిల్లీ వేదికగా నిర్వహిస్తున్నారు. అయితే కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ మాత్రం ప్రోగ్రామ్‌కు హాజరుకావడంలేదు. వివిధ రాష్ట్రాల నుంచి రాజకీయ నాయకులతో పాటు రైతు సంఘాల ప్రతినిధులు, ఆర్థికవేత్తలు హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రెండు రోజుల ముందే మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌ వెళ్లి ఏర్పాట్లను పూర్తి చేశారు.

2 వేల మందికి పైగానే..

యాగ నిర్వహణ స్థల పరిశీలన, ఏర్పాట్లను వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆఫీస్ ప్రారంభోత్సవం చేస్తారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీ చైర్‌పర్సన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌‌పర్సన్లు, నేతలతో పాటు తదితరులు సుమారు 2 వేల మందికి పైగానే పాల్గొంటున్నారు. అధినేత ఛాంబర్, ఆఫీసు నిర్వహణకు అవసరమైన ఫర్నీచర్‌, మీటింగ్ హాల్ రెడీ చేశారు. 'దేశ్ కా నేత' పేరుతో ఇప్పటికే తుగ్లక్ రోడ్డులోని కేసీఆర్ సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర, బీఆర్ఎస్ ఆఫీసు వద్ద భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు వెలిశాయి.

ఎంట్రీపై వివరించేందుకు..

నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండే కేసీఆర్ పలువురు రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, రక్షణాధికారులు, ఆర్థికవేత్తలు, రాజకీయ నాయకులతో భేటీకి అవకాశమున్నది. జాతీయ స్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ అవసరాన్ని వారికి వివరించడంతో పాటు అన్ని రాష్ట్రాల మీడియా ప్రతినిధులకు తెలియజేయడానికి ప్రెస్ కాన్ఫరెన్స్‌కు ముందస్తు ఏర్పాట్లు జరిగినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

Also Read...

స్పెక్ట్రా మాయ.. 30 వెంచర్లు అప్రూవల్ ఎన్ని?

Advertisement

Next Story