ఏపీని సీఎం జగన్ అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశాడు: తోట చంద్రశేఖర్

by Satheesh |
ఏపీని సీఎం జగన్ అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశాడు: తోట చంద్రశేఖర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: లక్షలాది కోట్ల అప్పులతో ఏపీ ఆర్ధిక వ్యవస్థ కుదేలైందని బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి శూన్యం అప్పులు ఘనం అన్న చందంగా ఏపీలో వైకాపా ప్రభుత్వ అసమర్ధ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఏపీకి చెందిన పలువురు బీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పరిమితికి మించి అప్పులు తెచ్చి ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజల కళ్లకు గంతలు కట్టి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. ఓ వైపు నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు లేక పొరుగు రాష్ట్రాలకు వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రగల్బాలు పలికిన సీఎం వాగ్ధానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెల జీతాల కోసం ఎదురు చూడాల్సిన దుర్భర పరిస్తితులు నెలకొన్నాయన్నారు. మాట తప్పను మడెం తిప్పనన్న జగన్ మాటలు నీటి మూటలే అని మరో మారు నిరూపించాయన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టి ప్రజలకు అభివృద్ధితో కూడిన సంక్షేమ పాలన అందించకుంటే రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. పార్టీలో చేరిన వారిలో విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెద్ద మేడపల్లి గ్రామానికి చెందిన మాదిరెడ్డి జగన్‌తో సహా పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed