అప్పుడు కేసీఆర్ అలా.. ఇప్పుడు హరీశ్, కేటీఆర్ ఇలా..!

by karthikeya |
అప్పుడు కేసీఆర్ అలా.. ఇప్పుడు హరీశ్, కేటీఆర్ ఇలా..!
X

“హైదరాబాద్‌లో వర్షపు నీటిని తీసుకుపోయే నాలాల (స్టార్మ్ వాటర్ డ్రైనేజీ) మీద 28 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయి... అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తం.... ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబడవు.. కట్టదల్చుకున్నవారికి కూడా నేను హెచ్చరిక చేస్తూ ఉన్న.. కట్టి మీ ఆస్తుల్ని చెడగొట్టుకోకండి.. డబ్బుల్ని పాడుచేసుకోకండి.. నిర్దాక్షణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తది.. జీహెచ్ఎంసీ వస్తది.. గుర్తుపెట్టుకోండి..” – కేసీఆర్, సెప్టెంబరు 26, 2016, మీడియా సమావేశంలో..

“హైడ్రా పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారు... కేవలం ప్రతిపక్ష నేతల ఆస్తులను, ఇండ్లనే టార్గెట్ చేస్తున్నారు.., పేదల ఇండ్లను ఏమాత్రం సమయం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు... ఒక శాఖ రిజిస్ట్రేషన్ చేస్తుంటే మూడు రోజుల తర్వాత ఇంకో శాఖ ఇంటిని కూలగొడుతున్నది... హైడ్రా పేరుతో హైడ్రామా వద్దు.. హైదరాబాద్ బాగు కోసం పనిచేయండి... అసలు పర్మిషన్లు ఇచ్చినోళ్లను బయటకు తీయండి...” – కేటీఆర్, సెప్టెంబరు 24, 2024.

దిశ, తెలంగాణ బ్యూరో: హైడ్రా కూల్చివేతలు అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలకు దారితీసింది. హైడ్రా చర్యలను బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. పేదల ఇండ్లను కూల్చివేయడాన్ని తప్పుపడుతున్నారు. ఆ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని, న్యాయ సాయం కోసం సంప్రదించవచ్చని, ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని భరోసా కల్పించారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై గతంలో సీఎం హోదాలో కేసీఆర్ చేసిన హెచ్చరికలకు వ్యతిరేకంగా ఇప్పుడు కేటీఆర్, హరీశ్‌రావు స్టేట్‌మెంట్లు ఇవ్వడం ఆ పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. అక్రమ కట్టడాలను కూల్చివేస్తామంటూ అప్పట్లోనే కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో అదే పని చేస్తూ ఉంటే అదే పార్టీ లీడర్లు తప్పుపట్టడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ విధానానికి వ్యతిరేకంగా కేటీఆర్, హరీశ్‌రావు మాటలు ఉన్నాయని, అధికారంలో ఉన్నప్పుడు ఒక తరహాలో, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా మరో తీరులో వ్యవహరించడాన్ని వేలెత్తి చూపడానికి దారితీసింది.

హైడ్రా కూల్చివేతలపై దాదాపు నెల రోజులుగా కేటీఆర్, హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వంపై అనేక రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. బాధితులకు అండగా నిలబడేలా తెలంగాణ భవన్‌లో ప్రత్యేక ఏర్పాట్లే జరిగాయి. దీనికి తోడు బాధితుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు ప్రత్యేక క్యాంపెయిన్‌ చేపట్టారు. కేవలం రాజకీయ ప్రతీకారం కోసం ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతల ఇండ్లనే టార్గెట్ చేసిందంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగస్టు చివరి వారంలో కామెంట్ చేసిన కేటీఆర్... నాలుగు రోజుల క్రితం పేదల ఇండ్లను నిర్దాక్షిణ్యంగా హైడ్రా కూల్చివేస్తున్నదంటూ వ్యాఖ్యానించారు. ఒకవైపు ప్రతిపక్షాలకు చెందిన లీడర్ల ఇండ్లను టార్గెట్ చేసిందంటూనే నెల రోజుల వ్యవధిలో పేదల ఇండ్లను అని కేటీఆర్ వ్యాఖ్యానించడం బీఆర్ఎస్‌ నేతల మధ్యనే చర్చకు దారితీసింది. ఇంత జరుగుతున్నా ఆనాడు ఆక్రమణల కూల్చివేతలపై గట్టి హెచ్చరికలు చేసిన పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటివరకూ ఎలాంటి కామెంట్ చేయకుండా సైలెంట్‌గా ఉండిపోవడం, పార్టీ విధాన నిర్ణయం తెలియక ఆ పార్టీ నేతల్లో అయోమయం నెలకొనడం గమనార్హం.

హైదరాబాద్ నగర ప్రజలను వరద ముంపు నుంచి బైటపడేసేందుకు అక్రమ కట్టడాలను కూల్చివేయక తప్పదని, వరద నీటిని తీసుకెళ్ళే నాలాల మీద కట్టడాలను సహించే ప్రసక్తే లేదని ఎనిమిదేండ్ల క్రితమే కేసీఆర్ హెచ్చరించారు. ఇలాంటి అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూల్చేటప్పుడు కూడా పాజిటివ్ ధోరణితో వ్యవహరించాలని, ప్రభుత్వానికి సపోర్టు చేయాలని కోరారు. కూల్చివేతల అవసరాన్ని కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో పైతీరులో వివరించారు. కేటీఆర్ మాత్రం “బిల్డింగ్‌లను నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు.. పేదలను రోడ్డున పడేస్తున్నారు.. మనం కన్‌స్ట్రక్షన్ చేశాం... ఈయన మాత్రం డిస్ట్రక్షన్ చేస్తున్నారు.. పర్మిషన్ ఇచ్చిందెవడు.. దమ్ముంటే వాళ్లపై చర్యలు తీసుకోవాలి..” అని సీఎం రేవంత్‌ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎనిమిదేండ్ల క్రితం కేసీఆర్ హెచ్చరించగా ప్రస్తుతం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అదే పని చేస్తున్నదని, కానీ కేసీఆర్ నిర్ణయానికి భిన్నంగా ఇప్పుడు కేటీఆర్, హరీశ్‌రావు విమర్శిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు వేలెత్తి చూపుతున్నారు. పార్టీకి నిర్దిష్టమైన వైఖరి లేదా అని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. అమృత్ పథకం స్కామ్ అంటూ ఇటీవల విమర్శలు చేసిన కేటీఆర్... ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. తాజాగా హైడ్రా అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు.

Advertisement

Next Story